Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

బులు వర్జించి, సమతలప్రదేశంబున నిబిడంబుగా శిబిరసన్నివేశంబు సేసి, నిత్యం
బు నుపద్రవంబు సేయుచున్న సౌంభవిజృంభణంబునకు [1]సహింపక సమర
సంరంభంబున సర్వాయుధసన్నద్ధు లయి.

⁠ 153


క.⁠

ఉద్యద్బలులు గుమారులు
విద్యాధరసములు పురము వెలువడిరి రణై
కోద్యములు చారుదేష్ణుఁడు,
బ్రద్యుమ్నుఁడు, సాంబుఁడును విపక్ష[2]జిఘాంసన్.

⁠ 154


[3]మణిభూషణము.⁠

రామవిక్రముఁ డజేయుఁ, డరాతిగజావలీ
సామజహితుఁడు, సాంబుఁడు సాల్వచమూపతిన్
క్షేమవృద్ధి యనువాని నకృత్రిమసాహసో
ద్దాముఁ దాఁకె శరధారల [4]ధారుణిఁ గప్పుచున్.

⁠ 155


క.⁠

జాంబవతేయు బృహద్విశి
ఖంబులకున్ [5]బెదర కెదిరి ఘనుఁ డేసె రణా
గ్రంబున నాతనిపై నవి
లంబితుఁ డై క్షేమవృద్ధి లక్షశరంబుల్.

⁠ 156


వ.⁠

వాని యేయు [6]నేర్పునకు సహింపక సాంబుండు జాంబూనదపుంఖంబు లయిన
విశిఖంబులం దదీయరథాశ్వమర్మంబుల నేసిన నవి మర్మభేదవేదనలం దలరి
యతివేగంబున రణంబు వెలువడ రథం బీడ్చుకొని సారథికి వశంబు గాక పఱచె
నట్లు సాల్వచమూపతి సమరవిముఖుం డయిన.

⁠ 157


స్వాగతము.⁠

వేగవంతుఁ డను వీరుఁడు సాంబున్
వేగవంతుఁ డయి [7]వీఁకను దాఁకెన్
వేగబాణపదవీతతులన్ ది
గ్భాగముల్ విశిఖపంజరముల్ గాన్.

⁠ 158


ఆ.⁠

సాంబుఁ బాయు మనుచుఁ జారుదేష్ణుం డల్గి
వేగవంతుఁ దాఁకి వీఁకతోడ
వాని మస్తకంబు వ్రయ్యంగ వడి గదం
బొడిచె రుధిరవారిపూర మొలుక.

⁠ 159


వ.⁠

ఇట్లు చారుదేష్ణునిష్ఠురగదాఘాతంబున వేగవంతుండు విగతజీవుం డయి నిర్ఘాత
పాతభిన్నోన్నతగిరిశిఖరంబునుంబోలె నేలఁ ద్రెళ్ళినం జూచి విచింత్యుం డను
వాఁ డవిచింత్యవిక్రముం డయి.

⁠ 160


తే.⁠

చారుదేష్ణుపైఁ గడువాఁడిశరము లేసె;
లతఁడు కార్ముకహస్తుఁ డై యాక్షణంబ
వానిపై నభిమంత్రించి వహ్నిబాణ
మేసె [8]నుగ్రస్ఫులింగంబు లెసఁగం జదల.

⁠ 161


క.⁠

అనలాస్త్ర మట్లు వక్షముఁ
గొనిన విచింత్యుండు గూలెఁ గుతలం బద్రువన్;
ఘను వానిఁ జూచి హాహా
స్వనము లెసఁగ సాల్వుసేన సంక్షోభించెన్.

⁠ 162


వ.⁠

సాల్వుండు నిజసేనాసంక్షోభం బుడిచి, సర్వాయుధసనాథం బయిన రథం బెక్కి;
యాదవకుమారవాహినిపయి నెత్తి, యేయుచు వ్రేయుచుం బొడుచుచుఁ బ్రతి

⁠
  1. ↑ నోపక సంరంభంబున సమరసన్నద్ధులై
  2. ↑ జిగీషన్
  3. ↑ ఈమణిభూషణవృత్తము ఒకప్రతియందు యుత్పలమాలికగా యున్నది. ఉ. ˈఆహవవిక్రముండును నజేయుఁ డరాతిగదావలీసమా, జాహితుఁ డైనరాముఁడును సాల్వచమూపతి క్షేమవృద్ధియున్, ఆహకేలి దాఁకిరి మహార్ణవవీచులభంగి సద్భుజో, త్సాహసమేతు లై కడఁగి సైన్యము వెక్కసమంది చూడఁగాన్.ˈ
  4. ↑ దప్పక
  5. ↑ జెదర
  6. ↑ శరంబులనేర్పున
  7. ↑ వీక నెదిర్చెన్ ... ది, గ్భాగ మెల్ల శర
  8. ↑ ననలస్ఫులింగం