Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

ధృతి నొప్పారిరి చిత్రవారిధరపంక్తిచ్ఛన్నశైలాకృతిన్.

⁠ 82


చ.⁠

కదిసి ప్రహస్తుఁ డార్చి పరిఘంబు రయంబున నెత్తి, భీకరో
న్మదకరిహస్త[1]తాడనముమాడ్కి తలిర్పఁగ వ్రేసె నీసుమై
నదయత రావణానుజుని; నాతఁడు వ్రేటున కించుకంతయుం
గదలక హేమకూటగిరికైవడి నిల్చి యుదీర్ణకోపుఁ డై.

⁠ 83


మ.⁠

శతఘంటాపరిభూషితంబును, జగత్సంహారఘోరానలో
త్థితకీలాసదృశంబు నై [2]మెఱయు శక్తిం బూన్చి మంత్రించి యు
ద్ధతతేజుండు ప్రహస్తు వైచిన వెసం దత్క్రూరసంపాతపా
టితవక్షుం డయి కూలె వాఁడు శతకోటిచ్ఛిన్నశైలాకృతిన్.

⁠ 84


వ.⁠

ఇట్లు ప్రహస్తుండు పడినం దత్సైన్యంబులు విముఖంబు లగుటయు, ధూమ్రా
క్షుండు రోషతామ్రాక్షుం డగుచు నతినిబిడలాహకానీకభీకరం బై కాఱు
కొనుచున్న నిశాచరచక్రంబుతో నురులం బఱతెంచినం, జలించి బలీముఖ
బలంబులు దుర్బలంబులై తొలంగినం జూచి, యాంజనేయుం డజయ్యుం డై
నిల్చినం, బెల్చన యెప్పటియట్ల యూథపతులుం గూడుకొని రప్పుడు.

⁠ 85


సీ.⁠

అనిలతనూజ ధూమ్రాక్షరక్షితసైన్య
                 [3]యుగ్మంబునకు నయ్యె నుగ్రసమర;
మందు నిష్ఠురచరణాఘాతముల డొల్లు
                 నరదంబులును, శిలాహతులఁ దూలి
యొఱలు నేనుంగులు, నుత్తాలతరుహతిఁ
                 ద్రెళ్లు ఘోటకములుఁ, దీవ్రనఖర
దంతక్షతంబుల దళితాంగు లై నేలఁ
                 బడి తన్నికొను వీరభటులు నగుచు

⁠


ఆ.⁠

నధికశౌర్యసారు లగు కపివీరుల
చేత నొచ్చి, దైత్యసేన భీతిఁ
బఱచెఁ గొంత; బెండువడియుండెఁ గొంత; ధూ
మ్రాక్షువెనుక కొదిఁగె నంతఁ గొంత.

⁠ 86


మహాస్రగ్ధర.⁠

కని ధూమ్రాక్షుండు విశ్వగ్రసనరయలసత్కాలమేఘంబ పోలెన్
ఘనగర్జాఘోష మొప్పం గడఁగి శరశతాకల్పితాసారదుర్ద
ర్శనవీరారంభుఁ డైనన్, సకలహరిచమూసంఘమున్ విహ్వలం బై
చనెఁ, దూలెం, గూలె, లావుం జలమును జెదరన్, సంగడిన్ విచ్చె, నొచ్చెన్.

⁠ 87


తే.⁠

అతని యుద్ధతి [4]సైఁపక యనిలసూనుఁ
డనిలవేగుఁ డై పఱతెంచి యార్చి తాఁకెఁ;
బ్రథన మయ్యిద్దఱకు నుగ్రభంగి నమర
పతికి ప్రహ్లాదునకుఁబోలెఁ బ్రకట మయ్యె.

⁠ 88


క.⁠

పరిఘంబులు గదలును బె
క్కరుదుగ రక్కసుడు వైచె నమ్మారుతిపై;
నురుగండశైలములు ఘన
తరువులు హరివరుఁడు గురిసె దానవుమీఁదన్.

⁠ 89


వ.⁠

ఇబ్భంగిం బెనంకువ సెల్లుచుండం గొండొకసేపునకు.

⁠ 90
  1. ↑ పాతనము...నాతనివ్రేటున
  2. ↑ నెఱయ...శతకోటిక్షిప్త
  3. ↑ యుగళంబునకు
  4. ↑ సైరింప కనిలసూనుఁ...పతికిఁ బ్రహ్లాదునకుఁ బోలె