Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

దురితంబు వలనం బాసి, తమోవిముక్తుం డైన చంద్రుండునుబోలె వెలుంగు”
ననిన భీమసేనునకు ధర్మరా జి ట్లనియె.

⁠ 256


ఉ.⁠

“నీ వచనంబు ధర్మ్యము, వినీతము [1]నీతియుతంబు నిష్టసి
ద్ధ్యావహ, మత్యుదార మిది; యైనను నిప్డు దలంపఁగా విచి
రావసరాప్తికిన్ విషయ మైనది; కార్యఫలంబు లెల్ల స
ద్భావమునన్ విచారసులభంబుల యండ్రు విచారపారగుల్.

⁠ 257


క.⁠

వనమునఁ బండ్రెం డేండ్లును
జనపదమున నెఱుఁగ కుండ సరి నొక వర్షం
బును [2]జలుపఁ బూని సత్యము
దనరఁగఁ జేసితిఁ బ్రతిజ్ఞ దగ వృద్ధసభన్.

⁠ 258


చ.⁠

అలఘుగుణంబులం దధికుఁ డైన మహాత్ముఁడు [3]రాగకోపమా
యలఁ బడి, యక్షమావివశుఁ డై, యచిరాంశులతావిలాసచం
చల మగు లక్ష్మి కాసపడి, సత్యము ధర్మువుఁ దప్పి, సత్సభా
వలిఁ దగువారియొద్దఁ దగువాఁ డయి సద్విధి నుండ నేర్చునే?

⁠ 259


వ.⁠

ఏ నెట్లును సత్యసమయం బతిక్రమింప నోప; [4]శుభోదయకాలంబుఁ బ్రతీక్షించి
యుండుము; రాజ్యంబులుఁ, బుత్త్రులును, ధనంబును, యశంబును, సత్యంబునకు
సమంబులు గా” వనిన భీమసేనుం డి ట్లనియె.

⁠ 260


ఆ.⁠

అంతకుండు జనుల కాసన్నుఁ డై యుండ
నిమిష మాత్రమేనని నిశ్చయింపఁ
దగని జీవనంబు దద్ద సుస్థిరముగాఁ
జేసి కార్య మెడయుఁ జేయఁ దగునె?

⁠ 261


వ.⁠

శరీరికి మరణంబు నియతంబు; మరణంబునకు ముందర వైరంబు దీర్పనివాని
జన్మంబు నిరర్థకంబు; సకలరాజసమక్షంబునం బరులచేత నట్లు మన పడిన పరి
భవంబునకుం బ్రతీకారంబు సేయునంతకు రేయునుం బగలును నా హృద
యంబు దపించుచుండు; నాకంటె నర్జున నకుల సహదేవులుం, గుంతీదేవియు
నంతస్తాపంబున నెంతయు సంతప్తు లగుచున్నవారు.

⁠ 262


క.⁠

వీరల దుఃఖము దీర్పక
[5]క్రూరనికారులగు రిపులకును ముదముగ ను
గ్రారణ్యములో ధర్మువుఁ
గారుణ్యముఁ దాల్చి యునికి కార్యమె నీకున్!

⁠ 263


వ.⁠

ఇది బ్రాహ్మణధర్మంబు గాని క్షత్త్రియధర్మంబు గాదు; మనుప్రణీతంబులైన రాజ
ధర్మంబులు నీ యెఱుంగనియవి లేవు; [6]శత్రుసంహారంబు సేయనినాఁ డత్యంత
హాని యగు; నట్లుం గాక.

⁠ 264


తే.⁠

వనమునందుఁ బండ్రెండుసంవత్సరంబు
లుండ నేర్చితిమేనియు, నొరు లెఱుంగ
[7]కుండ నజ్ఞాతచర్యయం దొక్కదివస
మైన నుండఁగ నేర; మె ట్లనిన వినుము.

⁠ 265
  1. ↑ నీతియుతం బభీష్టసి, ద్ధ్యావహ ... నీవు దలంపఁగా ... రావసరోక్తికిన్ విషమమై
  2. ↑ జలుపఁ బూని
  3. ↑ రాగదోషమా ... యక్షమా విదశుఁ డై ... సంచల యగు ... సజ్జనుఁ డుండ
  4. ↑ సుఖోదయకాలంబుఁ
  5. ↑ క్రూరాకారు లగు రిపులకును ముదముగ ను...మనకున్
  6. ↑ శత్రుసంహారనిరసనంబున; శత్రువర్ధనంబున నత్యంతహాని
  7. ↑ కుండ నజ్ఞాతవత్సర మొక్కదివస ... మెట్లయిన మనము