పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

చేశారు. మౌల్వీ ఇబ్రహీం తిరుగుబాటు పతాకంతో ముందు నడిచి పోరుకు కదలిన జనసమూహాన్ని ముందుకు నడిపించారు. ఈ సమాచారం అందుకున్న బ్రిటిషర్లు, నిజాం పాలకులు ముందుగానే సైన్యాలను మోహరించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన పోరాటంలో తిరుగుబాటు సైన్యాలకు విజయం అసాధ్యమైంది.

ఈ సందర్భంగా జరిగిన అరెస్టుల నుండి మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ చాకచక్యంగా తప్పించుకున్నారు. చాలా కాలం తరువాత ఓ ద్రోహి అందించిన సమాచారం ఆధారంగా మంగలపల్లి వద్ద నిజాం-బ్రిటిషు సైన్యాలు ఆయనను నిర్బంధించాయి. ఆయన మీద పలు నేరారోపణలు మోపి విచారణ తంతు జరిపి ద్వీపాంతరవాస శిక్ష విధించారు. 1859 జూన్‌లో ఆయనను అండమాన్‌ తరలించారు. ఆండమాన్‌లో పాతికేళ్ళపాటు మగ్గిపోయిన మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ 1884లో జైల్లోనే కన్నుమూశారు.

ఈ పోరులో తిరుగుబాటు యోధుల నాయకుడు పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ గాయపడి పట్టుబడ్డారు. ఆయన మీద విచారణ జరిగింది. ఆ విచారణలో తన సహచరులను ఇబ్బందుల పాల్జేయటం ఇష్టంలేక నేరమంతా తనదేనన్నాడు. చివరకు ఆయన ప్రధాన సహచరులు మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ కూడా ఎవరో తనకు తెలియదని, తానుగా ప్రజలను ప్రేరేపించి పోరుబాట నడిపించానని తుర్రేబాజ్‌ ఖాన్‌ ఎంతో ధీరోదాత్తంగా ప్రకటించారు. ఆయన నిర్బంధించగా 1859 జనవరి18లో నిర్బందంనుండి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఆ తరువాత మెదక్‌ సమీపంలో నిజాం, బ్రిటిష్‌ సైన్యాలతో మరోమారు తలపడిన ఆయనను శత్రు సైనికులు కాల్చి చంపారు. ఆ తరువాత తుర్రేబాజ్‌ ఖాన్‌ భౌతికకాయాన్ని నగరానికి తెచ్చి తిరుగుబాటు వీరులను, ప్రజలను మరింత భయభ్రాంతులను చేసేందుకు నగరం నడిబొడ్డున ప్రస్తుత సుల్తాన్‌ బజార్‌ పోలీసు స్టేషన్‌ ఉన్నప్రాంతంలో బహిరంగంగా వ్రేలాడ దీశారు. ఆ విధంగా ఆ వీరుని భౌతిక్కాయం వారం రోజులపాటు నగరం నడిబొడ్డున గుంజకు వ్రేెలాడింది. ఈ విధంగా పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ ముఖ్యఅనుచరుడు జాన్‌ అహమ్మద్‌ కూడా ఆయనతో పాటు ఆ పోరాటంలోనే మరణించారు.

రాయలసీమలో రగిలిన పోరాటం

ఈ పోరాట ప్రకంపనలు హైదారాబాదు వరకు పరిమితం కాలేదు. పౌరుషాల పోతుగడ్డగా ఖ్యాతిగాంచిన రాయలసీమకు కూడా పాకాయి. ఆ సమయంలో కడపజిల్లా ఎల్లంపేట నివాసి షేక్‌ పీర్‌ సాహెబ్‌ తిరుగుబాటుకు సిద్దమయ్యారు.

1857 ఆగస్టు 28న కడపలోని కోంన్మెంటులోని భారతీయ సైనిక అధికారులను, సైనికులను తిరగబడమని ఆయన ప్రోత్సహించారు. పుట్టుకతో అంధుడైన పీర్‌ సాహెబ్‌

32