Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

గ్రుమ్మరి, కాయలుఁ గూరలు దిని పేద
                 వడినఁ జూచియు, దీర్ఘబాహుయుగళుఁ
డయ్యును బాహుసహస్రంబు గలిగిన
                 యర్జునుకంటె బలాఢ్యుఁ డగుచు
నేకవేగంబున నేనమ్ము లొక్కయ
                 మ్మేసినవిధమున నేయ నేర్చు

⁠


ఆ.⁠

నర్జునుండు వనమృగావలిఁ గలిసి యి
ట్లున్నఁ జూచియును, సుఖోచితాత్ము
లైన కవలు దీను లై యున్నఁ జూచియు
నుపశమంబుఁ దాల్చి యుండఁదగునె?

⁠ 215


వ.⁠

క్షమయును దేజంబును నయ్యయికాలంబులఁ బ్రయోగింప నేరని రాజునకుం
బ్రజానురాగప్రతాపంబులు లేవను నీయర్థం బితిహాసంబున వినంబడు; క్షమాతే
జంబులలోన నెయ్యది విశేషంబు దానిన నిర్ణయించి చెప్పు మని బలీంద్రుండు దొ
ల్లి తన పితామహుం డయిన ప్రహ్లాదు నడిగిన నాతండు బలీంద్రున కి ట్లనియె.

⁠ 216


ఆ.⁠

“[1]క్షమయ తాల్చి యుండఁ జన దెల్లప్రొద్దుఁ; దే
జంబ తాల్చి యుండఁ జనదు పతికి;
సంతతక్షముండు, సంతతతేజుండు
నగుట దోష మందు రనఘమతులు.

⁠ 217


వ.⁠

అది యెట్లనిన నిత్యక్షమాన్వితుం డయిన వానికి భృత్యులు వెఱవక యవమానంబు
సేయుదు; రర్థంబులయం దధికృతు లయిన వారలు ధనంబు లపహరించి దర్పంబు
సూపుదురు; మఱి నిత్యతేజోధికుం డైనవాఁ డతిక్రూరదండంబున సర్వజనసంతాపం
బు సేయుచు గృహగతం బైన సర్పంబును బోలె నెప్పుడు నుద్వేగకరుం డగుం; గా
వునఁ గాలోచితంబులుగా క్షమాతేజంబులు గల్పించునది; యథాకాలకల్పితక్షమాతే
జుం డైన వానికి నుభయలోకసిద్ధి యగు; నని బలీంద్రప్రహ్లాదసంవాదంబు సెప్పి
వెండియు ద్రౌపది యి ట్లనియె.

⁠ 218


తే.⁠

[2]ఆది నపరాధ మొక్కటి యైన నదియు
నల్ప మైనను క్షమియించు నదియుఁ గాక;
చెనసి యుపరాధములు పెక్కు సేయుచున్న
పాపకౌరవ్యులకు సహింపంగ నేల?

⁠ 219


క.⁠

ఇది తేజంబున కవసర
ముదితక్రోధుండ వగుమ యొక్కించుక; దు
ర్మదు లగు సుయోధనాదుల
నదయుల వధియింతు రుగ్రులై [3]నీ తమ్ముల్.”

⁠ 220


వ.⁠

అనిన ధర్మరా జిట్లనియె.

⁠ 221


సీ.⁠

“క్రోధంబు పాపంబు; గ్రోధంబుననచేసి
                 యగుఁ జువ్వె ధర్మకామార్థ హాని;
గడుఁ గ్రోధి గర్జంబు గానండు; క్రుద్ధుండు
                 గురునైన నిందించుఁ; గ్రుద్ధుఁ డైన
వాఁ డవధ్యులనైన వధియించు; మఱి యాత్మ
                 ఘాతంబు సేయంగఁ గడఁగుఁ గ్రుద్ధుఁ;
డస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి
                 క్రోధంబు దాల్చుట గుణమె చెపుమ?

⁠
  1. ↑ క్షమయుఁ దేజంబును సమమైన నగు (సమమైన దగు) గాని, క్షమయ దాల్చి యుండఁ జనదు పతికి ... సంతతతేజుఁడై, యునికి పాపమందు
  2. ↑ అరయ నపకార మొక్కటి యైన సల్ప, మైన శమియించు నది గాక యలయ కిపుడు; అధిప యపరాధ మొక్కండ యైన నదియు
  3. ↑ నీ యనుజుల్