పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

ప్రథమ స్వాతంత్య్ర సమరయోధులు పూరించిన సమర శంఖారావాన్ని అంది పుచ్చుకున్న తెలుగు ప్రజలు బ్రిటిషర్ల పెత్తనాన్ని ఇక ఏమాత్రం సహించేది లేదని సాయుధులై కదిలారు. ఉత్తర భారతావనిలో ఈ పోరు ప్రారంభం కాకముందే ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాలలో ఆత్మాభిమానం గల యోధులు, బ్రిటిష్‌ అధికారుల ఆజ్ఞలను ఖాతరు చేయకుండా తిరుగుబాటు పతాకాలను ఎగుర వేసిన చరిత్ర కలిగి ఉన్నారు.

1857కు పూర్వం వహాబీ ఉద్యమం ప్రభావంతో తెలుగునాట పడిన తిరుగుబాటు బీజాలు 1857 నాటికి మొలకలెత్తటం ఆరంభించాయి. 1857కు ముందు ఆంధ్రా ప్రాంతంలో చిగురించిన తిరుగుబాటులను బ్రిటిషర్లు కర్కశంగా చిదిమివేశారు. బ్రిటిషర్ల పెత్తనం సహించలేక, 1846 ప్రాంతంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ప్రజానాయకుడు నరసింహారెడ్డి బ్రిటిషర్ల మీద తిరగబడితే ఆయనకు ఆ ప్రాంతానికి చెందిన మరో యోధుడు మహమ్మద్‌ ఖాన్‌ అండగా నిలిచారు. అలాగే నరసింహారెడ్డికి హైదారాబాదుకు చెందిన సలాం ఖాన్‌ అను నాయకుడు సహకరించినట్టు దాఖలాలు ఉన్నాయి.(Article titled 1846 Revolt of Rayalaseema : Some Reflections, by N.Raghavendra, Publihsed in Andhra Pradesh History Congress, Proceedings of the Tenth Session, Guntur, 1986, Page.197) ఈ నరసింహారెడ్డి సాహస చరిత్ర టెలీ సీరియల్‌గా కూడాప్రసారం అయ్యింది. ఆ తిరుగుబాట్లు పటిష్టమైన పోరాట రూపాలుగా పరిణితి చెందక ముందే ఆధునిక ఆయుధాలు, శిక్షణ పొందిన సైనిక బలగాలు గల ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆ తిరుగుబాట్లను నలిపి వేయడంతో అవి చరిత్రలో తగినంత స్థానం పొందలేకపోయాయి.


ఉత్తర భారతదేశంలో రగులుతున్న బ్రిటిష్‌ వ్యతిరేకత తిన్నగా దక్షిణ భారత దేశాన్ని కూడా చుట్టేశాక, నిజాం సంస్థానంలో కూడాఆ ప్రభావం స్పష్టంగా బలపడసాగింది. ఈ పోకడలు ఎంతవరకు విస్తరించాయంటే పోరుబాట నడవండి మేం మీ వెంట ఉంటాం అంటూ సంస్థానాధీశుడికి ప్రజానీకం నేరుగా సలహా ఇచ్చేంత స్థాయిలో బ్రిటిష్‌ వ్యతిరేకత నైజాం సంస్థానంలో ఉనికిని సంతరించుకుని ఊపందుకుంది.

అఫ్జలుద్దౌలా ... పోరుబాట నడవండి

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులకు వ్యతిరేకంగా, ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని నిరసిస్తు ప్రజలు ముందుకు రాసాగారు. ఈ మేరకు సాగిన ఆంగ్లేయ వ్యతిరేక ప్రచార కార్యక్రమాలలో ప్రధానంగా మొఎల్వీలు, మషాయక్‌లు, పేష్‌ ఇమాంలు పూర్తిగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా బద్ధ విరోధులుగా మారి రాత్రింబవళ్ళు వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆనాడు ప్రజలలో పొడచూపిన ఈ వ్యతిరేకత ఆంగ్లేయుల వరకు మాత్రమే పరిమితమైంది. స్వదేశీ పాలకుడు నైజాం సంస్థానాధీశుడి పట్ల ఎంతో గౌరవం కలిగిన ప్రజలు ఆయనను

25