పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆ విధంగా 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి పూర్వమే భరతగడ్డ మీద వీచిన బ్రిటిష్‌ వ్యతిరేక పవనాలకు తెలుగుబిడ్డలు కూడా తగు విధంగా స్పందించారు. ఆ ప్రతిస్పందనల మేరకు తమ తమ ప్రాంతాలలో తగిన చర్యలకు పూనుకున్నారు.

తెలుగుగడ్డ మీద ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో తెలుగు ప్రజల పాత్రను గమనించే ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్‌గా ప్రస్తుతం పిలువబడుతున్న సర్కారు, రాయలసీమ, కోస్తా ఆంధ్రా, తెలంగాణాలు ఎవరి ఏలుబడిలో ఉన్నాయో తెలుసుకోవటం చాలా అవసరం. పాలకులు, ఆ పాలకుల స్వభావం, పరిపాలనా వ్యవస్థను బట్టి కూడా ఆయా ప్రాంతాల ప్రజల స్పందన -ప్రతిస్పందనలు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమైన తెలంగాణా, రాయలసీమ, కోస్తా ప్రాంతాలు ఆనాడు పూర్తిగా అటు బ్రిటిషర్ల పాలన క్రింద గాని లేక ఇటు నిజాం నవాబు ఏలుబడి క్రింద గాని లేవు. ఈ ప్రాంతాలు ప్రథమంలో నిజాం నవాబు ఆధీనంలో ఉన్నప్పటికీ, ఫ్రెంచివారి ప్రాపకం కోసం 1753లో కొంత ప్రాంతాన్ని, బ్రిటిషర్ల అండదండల కోసం మరికొంత భూభాగాన్ని 1800లో నైజాం నవాబులు ధారాదత్తం చేశారు. ఈ భూభాగాలను ఉత్తర సర్కారు, సీడెడ్‌ ప్రాంతాలుగా ఆనాడు పిలిచేవారు. 1800 నాటికి ఈ ధారాదత్తం ప్రక్రియ పరిసమాప్తమైంది. ఆనాటి ఉత్తర సర్కారు, సీడడ్‌ జిల్లాలు కలిసి మద్రాసు ప్రెసిడన్సీలో భాగమైన ఆంధ్రప్రాంతం ఏర్పడింది. మిగిలిన ప్రాంతాలు నిజాం పాలకుల ఏలుబడి క్రింద ఉండిపోయాయి. ఈ ప్రాంతం తెలంగాణగా పిలువబడింది. 1857 నాటికి ఆంధ్రప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఏలుబడిలో ఉండగా, తెలంగాణ ప్రాంతం నిజాం సంస్థానాధీశుని పాలన క్రింద ఉంది.

స్థాయీ భేదాలతో పోరుబాట

ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి రాజ్యవ్యవస్థ లేదా పాలనా వ్యవస్థను బట్టి ఆ ప్రదేశాలలోని ప్రజానీకం స్థాయి భేదాలతో 1857 నాటి పోరాటంలో పాల్గొన్నారు. ప్రథమ స్వాతంత్య్ర సమరం సృష్టించిన ప్రకంపనలు నిజాం ప్రాంతాలలో కన్పించినంతగా, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతమైన ఆంధ్రా ఏరియాలో తొలిదశలో కన్పించలేదు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో లాగా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతమైన ఆంధ్రాలో పదవీచ్యుతులు గావించబడిన స్వదేశీ పాలకులు, ప్రభువులు లేకపోవడం ప్రధాన కారణం కావొచ్చు. నిజాం ప్రాంతంలో స్వదేశీ పాలకుడున్నా కూడా, అక్కడ ఆంగ్లేయుల ఆధిపత్యం సాగుతున్నందున, ప్రజలు తమపై సాగుతున్న విదేశీయుల పెత్తనానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా విజృంభించారు.

24