| క. |
దేవతల సాధువాదము
తో, [1]విప్రాశీరవంబుతో, బహుతూర్యా
రావంబులు సెలఁగెను బా
రావారరవంబుఁ బోలె ననివార్యము లై.
| 56
|
నలుండు స్వయంవర లబ్ధయైన దమయంతిం బెండ్లియగుట
| వ. |
ఇ ట్లపూర్వస్వయంవరలబ్ధ యైన దమయంతి నత్యంతవిలాసంబుతో వివాహం
బైన యా నలునకు నింద్రుండు వాని యజ్ఞంబులయందు నిజరూపంబుఁ జూపను,
నగ్నియు వరుణుండును వాని వలచినచోటన యగ్నిజలంబు లుత్పాదింపను,
ధర్ముండు ధర్మువునంద [2]వానిబుద్ధి వర్తిల్లను వరంబు లిచ్చి దేవలోకంబున కరు
గువా రెదుర ద్వాపరంబుతో వచ్చు కలిం గని ”యెందురకుం బోయెద?”వని య
డిగిన నింద్రాదులకుఁ గని యి ట్లనియె.
| 57
|
| తే. |
”అవనిలో దమయంతీస్వయంవరంబు
[3]విస్తరిల్లుట విని కడు వేడ్కతోడ
నేను దమయంతిచే వరియింపఁబడుదు
నని తదర్థినై యరిగెద నాసఁ జేసి.”
| 58
|
| వ. |
అనిన నందఱు నగి నీవందుల కేల పోయె? దది ముందర నిర్వృత్తం బయ్యె; నక్కో
మలి యొరుల నెవ్వరి మెచ్చక నలుం డను వాని వరియించె” ననినం గలి కరం
బలిగి ”యన్నలునకు దమయంతికి రాజ్యవిభవపరిత్యాగంబును, [4]బరస్పరవియో
గంబునుం జేసెద” నని నిశ్చయించి వాని నక్షరతుంగా నెఱింగి, యక్షంబులం జొచ్చి
యుండ ద్వాపరంబుం బనిచి, నలుండు సేయుచున్న యశ్వమేధాదికానేకభూరి
దక్షిణమహాక్రతువులయు, జపహోమదానాది వివిధపుణ్యకర్మంబులయుఁ గార
ణంబునం జొర నవసరంబు గానక యంతరం బన్వేషించుచుఁ బెద్దకాలం బుం
డి, యొక్కనాఁ డతండు కృతమూత్రుండయి జలోపస్పర్శనానంతరంబునం
బాదశౌచంబు సేయ మఱచి సంధ్యోపాసనంబు సేసిన నుపలబ్ధావసరుం డయి
కలి నలునందుఁ బ్రవేశించి, పుష్కరుం డనువానిపాలికిం బోయి తన్నెఱింగించి
“నీవు నలునితో జూదంబాడి వాని రాజ్యంబును సర్వస్వంబును నొడిచికొ” మ్మని
చెప్పి తానును వానికి విప్రవేషంబున సహాయుండయి యక్షంబులు గొని పు
ష్కరుతో నొక్కటం జని నలుం గాంచి “నీవు మారాజుతోఁ జూదం బాడు” మనిన.
| 59
|
| క. |
“ద్యూతార్థము తత్కితవా
హూతుఁడనై జూద మాడకుండుట ధర్మా
పేతం” బని యభిముఖుఁ డై
యాతనితో నలుఁడు జూద మాడఁ [5]గడంగెన్.
| 60
|
| క. |
కలధనము లెల్ల నొడ్డుచు
నలయక జూదమున విజితుఁ డగుచుండె నిజా
ప్తులు వారించిన నుడుగక
నలుఁడు కలిప్రేరణంబునను హతమతియై.
| 61
|
- ↑ విప్రస్వస్తిరవము ద్రుతబహుతూర్యా, రావంబు లెసఁగఁ గడుఁ బా
- ↑ వానిబుద్ధి వర్తిల్లను ధనదుండు వానిధనసంచయంబు లక్షయంబుగా వరం బిచ్చి
- ↑ విస్తరిల్లంగ విని
- ↑ బరస్పరవియోగక్లేశంబును గావించెదనని ... జేర నవసరంబు ... సంధ్యౌపాసనాదిక్రియల నిర్వర్తించిన ... నొడిచికొ మ్మని పంచి ... వానికి వృషుండును సహాయుండై ... నాతో జూదం బాడు మనిన
- ↑ దొడంగెన్