పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

తొలి తిరుగుబాటు నాయకుడు సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌

ఈ ధిక్కరణకు విశాఖపట్నంలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలో సుబేదార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్‌ అహమ్మద్‌ నాయకత్వం వహించారు. సుబేదార్‌ అహమ్మద్‌ తన సైనిక సహచరులతో కలసి మైసూరుకు ఒక్క అడుగు కూడాతాము కదిలేది లేదని ఆంగ్లేయాధికారులకు స్పష్టం చేశారు. అయినా ఆధికారులు తీవ్ర వత్తిడి తీసుకరాగా అధికారుల మీద తిరగబడి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా పలువురు ఆంగ్లేయ అధికారులు ప్రాణాలు వదిలారు. స్వదేశీసైనికుల కట్టలు తెంచుకున్న ఆగ్రహానికి తట్టుకోలేక కంపెనీ సైన్యాధికారులు కాళ్ళకు బుద్ధి చెప్పారు. స్వదేశీ సైనికుల తుపాకి గుండ్ల నుండి ప్రాణాలను రక్షించుకునేందుకు కలుల్లోకి దూరిన ఎలుకల్లా దాక్కొన్నారు.

ఆ చర్యతో విశాఖపట్నంలోని బ్రిటిష్‌ సైనికస్థావరమంతా సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ నాయకత్వంలో గల స్వదేశీ సైనికుల అధీనంలోకి వచ్చింది. ఆంగ్లేయాధికారులు పారిపోగా, చేతికి చిక్కిన అధికారుల నుండి కావాల్సిన సమాచారం రాబట్టి కోశాగారంలోని ధన సంపదను, ఆయుధాగారంలోని ఆయుధాలను సుబేదార్‌ అహమ్మద్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా చూస్తే భారతదేశంలో ఆంగ్లేయుల మీద మొట్టమొదటిసారిగా తిరుగుబాటు శంఖారావం పూరించి, ఆంగ్లేయులను తరిమికొట్టి సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్న స్వదేశీ సైన్యాధికారిగా సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ను చెప్పుకోవచ్చు.

ఈ విషయాన్ని ఆంధ్రా విశ్వవిద్యాలయం చరిత్ర శాఖాధిపతి డాక్టర్‌ కొల్లూరు సూర్యనారాయణ నవంబరు 28, 2006న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రచయితతో మ్లాడుతూ, తొలి తిరుగుబాటు 1780 అక్టోబరు 3న విశాఖపట్నం లో జరిగింది...దురదృష్టవశాత్తు ప్రజలకు మంగళపాండే మాత్రమే తెలుసు, అన్నారు.

ఈ విషయాన్నిఆయన 'దక్కన్‌ క్రానికల్‌' దినపత్రికలో ప్రచురితమైన ఆర్టికల్‌లో మరింతగా వివరంగా రూఢి చేశారు. ('The First revolt occured in Vizagapatnam on October 3,1780...Unfortuntely people know only about Mangal Pande' - 'Deccen Chronicle', Daily,Vijayawada, 01-10-2006, Page 1-2).

షేక్‌ అహమ్మద్‌ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యక్తిగా ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆర్కియాలజీ విభాగం విశ్రాంత అధిపతి డాక్టర్‌ ఇ.వి. గంగాధరం సమాచారం ద్వారా తెలుస్తుంది. విశాఖలో సుబేదార్‌ అహమ్మద్‌ స్మృతిచిహ్నం గా రూపొందించిన స్థూపానికి సంబంధించిన వివరాలను తెలుపడం మాత్రమే కాకుండా తాను రూపొందించిన ఆ చిహ్నం రఫ్‌స్కెచ్‌ కూడా 1999 లో డాక్టర్‌ ఇ.వి. గంగాధరం రచయితకు అందించారు. ఈ కథనం ప్రకారం చూస్తే 1780లోనే తెలుగు బిడ్డడు సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ నాయకత్వంలో

21