Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

బైన రాజమార్గంబు దఱియవచ్చుచున్న దాని [1]దినకరప్రభాపటలధూసరితప్రభా
తచంద్రరేఖయుం బోలె దీప్తివిహీన యై, డస్సియు రమ్యాకృతి యైనదానిఁ,
దమయంతిం బ్రాసాదగత యైనరాజమాత దవ్వులం గని తనదాది కి ట్లనియె.

⁠ 115


తే.⁠

“జీర్ణమై కడుమాసిన చీరగట్టి
ధూళిసరాలకములు దూలుచుండ
నబల యున్మత్తవేషిణియైన లచ్చి
కరణి నిట వచ్చుచున్నది కంటె దాని!

⁠ 116


వ.⁠

అక్కోమలియందు నా కతిస్నేహం బై యున్నయది; దానిం దోడ్కొని ర” మ్మనిన
నదియు దమయంతిం దోడ్కొని రాజమాతయొద్దకుం జనిన, నారాజమాతయు
దానిం జూచి “నీవెవ్వరిదాన? విట్లేల దుఃఖావేశవివశు వై యున్నదానవు? చెప్పు”
మనిన దమయంతి యి ట్లనియె.

⁠ 117


మధ్యాక్కర.⁠

“జితవైరి, మత్పతి జూదమాడి నిర్జితుఁ డయి చనినఁ
బతితోడ నీడయుఁ బోలె నేనును బాయక యరిగి
యతిబుభుక్షాతురుం డైన పతిచేత [2]నవ్వ! దైవాను
మతిఁ జేసి వంచిత నైతి నొక్కచో మఱచి నిద్రించి.

⁠ 118


వ.⁠

అంతనుండియు నమ్మహానుభావు, నేకవస్త్రు, ననికేతను నన్వేషించుచు సైరంధ్రీ
వృత్తంబు సేకొని, వియోగానలంబునం గంది, కందమూలఫలంబుల యాహారం
బుగాఁ, బ్రొద్దువడినచోట నివాసంబుగా, [3]మృగకులంబ సహవాసంబుగా, వనం
బులం బరిభ్రమించితి” నని బాష్పజలంబులం బయోధరస్థలపరాగంబు పంకంబు
సేయుచుఁ బలుక నేరకున్న యా దమయంతికి రాజమాత యి ట్లనియె.

⁠ 119


క.⁠

“[4]నీ వుండుము నాకడ; నిం
దీవరదళనేత్ర! నీపతిని రోయఁగ భూ
దేవోత్తములం బంచెద”
నావుడు ని ట్లనియె భీమనందన నెమ్మిన్.

⁠ 120


వ.⁠

“ఏను సైరంధ్రి నయి యుండియు నుచ్ఛిష్టంబు ముట్టను; బదధావనంబు సేయను;
బరపురుషులతోఁ బలుక నోపఁ; బతి నన్వేషించుపొంటె నరిగెడు బ్రాహ్మణులతోఁ
బలుకుదు; నట్లయిన నీయొద్ద నుండుదు; నొండువిధంబైన నుండనేర” ననిన “నీ
కిష్టంబైన విధంబున నాయొద్దన యుండు” మని దాని నతిగౌరవంబునం జేకొని
యుండఁ దనకూఁతు సునంద యనుదాని సమర్పించిన.

⁠ 121


క.⁠

అలయక పుణ్యవ్రతములు
సలుపుచు, సైరంధ్రి యనఁగఁ జేదీశుపురిన్
నలుదేవి యుండె [5]నెదఁ బతిఁ
దలఁచుచు దుస్సహవియోగతాపార్ధిత యై.

⁠ 122


వ.⁠

అట నలుండు దమయంతిం బాసి దారుణారణ్యంబుతో నరుగువాఁడు ముందట.

⁠ 123


చ.⁠

అవిరళవిస్ఫులింగనివహంబుల [6]నభ్రపథంబు నంటుచున్

⁠
  1. ↑ దినకర ... దివాతన చంద్రరేఖయుం బోలె
  2. ↑ నవ్యదైవానుమతి
  3. ↑ మృగంబుల సహాయంబుగా
  4. ↑ నీ వుండు మిక్కడన యిం, దీవరదళనేత్రి
  5. ↑ దనపతిఁ, దలఁచుచు
  6. ↑ నభ్రపథంబు నొందుచున్; నభ్రపథంబు నందుచున్