Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.⁠

“కడఁగి బుద్ధీంద్రియ[1]కర్మేంద్రియముల
                 యందు సంయతచిత్తు లైనవారు,
దృతి నహంకారప్రతిగ్రహాపేక్షల
                 యందు నివృత్తాత్ము లైనవారు,
నల్పభోజనులు, ననారంభకులు నయ్యు
                 నత్యంతసంతోష లైనవారు,
సత్యవ్రతులు, శుభాచారు, లక్రోధను
                 లగుచు ధర్మాన్వితు లైనవారు,

⁠


ఆ.⁠

నఖిలతీర్థశతము లాడినఫలములు,
నఖిలయజ్ఞవిధుల నైన ఫలముఁ
బడయుదురు; విహీనభాగ్యదుష్కృతులకుఁ
బరమతీర్థనేవఁ బడయ నగునె?

⁠ 241


క.⁠

తిలగోసువర్ణదానం
బులు, నుపవాసములు, దీర్థములసేవయు ని
మ్ములఁ జేయనివారు దరి
ద్రులు [2]రోగులు నగుదు రాత్మదోషముపేర్మిన్.

⁠ 242


క.⁠

క్రతుఫలములు వడయఁగ దు
ర్గతులకు దొరకొనదు; తీర్థగమనంబునఁ ద
త్క్రతుఫలము లందుదురు దు
ర్గతులును; నిది మునులమతము గౌరవ[3]వృషభా!

⁠ 243


వ.⁠

[4]తీర్థగమనఫలం బెల్లపుణ్యంబులకు విశేషంబు; దీని వినుము.

⁠ 244


చ.⁠

నమితవిరోధి! పుష్కర మనంగ జగద్విదితంబు పుణ్యతీ
ర్థము మునిసిద్ధసేవ్యము; ముదంబున నందుఁ బయోజసంభవుం
డమరులతోడ సన్నిహితుఁ డై వసియించుఁ; ద్రిపుష్కరంబులున్
సమములు; వాని నెప్పుడును [5]సంస్కృతి సేసినఁ బాయుఁ బాపముల్.

⁠ 245


క.⁠

పదివేలకోట్లతీర్థము
లుదితము లై పుష్కరముల నుండు; మునీంద్ర
త్రిదశవరు లందుఁ జేసిరి
మదిఁ గృతకృత్యు లయి తపము మఖములుఁ బ్రీతిన్.

⁠ 246


వ.⁠

అందు గృతస్నాను లై దేవర్షిపితృతర్పణంబులు సేసినవారు దశాశ్వమేధఫలం
బులు వడయుదురు; [6]మాఘమాసంబున నొక్కదివసంబు పుష్కరసేవ సేయుట
యు నొకయేఁ డగ్నిహోత్రంబు వేల్చుటయు సమంబు.

⁠ 247


క.⁠

అమరవరులందు; బురుషో
త్తముఁ డెట్లు [7]విశేషుఁ, డట్ల దరణిం గల తీ
ర్థములందుఁ బుష్కరత్రిత
యము గరము విశేష మభిమతార్థప్రదమై.

⁠ 248


వ.⁠

పుష్కరంబునఁ బదియేండ్లు వసియించినవారికి సర్వక్రతుఫలంబును, బ్రహ్మలోక
ప్రాప్తియు నగు; మఱియు జంబూమార్గంబు, దండకాశ్రమంబున నగస్త్యవటం
బను తీర్థంబు లాడి యశ్వమేధఫలంబు వడయుదురు; కణ్వాశ్రమంబును, ధర్మార
ణ్యంబును, యయాతిపతనంబునుం జూచిన సర్వపాపక్షయం బగు; మహాకాళం
బును, గోటితీర్థంబును నశ్వమేధఫలప్రదంబులు; రుద్రవటం బనురుద్రస్థానంబున
రుద్రుం బూజ సేసి గణపతిత్వంబు వడయుదురు; నర్మదాస్నానంబున, దక్షిణ

⁠
  1. ↑ కర్మేంద్రియములందు నపగతచిత్తు లైనట్టివారు ... నప్రీతాత్ము లైనవారు, నాత్మీయభోజనా నారంభకులును నై యత్యంత ... దుఃఖితులకుఁ.
  2. ↑ నిరతము నగు
  3. ↑ నాథా
  4. ↑ తీర్థగమనఫలంబు యజ్ఞఫలంబులకు విశేషంబు వినుము; తీర్థగమనంబు పుణ్యంబులకు విశేషంబు
  5. ↑ సన్నుతి; సంస్తుతి
  6. ↑ కార్తికమాసంబున; మాఘదివసంబునఁ బుష్కర
  7. ↑ విశిష్టుఁ డట్లు