Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

[1]నేప్రొద్దు వచ్చిన నింతి యప్పుడ భక్ష
                 భోజ్యముల్ గ్రొత్తపొల్పుగ నొనర్చు;
నెయ్యది గోరిన నిచ్చకు రాఁ బెట్టు;
                 నలయదు మది నైన నలుగ దెపుడు;

⁠


ఆ.⁠

ననుదినంబు భోజుఁ డాత్మజఁ బిలిచి త
ద్వర్తనంబు నడుగ, వనజముఖియుఁ
దాను గొల్చు తెఱుఁగుఁ, దాపసవరుని చం
దమును జెప్పుచుండుఁ దండ్రి యలర.

⁠ 323


వ.⁠

అంత నొక్కసంవత్సరంబు పరిపూర్ణం బయినఁ బ్రీతుం డై దుర్వాసుండు గుంతిం
జూచి “నీచేసిన యారాధనంబునకు మెచ్చితి! నభిమతంబు లిచ్చెద; నడుగు” మనిన
నమ్మానిని గృతాంజలి యై “మీరు నావలనం బ్రసన్నుల లైతిరి; దీనికి మాతం
డ్రియుం గరంబు నలరు; నింతియ చాలు; నొం డేల” యనిన నతం “డట్లేని నిది
యొక్క మంత్రంబు గైకొను; దీనం జేసి యెయ్యేనివేల్పు నాహ్వానంబు సేసెద,
వవ్వేల్పు సనుదెంచి నీవశంబున నుండు” ననిన నొం డన వెఱచి, కుంతియుం
బ్రసాదం బనియె; నమ్మునీంద్రుండు దాని కమ్మంత్రంబు విధియుక్తంబుగా నుపదే
శించి,కుంతిభోజుని దీవించి నిజేచ్చం జనియె; నంతఁ గొంతకాలంబునకు.

⁠ 324


మ.⁠

“మదిఁ గారుణ్యము సేసి విప్రవరుఁ డీ మంత్రంబు నాకిచ్చె; నే
నిది యేచందమొ చూతు” నంచు నొకనాఁ డిచ్చన్‌ [2]కృతస్నాత యై
సుదతీరత్నము పూర్వశైలతటిపై శోభిల్లు తిగ్మాంశుఁ జూ
చి దళత్పద్మము మాడ్కి నుల్లసిత మై చిత్తంబు రాగిల్లఁగన్‌.

⁠ 325


వ.⁠

సహజకుండలకవచాభిరామం బైన తదీయమూర్తివిభవంబున కోటు వడి “దేవా!
భవత్సమానసుందరుం డగు నందనుం గరుణింపవే” యని మనంబునం గోరుచు
మత్రోచ్చారణంబు సేయుచున్నఁ, బ్రభాకరుండును నిజయోగబలంబున మూ
ర్త్యంతరంబు ధరియించి కుంతిపాలికిం జనుదెంచి మధురస్వరంబున.

⁠ 326


తే.⁠

“అబల! నీమంత్రబలంబున నరుగుదెంచి
నాఁడ; నీవాఁడ నైతి; మనఃప్రియంబు
నీకు నెయ్యది యొనరింతు? నిజము చెపుమ;”
యనినఁ బడతి యిట్లనుఁ గమలాప్తుతోడ.

⁠ 327


తే.⁠

“కార్య మొక్కటియును లేదు; కౌతుకమున
నేను మంత్రంబు నొడివితి; నింతమాత్రఁ
జేసి నీకు నిచ్చటికి విచ్చేయ నేల?
దివికి నరుగుము క్రమ్మఱి దేవ! నీవు.”

⁠ 328


వ.⁠

అనిన దానికి సూర్యుం డి ట్లనియె.

⁠ 329


ఉ.⁠

“క్రమ్మఱి పోక తప్పెడినె? కామిని! యే మని మున్ను నీవు చి
త్తమ్మునఁ గోరి, తవ్విధము దప్పక యిప్పుడుఁ బల్క[3]రాదె? తే
జమ్మున మత్సమానుఁ గవచస్ఫుటకుండలమండితాంగు స
త్సమ్మతుఁ బుత్త్రుఁ గోరవె, నిజమ్ముగ నావలనం దలోదరీ?

⁠ 330
  1. ↑ నెప్పుడు వచ్చిన నింతి యప్పుడ క్రొత్తలుగ భక్ష్యభోజ్యాదు లొగి నమర్చి...ననుదినంబు నధిపుఁ డాత్మజఁ
  2. ↑ శుచిర్భూత; ఋతుస్నాత...రంజిల్లఁగాన్
  3. ↑ గాదె