Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

కారము లై వనాంతరము గప్పె; జగత్త్రయనాథ! తత్తపో
భారము సర్వజీవుల కపారభయావహ మద్భుతం బిలన్.

⁠ 298


వ.⁠

అతని యభిమతంబుఁ బ్రసాదించి, తత్తపోభారంబు వారింపు“ మనిన వారల పలు
కులు విని పరమేశ్వరుండు దరహసితవదనుం డగుచు “వాని యభిప్రాయం బే
నెఱుంగుదు; నిష్టవరప్రసాదంబున వానికి మనఃప్రియంబుఁ జేసెద; మీరు మీ
యాశ్రమంబుల కరిగి సుఖం బుండుం“ డని యప్పుడు.

⁠ 299

ఈశ్వరుండు గిరాతవేషంబున నర్జును నొద్దకు వచ్చుట

సీ.⁠

కాంచనవర్ణాపఘనుఁ డై మహోన్నత
                 కార్ముకహస్తుఁ డై, కాలకంఠుఁ
డెఱకురా జయ్యె; నద్రీంద్రతనూజయు
                 వనచరీభావంబు వఱలఁ దాల్చెఁ;
గుఱుచచేతులు, మిడిగ్రుడ్లును, గడుకొన్న
                 [1]తఱటులు, మఱి చెంచుఁదలలు నమరఁ
దడవిండ్లు సేపట్టి తడయక యెఱుకు లై
                 యార్చుచు భూతమ్ము లాత్మసతుల

⁠


తే.⁠

నెఱుకుసతులఁ గావించి యయ్యెఱుకురాజు
ముందటం, బక్కియల నొక్కమొగిన నిలిచి;
రంత వేఁటనెపంబున నంధకారి
గదలెఁ దద్వన మెల్ల గ్రక్కదలుచుండ.

⁠ 300


చ.⁠

అలుగుల మ్రంది యందుల మృగావలియున్ విహగంబులున్ భయా
కులగతిఁ బొంది మూఁగలును గుంటులు జీకులు నైనయట్టు లై
యులియక యున్నచో నడఁగి యుండఁ గిరాతబలంబుతోడఁ బిం
గలయనుం డుమేశ్వరుఁడు గవ్వడి డాయఁగ వచ్చెఁ జెచ్చెరన్.

⁠ 301


వ.⁠

అంత నీశ్వరచోదితుం డయి మూకుం డను దైత్యుండు సూకరం బై భీకరా
కారంబున బీభత్సు వధియింప సమకట్టి పయిం బఱతెంచిన.

⁠ 302


క.⁠

అనఘుండు దాని దవ్వులఁ
గని ఘనుఁ డయి పాండవుండు గాండీవగుణ
ధ్వని సేయుచు డాసినఁ బె
ల్చన యేయఁ గడంగి నిలిచె సంరంభమునన్.

⁠ 303


వ.⁠

అదియును నాక్షణంబ యేసిన యమ్మునుం బోలె నతివేగంబున దా నాసన్నంబైన, దా
ని నేయ కేయకు మని యెఱుకురాజు వారించినను వాని వచనం బాదరింపక.

⁠ 304


చ.⁠

పటువిశిఖంబునం ద్రిదశపాలతనూజుఁడు పంది నేసె; ము
న్నట పరమేశ్వరుండును రయంబున దానిన యేసె; నిట్టు లొ
[2]క్కొటఁ బడియెన్ హరార్జునుల ఘోరశరంబులు పందిపైఁ గుభృ
త్తటముపయిన్ వడిం బడు నుదగ్రమహాశనులట్ల మ్రోయుచున్.

⁠ 305


క.⁠

హరుశరమును, నరుశరమును
సరి నిరుపక్కియలు [3]దాఁకి జవ మఱి, శరసం
భరమునఁ దిరిగె వరాహము
శరనిధిమథనమునఁ దిరుగు శైలమపోలెన్.

⁠ 306
  1. ↑ యుర్లును మఱి చెంచుఁ (చుంచు) (చింకి) దరదుల(తలలు) (దరడుల) జడచుచంచు (యంచు) దలలు నొప్ప, తలవళ్లు
  2. ↑ క్కట వడియెన్ ... గాఢశరంబులు
  3. ↑ గొన్న