Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

వేఁడు మొక్కవరము, విభునిజీవిత మొక్క
టియును దప్ప; నేదియైన [1]నొండు.”

⁠ 224

సావిత్రి యమునివలన నభీష్టవరంబులు వడయుట

చ.⁠

అనవుడు మద్రరాజసుత ప్రాంజలి యై సమవర్తితోడ ని
ట్లను; “రిపుకోటిచే నపజయంబును బొంది వనాంతరంబునం
దనవరత[2]వ్రతాభిరతుఁ డైన మహాత్ముఁడు సాళ్వభూవిభుం
డనఘుఁడు లబ్ధచక్షుఁ డగునట్టులుగాఁ గరుణింపవే దయన్.”

⁠ 225


క.⁠

నావుడు “నట్టుల యయ్యెడు;
నీవిట రా[3]వలదు; మగుడు నెమ్మి” నని వెసం
బోవఁ దొడంగెను బితృపతి;
యావెలఁదియు నంత నిలువ కరిగెఁ బిఱుందన్.

⁠ 226


వ.⁠

ఇట్లు సని చని మఱియు ని ట్లనియె.

⁠ 227


చ.⁠

“ఎడపక వాఙ్మనఃక్రియల నేరికి [4]నె గ్గొనరింపఁ బూన; రె
య్యెడలను దీనులం గరుణ యేర్పడఁ బ్రోవన చూతు; రిచ్చుచోఁ
గడమ వడంగనీ కెదిరికాంక్షితముల్ దుదిముట్టఁ దీర్తు; రె
క్కుడు మదిఁ గూర్తు రాశ్రితులకున్; విను మిన్నియు నార్యధర్మముల్.

⁠ 228


క.⁠

నీవెఱుఁగని యది [5]యెయ్యది
దేవోత్తమ! ధర్మగతుల తెఱఁ గెల్ల భవ
ద్భావాధీన మగుటఁ గా
దే వెలసితి నీవు ధర్మదేవత యనఁగాన్.

⁠ 229


క.⁠

సమబుద్ధితోడఁ దత్త
త్సముచితకర్మఫల మఖిలజంతుతతులకున్
సమకూర్చుట, నీకయ్యెను
సమవర్తియనంగఁ బేరు జగదభినుత మై.

⁠ 230


క.⁠

యముఁ డండ్రు నిన్ను నార్యులు
యమియింపుదు భూతముల నెల్ల; న ట్లగుటఁ దగున్;
శమనుండ వైతి కల్మష
శమనంబునఁ జేసి నీవు జలజాప్తసుతా!”

⁠ 231


వ.⁠

అనినం బ్రేతపతి యాపుణ్యసతి కి ట్లనియె.

⁠ 232


క.⁠

“తృషితుఁ డగువాని బరిలఘు
తుషారతోయములు మోదితునిఁ జేయుగతిన్
హృషితాత్ముఁ జేసె ననుఁ గ
ల్మష[6]హరణములైన నీసమంజసఫణితుల్.

⁠ 233


వ.⁠

కావున సత్యవంతుని ప్రాణంబులు దక్కం దక్కినకోర్కి యెయ్యది యైనం జెప్పుము;
సఫలంబు సేసెద” ననిన సావిత్రి “దేవా! వైరులచేత సపహృతం బైన రాజ్యం
బెప్పటియట్ల [7]ద్యుమత్సేనుండు ప్రాపించునట్లుగా ననుగ్రహింపవే” యని
వేఁడుటయు వైవస్వతుం డట్ల యగునని పలికి యి ట్లనియె.

⁠ 234


ఆ.⁠

“వలదు నిలువు మింక; వదలక నీభక్తి
మగని కెక్కె; దుర్గమంపుఁ ద్రోవ
యిది; కృతంబు లయ్యె [8]నెల్లయు; నీవిట
వచ్చునెలవు లేదు వనజనయన!”

⁠ 235


వ.⁠

అనిన నమ్మహాభాగ యతని కి ట్లనియె.

⁠ 236


క.⁠

“ధర్మాత్ములు దమ సలిపెడు
ధర్మక్రియ దప్ప రెట్టి దశలందును; మో

⁠
  1. ↑ నొకటి
  2. ↑ ప్రభీతియుతు...గరుణింపవే మదిన్
  3. ↑ వలవ దుడుగు
  4. ↑ హింస యొనర్పఁబూన
  5. ↑ గలదే
  6. ↑ రహితము
  7. ↑ ద్యమత్సేనునకుం గల్గునట్లుగా
  8. ↑ నెల్లవియును నిటు, ...వామనయన