Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

యెడ శయనింతు” నావుడు సితేక్షణ మెత్తనిసంభ్రమంబుతోన్.

⁠ 215


క.⁠

తనయంకతలము ప్రియుశిర
మున కుపధానముగఁ జేయ, [1]భూపతనయుఁ డొ
య్యన వ్రాలి సోలి నిశ్చే
తనుఁ డైన ట్లుండెఁ; గొంత తడవున కెదురన్.

⁠ 216


మ.⁠

కనియెం గోమలి నీలమేఘ[2]విలసత్కాలాంజనాకారు, ఘో
రనిశాతోత్కటదంష్ట్రు, నుజ్జ్వలచలద్రక్తాక్షుఁ, బ్రత్యగ్రకాం
చనవర్ణాంబరు, నంత్యకాలదహనజ్వాలాప్రచండున్, జగ
జ్జనసంత్రాసను, నొక్కదివ్యుఁ బటుపాశప్రౌఢహస్తోద్ధతున్.

⁠ 217


వ.⁠

అప్పురుషుండు నధికసంరంభంబున సత్యవంతుం గదిసిన, నయ్యింతి యెంత
యు భయంబునం బ్రియునిశిరం బొయ్యన దిగువం జేర్చి నిల్చి కృతాంజలి యై
“యయ్యా! మీ రెవ్వ? రియ్యెడకు నెయ్యది సేయం దలంచి విజయంచేసితి?”
రనిన నతం డి ట్లనియె.

⁠ 218


సీ.⁠

“కాలుండఁ జువ్వె యేఁ గమలాక్షి; నను నీవు
                 మహితపాత్రివ్రత్యమహిమఁ జేసి
కానంగఁ జాలితి; కానరా దన్యుల
                 కిటు; నీదుభర్తకు నిపుడు కాల
మగుటయు, వీఁడు మహాపుణ్యనిధి గాన
                 యితరులఁ బనుపక యేన వీనిఁ
గ్రచ్చఱఁ గొనిపోవఁగాఁ జనుదెంచితి”
                 నని యుగ్రభంగి నయ్యంతకుండు

⁠


ఆ.⁠

ధరణినాథతనయు తనువునఁ బ్రాదేశ
పరిమితాత్ముఁ డగుచుఁ బ్రజ్వరిల్లు
జీవు వెడలఁ దిగిచి చెచ్చెర నతిదీర్ఘ
భయదపాశనికరబద్ధుఁ జేసి.

⁠ 219


మ.⁠

కొని వేగంబున దక్షిణాభిముఖుఁ డై ఘోరంపుమార్గంబునం
జనఁగాఁ జొచ్చె; ననంతరంబ మదిలో సావిత్రి శోకంబు పై
కొనఁ, బ్రాణేశ్వరు దేహ మొక్క యెడ సంగుప్తంబు గావించి, యా
తని వజ్జం దగఁ దాను నేఁగెఁ బదపద్మంబుల్ [3]వడిం దొట్రిలన్.

⁠ 220


ఆ.⁠

దానిఁ జూచి [4]కరుణ ధర్ముండు “నీ వేల
వచ్చెదవు? లతాంగి! వలదు నిలువు;
మింక నీ కగమ్య మిటమీఁదితెరు వెల్ల”
ననిన నతని కిట్టులనియెఁ బొలఁతి.

⁠ 221


క.⁠

“పతు లెందుఁ జనిన నచటికి
సతులుం జనవలదె? నీప్రసాదమునను, మ
త్పతిభక్తికతమునను సం
స్తుతగుణ! నాకరుగరాని చోటులుఁ గలవే?

⁠ 222


వ.⁠

సకలమార్గంబులందును ధర్మమార్గంబు ప్రధానం; బట్టిధర్మంబునకు నాధారంబు
సజ్జనుల యని వినంబడు; నట్టి సజ్జనసందర్శనం బెప్పుడు వృథగాదు; గావున సజ్జ
నశేఖరుండ వనం జను నీ దైనసందర్శనంబునం బరమశుభంబులం బొందక
యేను రిత్తజనంబుల తెఱంగున నూఱక యెట్లు మగుడుదు? ననిన దాని ప్రగల్భ
వచనంబులకు నద్భుతం బంది ధర్ముం డి ట్లనియె.

⁠ 223


ఆ.⁠

“తనులతాంగి! భవదుదార[5]వాగ్భంగికి
మెచ్చు వచ్చె నాత్మ; నిచ్చువాఁడ

⁠
  1. ↑ భూవరసుతుఁ
  2. ↑ విదళ...సంత్రాసకు
  3. ↑ వొరిం 9మొగిం) దొట్రిలన్
  4. ↑ దండధరుఁడు
  5. ↑ భంగికి మెచ్చు, వచ్చె నీయభీష్ట మిచ్చువాఁడ