Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.⁠

“నాయనుమతి లేకుండఁగ
నీయుదకము ద్రావిరేని యెవ్వారైనన్
ధీయుత! చత్తురు; నీ వటు
సేయవు, సమ్యగ్విచారశీలుఁడ వగుటన్.

⁠ 421


వ.⁠

కావున మదీయంబు లగు ప్రశ్నంబుల కుత్తరంబు సెప్పు” మనిన నతండు “మ
హాత్మా! నీచిత్తంబునకు వచ్చునట్లుగాఁ జెప్ప నాబోఁటివానికి శక్యం బగునే?
యైనను నానేర్చువిధంబునఁ జెప్పెద నడుగు” మనిన నయ్యక్షుం డి ట్లనియె.

⁠ 422

ధర్మరాజు యక్షప్రశ్నముల కుత్తరంబు లిచ్చుట

క.⁠

“దినకరు నెయ్యది నడపును?
దినకరు నెవ్వారు గొలిచి తిరుగుదు? రద్దే
వుని యస్తమించు టేమిట?
ననఘ! తదాధారభూత మది [1]యెయ్యదియో?”

⁠ 423


తే.⁠

అనిన ధర్మజుఁ డి ట్లను “నబ్జహితుని
నడపు బ్రహ్మంబు; సురకోటి నడచుఁ గొలిచి;
ధర్ముచే నస్తమితుఁ డగుఁ దపనుఁ; డమ్మ
హాత్మునకు సత్య మాధార మండ్రు [2]బుధులు.”

⁠ 424


వ.⁠

అనిన విని యక్షుం డి ట్లనియె.

⁠ 425


క.⁠

“ఏమిట శ్రోత్రియుఁ [3]డనఁ జను?
నేమిటఁ గడు మహిమ వడయు నిమ్ముగఁ బురుషుం?
డేమిట సహాయయుతుఁ డగు?
నేమిట నగు బుద్ధిమంతుఁ డేర్పడఁ? జెపుమా.

⁠ 426


వ.⁠

అనిన నతం డి ట్లనియె.

⁠ 427


క.⁠

“శ్రుతమువలన శ్రోత్రియుఁ డగు;
నతులతపోయుక్తిఁ గడుమహత్త్వము వడయున్;
ధృతిచే సహాయయుతుఁ డగు;
నతిశయముగ బుద్ధిమంతుఁడగు బుధసేవన్.

⁠ 428


వ.⁠

అని చెప్పిన నప్పార్థివోత్తమున కప్పురుషుండు వెండియు ని ట్లనియె.

⁠ 429


తే.⁠

“ఏమికతమున భూదేవుఁ డెసఁగు దేవ
భావమున? నాతనికి సాధుభావ మెవ్వి
ధమున నగు? నసాధుత్వ మెద్దానఁ జెందు?
మానుషుం డగు నాతఁ డేదానఁ? జెపుమ.

⁠ 430


చ.⁠

అనవుడు ధర్మజుం డనియె “నధ్యయనంబున దేవభావముం
గను నవనీసుపర్వుఁ; డధికవ్రతశీలత సాధుభావ మా
తనికి; విశిష్టవృత్తి దిగఁ ద్రావి యసాధు వనంగ నుండు; శౌ
చనియతి లేక మృత్యుభయసంగతి నాతఁడు మానుషుం డగున్.

⁠ 431


క.⁠

నా విని యతఁ డాతనితో
“జీవన్మృతుఁ డెట్టివాఁడు? సెప్పు” మనుటయున్
“దేవాతిధిపితృభృత్యజ
నావళులకు నిడక కుడుచు నతఁ” డని చెప్పెన్.

⁠ 432


చ.⁠

విని మగుడంగ వాఁడు పృథివీపతిఁ జూచి “ధరిత్రికంటె వ్రేఁ
కన యగుదాని, నాకసముకంటెఁ గడుం బొడవైనదాని, గా
డ్పునకును నెక్కు డై జవము పొంపిరివోయెడుదానిఁ, బూరికం
టెను దఱ చైనదానిని ఘటింపఁగ జెప్పుమ నాకు” నావుడున్.

⁠ 433


వ.⁠

అమ్మనుజోత్తముం డయ్యక్షోత్తమున కి ట్లనియె.

⁠ 434
  1. ↑ యెట్టిదకో
  2. ↑ మునులు
  3. ↑ గనఁ జను