పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

వరకు అంగీకరించలేదు. తమ మాట సాగదని, తమ పోరు విజయం సాధించదని తెలిసినా కూడా, ఆత్మాభిమానంతో పోరుబాటన సాగి నిర్బంధాలకు గురై, జైళ్లలో మగ్గిపోయినవారు, ప్రాణాలను ఉరికంబాల మీద బలిపెట్టిన మానధనులైన యోధులు ఎందరో ఉన్నారు.

నూరుల్‌ ఉమ్రా తరువాత మరో ప్రముఖుడు బ్రిటిష్‌ వ్యతిరేక వేదిక మీదకు వచ్చారు. ఆయన నిజాం నవాబు సికిందర్‌ ఝా బహుదూర్‌ కుమారుడు, అప్పటి నైజాం నవాబు నాసిరుద్దౌలా సోదరుడు అయినటువంటి ముబారిజుద్దౌలా. ఆయన అసలు పేరు మీర్‌ గోహర్‌ అలీ ఖాన్‌. బ్రిటిషర్ల అడుగులకు మడుగులొత్తే నవాబుల నైజానికి ఆయన బద్ధ వ్యతిరేకి. చిన్నతనం నుండి ఆంగ్లేయ వ్యతిరేక స్వభావం గల ముబారిజుద్దౌలా వహాబీల ద్వారా బాగా ప్రభావితులయ్యారు. నైజాం సంస్థానంలో పెత్తనం సాగిస్తున్న ఆంగ్లేయుల వైఖరిని ఆయన నిరసించారు. ఆంగ్లేయుల అడుగులకు మడుగు లొత్తుతున్న ప్రభువుల వైనాన్ని సహించలేని స్థితిలో ఆయన ఆంగ్లేయుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు.

1815లో స్వేచ్ఛా-స్వతంత్ర భావాల ముబారిజ్‌ద్దౌలా కంపెనీ పాలకుల మీద తిరుగుబాటును ఆరంభించారు. 1830లో అరబ్బు, ఆఫ్గన్‌ జాతీయులతో కలిసి తిరగబడ్డారు. అయితే నిజాం, బ్రిటిషర్ల సంయుక్త బలగాల ముందు ఆయన పోరాటం ఊపిరి పీల్చుకోలేక పోయింది. ఆయన నిర్బంధానికి గురయ్యారు. ఆ తరువాత మరోమారు ఆయన పోరుకు సిద్ధపడగా, 1839లో బ్రిటిష్‌ రాణికి, నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారన్న నేరం మోపి ఆయనకు జీవిత ఖైదు విధించారు. ఆయన అనుచరులకు 10 సంవత్సరాలకు పైబడిన జైలు శిక్షలు పడ్డాయి. చిట్టచివరకు ముబారిజుద్దౌలా ఆ శిక్షను అనుభవిస్తూ గోల్కొండ కోటలో 1854 జూన్‌ 25న కన్నుమూశారు.

ఈ మేరకు బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌ ముబారిజుద్దౌలాతో చేతులు కలిపారు. ఈ విషయాన్ని పసిక్టిన బ్రిటిష్‌ అధికారులు టి.యల్‌.బ్లేన్‌ అను అధికారిని విచారణ కోసం కర్నూలు పంపారు. ఆ విచారణ తరువాత 1839 అక్టోబర్‌ 18న ఎ.బి.డైస్‌ అను సైన్యాధికారి నాయకత్వంలో ఆంగ్లసైన్యం కర్నూలు నవాబు సంస్థానం మీద దాడి చేసింది. ఆ పోరాటంలో నవాబు గులాం రసూల్‌ ఆంగ్ల సైన్యాలను వీరోచితంగా ఎదుర్కొనప్పటికి పరాజితులయ్యారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యం ఆయనను అరెస్టు చేసి తిరుచునాపల్లి ఖైదుకు తరలించింది. ఆ జైలులోనే ఆంగ్లేయుల కుట్ర ఫలితంగా గులాం రసూల్‌ తన సేవకుని చేతిలో హత్యకు గురయ్యారు. ఈ విధంగా గులాం రసూల్‌ పోరాట జీవితం 1840 జూలై 12న ముగిసింది. ( Article titled The Political Relations Between The Nawabs of Kurnool and The English East India Company, by Syed Moosa Miah, Publihsed in Andhra Pradesh History Congress, Proceedings of the Ninth Session, Kurnool, 1985 Page. 156-157)

23