Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

లంబునం దక్కఁ బెఱయప్పుడు ప్రయోగించిన నీకు నపాయం బగు” నని చెప్పెఁ;
దదనంతరంబ యవ్వీరుండు కవచకుండలంబులం బుచ్చి యతని కిచ్చి.

⁠ 373


చ.⁠

అలఘునిశాతశస్త్రమున నంగము లన్నియు నిర్వికారుఁ డై
యొలువఁ దొడంగినట్టియెడ “హో” యని కిన్నరయక్షసిద్ధసా
ధ్యులు దివినుండి యార్చుచును దూర్యరవంబు సెలంగ [1]నద్భుతం
బెలయఁగఁ బుష్పవృష్టిఁ గురియించిరి కర్ణునిపైఁ బ్రియంబునన్.

⁠ 374


వ.⁠

ఇట్లు సూతపుత్రుని వికృతగాత్రుం జేసి వాసవుండు ప్రమోదవికాసభాసితుం
డగుచు నిజలోకంబున కరిగెఁ; దద్వృత్తాంతం బంతయు విని కౌంతేయు లత్యంత
సంతోషంబునం బొదలిరి; గాంధారేయులు దుఃఖవిదారితహృదయు లై” రని
యిట్లు కవచకుండలాభిహరణంబు సవిస్తరంబుగాఁ జెప్పిన విని జనమేజయుండు
వైశంపాయనున కి ట్లనియె.

⁠ 375


క.⁠

“అనయము దుస్తర మగు న
వ్యనవాసము నిస్తరించి ద్వాదశవర్షం
బున కడపట నేమివిధం
బొనరించిరి? మత్పితామహుల్ మునినాథా.”

⁠ 376


వ.⁠

అనిన నమ్మహీపతి కమ్మహీదేవుం డి ట్లనియె “నట్లు మార్కండేయువలనఁ బుణ్య
కథలు విని పాండవు లనంతరంబ క్రమ్మఱి ద్వైతవనంబున కరిగి, యం దున్న
యెడ నొక్కనాఁడు సుఖాసీనుం డయి యున్న ధర్మరాజుపాలికి నొకబ్రాహ్మ
ణుండు సంభ్రమంబునఁ జనుదెంచి యి ట్లనియె.

⁠ 377

ధర్మరాజు బ్రాహ్మణుని యరణిఁ దెచ్చుటకుఁ బోవుట

క.⁠

“తరుశాఖఁ దగిల్చిన నా
యరణి యొకమృగంబు వచ్చి యతిరయమున న
త్తరువును నొరసి కొనంగా
ధరణీశ్వర! తగిలెఁ జువ్వె తచ్చృంగమునకున్.

⁠ 378


క.⁠

దానిఁ గొని పఱచె నమ్మృగ;
మానత[2]నృపలోక! నాకు నయ్యరణిఁ దగం
గా నిపుడు దేరఁ బనుపవె
భూనుత! నిత్యవిధి లోపమునఁ జనకుండన్.”

⁠ 379


చ.⁠

అనవుడు నాక్షణంబ మనుజాధిపుఁ [3]డుద్ధతచాపహస్తుఁ డై
యనుజులుఁ దాను నెంతయు రయంబున నాహరిణేంద్రుపజ్జఁ గై
కొని చని కూడముట్టి, మెఱుఁగుల్ నిగుడం బటుసాయకంబు లే
సిన నొక యమ్ము నమ్మృగము సెందద చేరద యద్భుతంబుగన్.

⁠ 380


వ.⁠

అదియును వారి నతిదూరంబుగా నెలయించికొని చని యొక్క ఘోరవిపినంబున
నదృశ్యం బైన, ప్రయత్నంబు విఫలం బగుటకు విషాదంబు నొందుచు, నయ్యే
వురు నతిశ్రాంతు లై శీతలచ్ఛాయం బగు నొక్క వటమహీరుహంబుక్రింద
విశ్రమించి; రప్పుడు నకులుండు ధర్మనందనున కి ట్లనియె.

⁠ 381


క.⁠

“కులశీలోన్నతియు, విని
శ్చలకరుణారతియు, ధర్మసంగ్రహమతియుం

⁠
  1. ↑ ఁబువ్వుసో, నలు గురియించి రాతపననందనుమీఁద నుతించి వేడ్కతోన్.
  2. ↑ రిపులోక...గానీవు దేరఁబను
  3. ↑ డున్నత