Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

పాశుం జేసి యాసుందరి కి ట్లనియె.

⁠ 250


చ.⁠

“కొను మిదె నీమనఃప్రియునిఁ గోమలి! వీఁడు చతుశ్శతాబ్దముల్
మను నిటమీఁదఁ; బుత్త్రులఁ గ్రమంబున నూర్వురఁ గాంచుఁ; గీర్తివ
ర్ధనుఁ డగు; సంతతాధ్వర[1]విధానములం బరితుష్టి సేయు న
య్యనిమిషకోటి కెల్లను; నిజాన్వయమౌళివిభూషణుం డగున్.”

⁠ 251


వ.⁠

అని యాదేశించి యంతర్హితుం డయ్యె;నక్కాంతయుఁ గ్రమ్మఱి చని యె
ప్పటియట్ల జీవితేశ్వరుం తన తొడలపై నిడికొని కూర్చున్నయెడం, గొండొక
వడికి లబ్ధచేతనుం డై సత్యవంతుండు దెలిసి, నిజవల్లభం జూచి యి ట్లనియె.

⁠ 252


క.⁠

“కడుఁ దడవు నిద్రవోయితిఁ
[2]బడఁతీ! ననుఁ దెలుపవలదె? బలియుఁ డొకరుఁ డె
క్కుడుజవమునఁ బట్టి బలం
బెడలఁగ ననుఁ దిగిచె; నాతఁ డెవ్వఁడు సెపుమా?

⁠ 253


చ.⁠

అది కల గాదు; నిక్కువమ యైనటు లున్నది; నాకు నెంతయున్
మది [3]వెఱ పుట్టె” నావుడును మానిని యిట్లను “నీకు నంతయున్
ముదమున రేవు సెప్పెదఁ; దమోమయమై యిదె శర్వరీముఖం
బొదవె; విలంబనం బిచట నొప్పదు; లెమ్ము నరేంద్రనందనా!

⁠ 254


మ.⁠

[4]అదె నక్తంచరు లిందు నందును మహోగ్రాకారులై [5]క్రందుగా
మెదలం జొచ్చిరి; ఘోరఫేరవరుతుల్ మిన్నందెఁ దీవ్రంబు లై;
పదశబ్దంబులు మీఱఁ జూడు కలయం బాఱం దొడంగెం బెనుం
గదుపుల్ గట్టి మృగంబు లియ్యెడ; భయోత్కంపంబు నా కయ్యెడిన్.

⁠ 255


క.⁠

విను నీవు దడయుటకు మీ
జననియు జనకుండుఁ గరము సంతాపభరం
బునఁ బొందుదు రింతకుఁ; గ్ర
న్నన వారికి సంతసం బొనర్పవె యధిపా!”

⁠ 256


వ.⁠

అని పలికి తదీయవిషాదచేష్టితంబు లుపలక్షించి వెండియు.

⁠ 257


చ.⁠

“తమమును బెల్లుగాఁ బరగె; దవ్వు నిజాశ్రమభూమియున్; దను
శ్రమమును బాయ దిప్డు నను చందమ యైనఁ జనంగ నేల? యిం
పమరఁగ నింత ప్రొద్దు సుగుణాకర! యిచ్చట నిల్చి రేపు వో
దమె? తెఱఁ గెద్ది?” నావుడును దన్వికి సాళ్వతనూజుఁ డి ట్లనున్.

⁠ 258


క.⁠

“మానె శిరోవేదన; నా
మేనికిఁ దగ లావు వచ్చె; మెల్లన యరుగం
గా నోర్తుఁ; దల్లిదండ్రులఁ
గానక యే నెట్లు నిలుతుఁ గాననభూమిన్?

⁠ 259


క.⁠

ఇంతకు మున్నెన్నఁడు నే
నింత తడవు వారిఁ బాసి యెందుఁ దడయ; నేఁ
డింతవడి మసలుటకు వా
రెంత వడిరొ? యేమి యైరొ? యెట్లున్నారో!

⁠ 260


ఆ.⁠

సంధ్యప్రొద్దు నన్ను జనని యెన్నఁడు నిలు
వెడలనీదు; నేఁడు విపినభూమి
మధ్యరాత్రివేళ మసలుట కాయమ
యెట్టిపాటు పడునొ యే నెఱుంగ.

⁠ 261
  1. ↑ వితానము...నిజాన్వయకోటివిభూష
  2. ↑ బడలిననుం దెలుపవలదె...డెక్కుడుపడి ననుఁ బట్టి
  3. ↑ మర పుట్టె
  4. ↑ ఈపద్య మొకానొకప్రతియందు కానరాదు.
  5. ↑ క్రమ్మగా...ఘోరభైరవ