Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

అనిన నది యప్పుడ భీము ననుమతంబున దమయంతియొద్దకు బాహుకు రావించిన.

⁠ 204


క.⁠

చనుదెంచి, యందు దీనా
నన, నవిరళపంకమలిన[1]నతగాత్రఁ, దప
స్విని, నతికృశ దమయంతిం
గనియె నలుం డుదితబాష్పకణకలితముఖిన్.

⁠ 205


క.⁠

దమయంతి నలుని వికృతాం
గముఁ జూచియు నతని నన్యుఁగా వగవక, [2]నె
య్యమునను, లజ్జను, నతసం
భ్రమమున వివశాత్మ యగుచుఁ బతి కి ట్లనియెన్.

⁠ 206


వ.⁠

“విజనంబైన విపినంబునందు నలసి నిద్రవోయినదాని, నబల, నతిసాధ్వి, ననువ్రత
నగ్నిసన్నిధిఁ బాణిగ్రహణవిధిలబ్ధ యైనదానిం బాసి నలున ట్లొరులు నిర్దయులై
యరిగినవారు లేరు.

⁠ 207


క.⁠

సురవరులఁ దొఱఁగి తన్నున్
వరియించితి; నన్నుఁ బుత్రవతి నేలొకొ చె
చ్చెర విడిచె; నాతనికి ని
ష్కరుణున కే నేమి యెగ్గు గావించితినో?

⁠ 208


వ.⁠

నిన్ను విడువ; నోడకుండు మని పలికిన యప్పలుకు లేల మఱచెనో” యని శోక
తప్తంబైన తనహృదయంబు దడుపుచున్నదియునుంబోలె బాష్పధారలం గుచ
మండలంబు దడుపుచు నున్నదమయంతిం జూచి శోకాకులుం డై నలుం డి ట్లనియె.

⁠ 209


తే.⁠

“[3]కలిసమావిష్టమతి నయి కష్టవృత్తి
నట్టి యిడుమలఁ బడితి నే; నవి మదీయ
తపము బలమున, నీదుఃఖదాహమునను
నష్టమై పోయెఁ; గలి యిప్డు నన్ను విడిచె.

⁠ 210


వ.⁠

ఏ నిందులకు నీతదర్థంబు వచ్చితి; నది యట్లుండె; నన్ను ననురక్తు, ననువ్రతుఁ, దలం
పక యన్యాపేక్షం బునస్స్వయంవరంబు రచియించుట యిది కులస్త్రీధర్మంబు
గాదు; రాజుల నెల్ల నీస్వయంవరంబునకు రావించుటం జేసి కాదె ఋతుపర్ణుండు
వచ్చె” ననిన వెఱచి కృతాంజలియై దమయంతి యి ట్లనియె.

⁠ 211


తే.⁠

“నిన్ను రోయంగ విప్రులు నెమ్మి నరిగి
పలికి రెల్లచో నాచేతఁ బలుకఁబడియ;
యందుఁ బర్ణాదుఁ డను విప్రుఁ డయ్యయోధ్య
కేఁగి ప్రతివచవంబుల నెఱిఁగె నిన్ను.

⁠ 212


వ.⁠

ఆపర్ణాదువలన ని న్నెఱింగినదాననై ని న్నిట రావించునుపాయంబు దలంచి యెల్లి
దమయంతీద్వితీయస్వయంవరం బగు నని ఋతుపర్ణునందుఁ బ్రకాశింప సుదేవుం
డను బ్రాహ్మణుం బుత్తెంచితి.

⁠ 213


క.⁠

నరవరుఁడు నలుఁడు గా కె
వ్వరు శతయోజనము లొక్కవాసరమున వ
త్తురు నరు లొరు; లని దీనిం
[4]బరికింపఁగఁ గడఁగి యిట్లు వంచితి నధిపా!

⁠ 214


ఉ.⁠

ఏ నతిపాపభావమును నెగ్గుఁ దలంపక యుండునట్లుగా
నానతవైరి! నీయడుగు లంటఁగ నోపుదు; నట్టిదైన న
న్నీనలినాప్తుఁ, డీయనలుఁ, డీమృగలాంఛనుఁ, డీసురోత్తముల్,

⁠
  1. ↑ నతగాత్రిఁ
  2. ↑ నెయ్యముఁ బెనుపుచు మదిఁ గడుసంభ్రమ; నెయ్యమునను లజ్జను భయసంభ్రమ
  3. ↑ కలిసమావేశమతిఁ గడుఁ గష్టవృత్తి ... దహనమునను ... పోయె నిప్పుడు నన్ను విడిచి; గష్టవృత్తి ... మదీయ, తపముఫలమున నీదుఃఖదహనమునను, నష్టమై పోయె నిప్పుడు నన్ను విడిచి
  4. ↑ బరికింపఁగ వేఁడి యిట్లు