పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

మద్దతుదారుడు తమకు దూరమైతే అధికారం అంతా తమకు దూరం కాగలదని భయపడ్డారు. దక్షిణాది నుండి నిజాం కనుక తిరుగుబాటులో పాల్గొన్నట్టయితే తమ ఆధిపత్యం అంతం కాక తప్పదని భయపడిన ఆంగ్లేయులు నిజాం జారిపోయినట్టయితే అంతా జారి పోయినట్లే అనే స్తిరమైన అభిప్రాయానికి వచ్చారు. అందువలన తిరుగుబాటు ప్రభావానికి, ప్రమాదానికి నిజాం సంస్థానం ఏమాత్రం గురికాకుండా ఉండేందుకు తమ శాయశక్తుల విజయవంతంగా కృషిచేశారు. చివరకు నిజాంను మంచి చేసుకుంటూ, నిరంతరం ఆయనకు పలు ఆశలు కల్పిస్తూ, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి దూరంగా ఉంచగలిగారు.

తెల్లవారిని తరిమి...తరిమి కొట్టండి !

పరాయి పాలకుల పెత్తనం ఏమాత్రం నచ్చని నైజాం సంస్థానంలోని ప్రజలలో ఓర్పు, సహనం పూర్తిగా నశించాయి. నవాబు మీద గౌరవంతో తిరుగుబాటుకు ముందుకు రావాల్సిందిగానూ, ఆంగ్లేయుల పెత్తనం నుండి విముక్తం కావాల్సిందిగానూ నవాబుకు ఆహ్వానం పలికిన స్వాతంత్య్రకాంక్షాపరులు అది సానుకూలం కాకపోవడంతో తమ ఆగ్రహాన్ని తెల్లవారి మీదకు మళ్ళించారు. ఆ ఆగ్రహజ్వాలల నుండి తెల్లవార్ని తరిమి కొట్టమని, మట్టుబెట్టమని నినాదాలు ఉద్భవించాయి. ఆ నినాదాలు కాస్తా నగరం గోడల మీద ప్రకటనల రూపంలో కన్పించాయి. ("Faithful to murder the ferminghee.." History of the Deccan Vol.II, JDE Gribbnle, Mittal Publications, New Delhi, ,1990, ఆబివీలి.257).

ఈ క్రమంలో ఆంగ్లేయాధికారులను భయపెట్టేందుకు ప్రజలు ఉద్దేశ్యపూర్వకంగా పలు విధాలుగా ప్రచారాలు సాగించారు. ఈ విషయాన్నిఆంగ్లేయాధికారి బ్రిగ్స్ వివరిస్తూ, నైజాం సంస్థానంలోని మంత్రులు, ఉన్నతాధికారులు తేనెపూసిన కత్తుల్లా వ్యవహరించే వారు. పైకి స్నేహపూరితంగా ఉంటూనే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని సలహా ఇచ్చేవారు. ఇక్కడి పరిస్థితులు బాగాలేవు. మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు అని చెబుతూనే పారిపోయేలా చేసేవారు. పారిపోతే అధికారి పరువుపోతుంది. బ్రిటిష్‌ ప్రభుత్వపు నైతిక బలం దెబ్బతింటుంది అని వారి ఉద్దేశ్యం, అని ఆనాటి పరిస్థితులను ఆంగ్లేయుడు అక్షరబద్ధం చేశాడు. (1857 తెలుగునాట తిరుగుబాటు,డాక్టర్‌ కె.మహాంకాళి,పేజి.17-18). ఆ సమయంలో షంషుల్‌ ఉమ్రా చిన్న కుమారుడు ఇఫ్తెకారుల్‌ ముల్క్‌ హైదారాబాదులో బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యామాన్ని లేవదీశాడని అప్పి కల్నల్‌ డేవిడ్‌సన్‌ ఉన్నతాధికారులకు రిపోర్టు చేశాడు. నిజాంకు, బ్రిటిషు వారికి విరుద్ధంగా మాట్లాడిన వారినందరిని, అమీరు గాని, సాధారణ పౌరుడుగాని కేవలం బెదిరించి వదిలేయడం మాత్రమే కాకుండా వారిని నిర్బంధించాలని ఆ ఆంగ్లేయాధికారి ఆజ్ఞాపించాడు. (హైదారాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, పేజి.31).

27