Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

డయిన హనుమంతుండు రాఘవునకుఁ గృతాంజలి యై యి ట్లనియె.

⁠ 12


క.⁠

“దేవిఁ బొడగంటి నేను ధ
రావల్లభ! శైలసరిదరణ్యనగరపా
రావారకలిత మగు వసు
ధా[1]వలయము వెదకి వెదకి దక్షిణపుదిశన్.

⁠ 13

హనుమంతుఁడు రామునితో సీతం జూచిన వృత్తాంతము సెప్పుట

తే.⁠

అవధరింపుము దేవ! నే మందఱము న
నేకముఖమునఁ దొలి తొలి యిందు నందు
నరయుచును బోయి యొక్కెడ నతివిశాల
మైన భూవివరము గంటి మద్భుతముగ.

⁠ 14


వ.⁠

కని దానిం బ్రవేశించి నిరంతరతిమిరసంవృతంబును, బహుకీట[2]సంకులంబును
నైన మార్గంబున ననేకయోజనంబులు సనునెడ, ముందట నర్కప్రకాశం బై
న పురంబు గానంబడియె; నందొక్క తాపసాంగన యుండి మమ్ము నాదరించి,
తన పేరు ప్రభావతి యనియును, నప్పురంబు మయుని పురంబనియును జెప్పి,
మధురంబు లయిన భక్ష్యభోక్ష్యంబు లొసంగినం దృప్తుల మై తదుపదిష్టమా
ర్గంబున మహీవివరంబు నిర్గమించి సహ్యదర్దురశైలంబులు గడచి మలయశైల
శిఖరం బెక్కి.

⁠ 15


స్రగ్ధర.⁠

లీలం గల్లోల[3]మాలోల్లిఖితగగన మై, లీననానాకుళీర
వ్యాళోగ్రగ్రాహమీనావళుల నెసఁగి, దుర్వారవారోఘగంభీ
రాలంఘ్యప్రౌఢవేగం బగుచు, బహుతరాయామవిస్తార మై బి
ట్టాలోకింపంగ నుగ్రం బగు జలనిధి నంతంతటం గంటి మంతన్.

⁠ 16


క.⁠

కని యిది రత్నాకర; మి
వ్వననిధి సీమమునఁ గల్గు వసుమతిలోనన్
జనకసుత వెదకి కానమ;
చన దివ్వారాశి దాఁటి చన నెవ్వరికిన్.

⁠ 17


ఉ.⁠

భూమితనూజఁ గాన మని పోయి రఘూద్వహుతోడఁ జెప్పి, య
బ్భూమిపుచిత్త మాతురతఁ బొందఁగఁ జేయుటకంటెఁ జూడఁగా,
నీమెయిఁ జావు మేలు; మన కేల విచారము లింక? నంచు నం
దేము గడంగి యందఱము నేక[4]తమం బగు నిశ్చయంబుతోన్.

⁠ 18


వ.⁠

అనశనవ్రతంబు సంకల్పించి నియతచిత్తుల మై యుండి, రాఘవు కార్యార్ధం బై
తెగిన జటాయువు గృతార్ధుం డయ్యె; మనము నట్టి పుణ్యలోకంబు వడయుద
మని పలుకుచున్నయెడ.

⁠ 19


క.⁠

గిరిశృంగతుంగవిగ్రహుఁ,
డురుతరసత్త్వుఁడు, విహంగమోత్తముఁ డందొ
క్కరుఁ డొయ్యన మాయున్నెడ
కరుదుగఁ జనుదెంచి విగళితాశ్రుం డగుచున్.

⁠ 20


సీ.⁠

“అయ్యలార! జటాయు వని పల్కెదరు మీర
                 లెవ్వరు? సెప్పరే; యేను వాని
కగ్రజుండ; ననూరునాత్మజన్ముల మేము;
                 సంపాతి నా పేరు; సమ్మదమున
నేనును దమ్ముడు నినమండలమునకుఁ
                 జను వేడ్క నొకనాఁడు చదలి కెగసి
చనఁ జనఁ దీవ్రాంశుసంతాపమునఁ జేసి
                 కమరె నా ఱెక్కలు; గమర వయ్యె

⁠


తే.⁠

ననజుపక్షమ్ము; లే నిమ్మహాచలమున
నాఁటఁగోలె నెచ్చటికిఁ జనంగ నేర

⁠
  1. ↑ వలయం బెల్ల వెదికి దక్షిణపు
  2. ↑ సంకటంబును
  3. ↑ భాగోల్లిఖిత
  4. ↑ మతం బగు