Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

కేశినియును బాహుకుపలుకులు నాకారంబును దమయంతి కెఱింగించిన నది
యాతని నలుంగా శంకించి “యింకను వాని కడ కేఁగుము; వాఁడు ఋతుపర్ణు
వంటలవాఁడటె! పచనసమయంబున వానిచరితం బిమ్ముగా నెఱింగి ర” మ్మని
పంచిన నప్పుడ చని కేశినియు బాహుకునందు దైవమానుషనిమిత్తాద్భుత
క్రియలు సూచి వచ్చి దమయంతి కి ట్లనియె.

⁠ 195

కేశిని యను దూతి దమయంతితో నలుని గుణంబులు సెప్పుట

క.⁠

“అతని చరితంబు సెప్పఁగ
నతిమానుష, మపగతప్రయాస, మదృష్ట
శ్రుతపూర్వము; పరమార్థమ
[1]యతనిని వే ల్పనఁగ వలయు నంబుజనేత్రా!

⁠ 196


సీ.⁠

వినవమ్మ! తృణముష్టిఁ గొని వాఁడు వీచుడు
                 నం దగ్ని యుదయించి యతని వంట
లమరు నంతకు నింధనము లపేక్షింపక
                 యుడుగక మండుచు నుండు; మఱియుఁ
గడఁకతో నంజుళ్ళు గడుగంగ సమకట్టి
                 జల మపేక్షించుడు సంభవిల్లి
కుంభముల్ నిండి దివ్యాంభః ప్రవాహ మ
                 క్షయ మగుచుండుఁ దత్క్షణమ చూడ;

⁠


ఆ.⁠

[2]నతని కరతలద్వయావమర్దితము లై
కందియును, మహాసుగంధకుసుమ
తతులు దొంటియట్ల తమ కంపు విడువక
యుండు, నతని తేజ మున్నతంబు.”

⁠ 197


వ.⁠

అనిన విని దమయంతి వెండియుఁ గేశినిం బంచి, బాహుకువండిన నంజుళ్ళు దెప్పిం
చి, యాస్వాదించి, బాహుకునందు నలులక్షణంబులు గలుగు టెఱింగియు
నూఱడ నోపక వానిపాలికిం గొడుకునుం గూఁతునుం గేశినితోడం బుచ్చిన న
క్కుమారులం జూచి.

⁠ 198


ఆ.⁠

వశము గాక బాష్పవారి యొల్కుచునుండఁ
గొడుకుఁ గూఁతు నెత్తికొని నలుండు
హర్షపులకితంబు లయిన నిజాంకంబు
లందు వారి నునిచి యాదరమున.

⁠ 199


వ.⁠

అక్కేశినిం జూచి “యిక్కుమారు లిద్దఱు నాకొడునుం గూఁతునుం బోలిన
వీరి నెత్తికొని దుఃఖించితి” నని తన్నేర్పడకుండం బలికి దానికి ట్లనియె.

⁠ 200


క.⁠

“నీవిట పలుమఱు వచ్చుచుఁ
బోవుచు నున్కి గని చిత్తములనొండుగ సం
భావింతు రితరజనములు;
గావున [3]రావలవ దింకఁ గార్యార్థినివై.

⁠ 201


వ.⁠

ఏము దేశాంతరంబుననుండి వచ్చిన యతిథులము; నీకు మాతోడి దేమి?” యనినఁ
గేశిని గ్రమ్మఱి వచ్చి బాహుకుమార్గం బంతయు దమయంతికిం జెప్పిన [4]నది
సంతసించి నిజజనని కి ట్లనియె.

⁠ 202


ఉ.⁠

“సందియమేల? సర్వగుణసంపదఁ జూడఁగ బాహూకుండు భూ
వందితుఁ డైన నైషధుఁ డవశ్యముఁ దా నగు; నామనంబు నా
నందముఁ బొందుచున్నది ఘనంబుగ; వాఁడిట వచ్చువాఁడొ, యే
నందుల కేఁగుదాననొ [5]రయంబున నాతని నిశ్చయింపగన్.”

⁠ 203
  1. ↑ యతనిని బిల్వంగవలయు నంబుజనేత్రీ
  2. ↑ నతనికరతలద్వయామర్దితంబులై ... తమకంబు విడువక
  3. ↑ రా పలుప దింక
  4. ↑ నదియును జింతించి నిజజనని కిట్లనియె
  5. ↑ నయంబున ... గాన్