Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

అంత నెంతయుం బ్రొద్దునకుఁ దెలిసి సాల్వుసౌంభకంబున వసుదేవుం గానక,
దాని మాయఁగా నెఱింగి పదంపడి మాయావి యయిన సాల్వుం జూచి, వాని
పయి నలిగి యే సేసిన నయ్యసురయు సౌంభకంబు నదృశ్యం బగుటయు.

⁠ 192


క.⁠

అసురుల యాక్రోశధ్వను
లెసఁగెం బదిదిశల; నంత నేనును దద్రా
క్షసులఁ గతాసులఁ జేసితిఁ
బ్రసభంబున శబ్దభేదిబాణప్రతతిన్.

⁠ 193


వ.⁠

అంత సాల్వుండును దన సౌంభకంబుఁ బ్రాగ్జోతిషంబుఁ జేసి తానును [1]దానవుం
డయి పర్వతవర్షంబు నాపయిం గురిసిన.

⁠ 194


ఆ.⁠

పరుషవిషమభూరిపాషాణభీషణ
గిరులు వచ్చి నన్నుఁ దెరలఁ గప్ప
వజ్రబాణమేసి వాని నన్నింటిని
బాచి యున్న నన్నుఁ జూచి యపుడు.

⁠ 195


క.⁠

దారుకుఁ డి ట్లనియె “మహా
వీరు ను పేక్షింపఁ దగునె వీనిని మాయా
ప్రారంభు? నుపేక్షింప ర
పారపరాక్రములు పోర; [2]బలియుఁడు వీనిన్.”

⁠ 196


వ.⁠

అనిన వానిపలుకులు విని యలిగి యనలజ్వాలాకరాళం బయి, ప్రతికూలరాక్షస
యక్షగంధర్వదైత్యదానవభస్మసాత్కరణదారుణం బయిన చక్రంబు నభి
మంత్రించి సౌంభకంబు పయి వైచిన నది యుగాంతకాలపరివేషభీషణం బయిన
రవిమండలంబునుంబోలె గగనంబునం బఱచి సౌంభకమధ్యంబునం బడిన.

⁠ 197


చ.⁠

తడయక ఘోరదర్శనసుదర్శనపావకుచే దహింపఁగాఁ
బడి పరమేశ్వరోగ్రశరపావకదగ్ధపురత్రయాభ మై
యెడరి ధరిత్రిమీఁదఁ బడియెం జెడి సౌంభక, మంత సాల్వుఁడుం
బడియె మదీయచక్రపటుపాతరయంబున రెండు వ్రయ్యలై.”

⁠ 198

పాండవులు ద్వైతవనంబునకు వచ్చి యుండుట

వ.⁠

అని యిట్లు సాల్వుం దన చంపిన విధంబు సెప్పి చక్రధరుండు పాండవుల వీ
డ్కొని సుభద్రాభిమన్యులం గాంచనరథం బెక్కించుకొని తోడ్కొని ద్వారవతి
కరిగె; ధృష్టద్యుమ్నుండును బ్రతివింధ్యాతులయిన ద్రౌపదేయులం దోడ్కొని
ద్రుపదుపురంబునకుం జనియె; నిట పాండవులును రథంబు లెక్కి యాయుధం
బులు ధరియించి యింద్రసేనాది మూలభృత్యు లిరువదుండ్రు ముందట రా, ననేకస
హస్రబ్రాహ్మణవరులతో ద్వైతవనంబున కరిగి; రంత ధర్మరాజు తమ్ముల కి ట్లనియె.

⁠ 199


మధ్యాక్కర.⁠

 “ఇది మహోగ్రాటవి; సింహశరభోరగేంద్రశార్దూల
మదగజాకీర్ణంబు; దీనిలోన నేమఱ కుండవలయు;
నదియునుంగాక పరప్రయోగమాయలు గల; వెఱిఁగి
మది నుండునది” యన్న నన్న కి ట్లను మఘవనందనుఁడు.

⁠ 200
  1. ↑ దానవుం డయి శిలాకలాపలాసితలతాగుల్మవల్మీకమహాపాదపం బగు పర్వతవర్షంబు
  2. ↑ ఁబ్రాకృతు (వీనిన్) నైనన్