పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశోధకులను కలిశాను. ఆయా విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాను. ఆ విధంగా సమకూర్చుకున్న సరికొత్త సమాచారాన్ని ఈ గ్రంథంలో పొందుపర్చాను.

1780లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన విశాఖపట్నం సైనిక స్థావరంలో సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ చేసిన తిరుగుబాటు ప్రస్తుత పుస్తకంలో మార్పులు-చేర్పులకు లోనయ్యింది. గతంలో లభించిన సమాచారం, కొందరు చరిత్రోపన్యాసకుల, పరిశోధకుల దృవీకరణల ఆధారంగా సుబేదార్‌ అహమ్మద్‌ నేతృత్వంలో 1857లో విశాఖపట్నం లో తిరుగుబాటు జరిగినట్టు రాశాను. కానీ ఆ తిరుగుబాటు 1780 సెప్టెంబర్‌లో జరిగిందని తెలిసింది. ఆ విధంగా నూతనంగా లభించిన సమాచారాన్ని పలు విశ్వవిద్యాలయాల చరిత్రోపన్యాసకులతో, చరిత్రకారులతో సంప్రదించి దృవీకరణకు అవసరమగు గ్రంథాలను, పత్రాలను పరిశీలించి విశాఖపట్నంలో సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ చేసిన తిరుగుబాటు 1780లో జరిగిందన్న విషయాన్ని ప్రస్తుత పుస్తకంలో పేర్కొన్నాను.

ప్రస్తుత గ్రంథాన్నినాలుగు భాగాలుగా అందిస్తున్నాను. ఈ పుస్తకంలోని మొదటి భాగంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు ఆరంభమైన తొలి దశనుండి చివరకు బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమం విజయవంతమయ్యి, స్వాతంత్య్రం సాధించిన తరువాత ఆంధ్రాప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడేంత వరకు సమాచారాన్ని సంక్షిప్తంగా పొందుపర్చాను. ఈ కథనానికి భారత స్వాతంత్య్రోద్యమం కాలం నాటి ప్రధాన సంఘటనలను పాఠకుల స్మృతిలోకి తెచ్చేందుకు స్వాతంత్య్రోద్యమం సాగిన తీరు తెన్నులను వివరిస్తూ, ఆయా ప్రధాన సంఘటనల రూపాలను పాఠకుల ఎదుట సాక్షాత్కరింపచేసేందుకు జాతీయ, ప్రాంతీయ స్థాయిలో స్పూర్తిదాయకంగా నిలచిన అలనాటి సంఘటనల పలు చిత్రాలను, ఫోటోలను జోడించాను.

బ్రిటిష్‌ వ్యతిరేక పోరాలలో పాల్గొన్న స్వాతంత్య్రసమర యోదుల జీవిత రేఖా చిత్రాలను అనుబంధం-1 గా ప్రత్యేకించి రెండవ భాగంలో ఇచ్చాను. ఈ భాగంలో మొత్తం 50 మంది యోధుల జీవిత చరిత్రలను పొందుపర్చాను. ఈ జీవన రేఖాచిత్రాలలో, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి ఇక్కడే గడిపిన వారి గురించి మాత్రమే కాకుండా, తెలుగుగడ్డ మీద కళ్ళుతెరచి, బాల్యం ఇక్కడే గడిపి, ఆ తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడిన స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను కూడ కలిపాను.

ఈ విభాగంలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఆ తరువాత సాగిన ప్రజాపోరాటాలలో ప్రముఖ పాత్ర నిర్వహించిన వారున్నారు. అందులో రజియా బేగం, జమాలున్నీసా బాజీ లాంటి వారు ఆనాటి వారి కార్యక్రమాల వివరాలను స్వయంగా వెల్లడించినందున అ వివరాలు గ్రంథస్థమయ్యాయి. ఆ పోరాటాలలో ఇతరులెవ్వరికీ