Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.⁠

పుడమియు [1]సర్వసంపదలుఁ బొల్పఱ వైరులపాలు సేసి, యీ
యడవికి వచ్చి భీకరమృగావలిపొత్తున నున్న వీరి వె
న్నడికొని యిట్లు సేసెనె యనాథులఁబోలె విధాతృఁ; డింక నె
క్కడ జనువాఁడ? నేదిగడగాఁ దరియింతు దురంతదుఃఖముల్?

⁠ 412


సీ.⁠

పుత్త్రులు దుఃఖార్తిఁ బొగులుట కనిశంబుఁ
                 బొక్కుచునున్న యప్పుణ్యచరిత
మాతల్లి పాండునిమహిషి, నా కెదురుగా
                 వచ్చి, కౌఁగిటఁ జేర్చి “వత్స! [2]నాఁడు
దమ్ముఁగుఱ్ఱలు నీవుఁ దగ విపినంబున
                 కరిగితి; రిప్పు డయ్యనుజు లెందుఁ
జనిరి? నీ వొక్కండ చనుదెంచి, తిది యేమి?
                 యనిన, నాయమతోడ నకట! యేమి

⁠


ఆ.⁠

యనఁగ నేర్చువాఁడ? నాచార్యవిదుర శాం
తనవకృపులు నను ముదంబుతోడఁ
గుశల మడిగి రేనిఁ గుశల మే మనువాఁడ?
దలుఁగరాని యెడరు దగిలె నాకు.”

⁠ 413


వ.⁠

అని పెక్కుదెఱంగుల వగచి, యాధర్మజుండు దప్పి కోర్వక నీళ్ళు ద్రావుటకై
సరోవరంబులోనికి దిగుటయు, నశరీరభూతం బి ట్లనియె.

⁠ 414


మ.⁠

“విను మే నొక్కబకంబ; నిక్కొలను పృథ్వీనాథ! నాసొమ్ము; నీ
యనుజుల్ మద్వచనంబు గైకొనక తోయాస్వాదు లై యివ్విధం
బునఁ బ్రాణచ్యుతిఁ బొంది; రీవును గడున్ [3]మోహంబునన్ సాహసం
బునకుం జొచ్చిన నట్ల యయ్యెడు సుమీ! మున్ముట్ట వారించితిన్.

⁠ 415


క.⁠

ఏనడిగిన యర్థములకు
భూనుత! యుత్తరము లిచ్చి, పొలు[4]పొందఁ, బయః
పానంబు సేయుము” నావుడు
నానిర్మలచరితుఁ డంబరాభిముఖుం డై.

⁠ 416


వ.⁠

“అయ్యా! నీవు బకరూపధరుండ వై యున్న రుద్రుండవో, పావకుండవో, పవనుండ
వో? యట్లు గానినాఁడు కులపర్వతప్రతిము లయిన నాతమ్ములం బడఁద్రోచునట్టి
బలంబు పులుఁగులకుం గలదె? దేవాసురగంధర్వయక్షాదులకు దుర్జయులైన
యివ్వీరుల నిట్లు సేసి, నీవు గానివాఁడవపోలెం దొలంగి యున్నాఁడవు; నాకు
నద్భుతభయకౌతుకంబు లొక్కటం బొడమెడు; నీ వెవ్వండవు? నీతలం పెయ్యది?
చెప్పి నాహృదయవేదన నపనయింపవే” యనిన నదృశ్యభూతం బి ట్లనియె.

⁠ 417


ఆ.⁠

“కౌరవేంద్ర! బకమఁ గాను నే; విను మొక్క
యక్షవరుఁడ; నిచట నస్మదీయ
నికృతిఁజేసి పడిరి నీతమ్ము లందఱు”
ననుచు నాక్షణంబ యతని యెదుర.

⁠ 418


మ.⁠

నిలిచెం దాళసముచ్ఛ్రితాంగుఁడు, మహానిర్ఘోషసంతర్జితా
ఖిలభూతప్రకరుండు, దీర్ఘవిపులగ్రీవుండు, దంష్ట్రాసము
జ్జ్వలవక్త్రుండు, విరూపలోచనుఁడు, దీవ్రస్ఫారతేజోఘనుం,
డలఘుం డాసరసీ[5]తటాగ్రమున నయ్యక్షుండు ఘోరాకృతిన్.

⁠ 419


వ.⁠

ఇట్లు నిలిచి కౌంతేయాగ్రజున కి ట్లనియె.

⁠ 420
  1. ↑ నర్థసంపదయు...నేది తుదఁగా భరియింతు
  2. ↑ నీదు...దలఁగ; దలపఁగాని
  3. ↑ మోసంబునన్...మున్నుట్టఁగాఁ జెప్పితిన్;మున్మున్న వారించితిన్
  4. ↑ పార
  5. ↑ తటాంతమున