Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.⁠

“తనువృత్తాంగుఁడు, శుద్ధకాంచనసముద్యద్వర్ణుఁ, [1]డభ్యుల్లస
ద్వనజాతాయతచారులోచనుఁడు, దీవ్యద్భూరితేజోఘనుం,
డనఘుం డల్ల రథంబుపై వెలుఁగు పుణ్యాత్ముండు ధర్మాత్మజుం
డనిరోధప్రతిభాప్రభావనిధి యత్యాశ్చర్యశౌర్యుం డనిన్.

⁠ 207


చ.⁠

కురుకులశేఖరుం డతఁడు ఘోరరణంబుల నెట్టిశత్రులున్
శర ణని [2]సొచ్చి రేని విలసత్కరుణామతిఁ గాచు; నీవు చె
చ్చెరఁ జెడిపోక, నాపనుపు సేసి, వినీతి యెలర్ప నమ్మహా
పురుషుని నాశ్రయింపుము; విభుండును నీ దగు తప్పు లోఁగొనున్.

⁠ 208


చ.⁠

ఘనజవసత్త్వచారుతురగంబులఁ బూనిన యల్లవిస్ఫుర
త్కనకరథంబు పై [3]నతులకాయుఁడు, సాలమహీరుహంబు చా
డ్పునఁ దనరారుచున్, వెలయు భ్రూకుటియున్, దశనోష్థపీడనం
బును నయి యున్న వాఁ డనిలపుత్త్రుఁడు భీముఁడు, భీముఁడాజులన్.

⁠ 209


ఉ.⁠

ఈతనిపౌరుషం బరయ నెందు నమానుషకృత్య, మప్రతీ
ఘాత, మనేక, మద్భుతము; గర్వితు లౌ ధరణీశ్వరుల్ నిజం
బీతని నాజిలోఁ జెనయ నెవ్వరు నోడుదు; రిమ్మహాభుజుం
డాతతరోషుఁ డైనఁ బ్రళయానలు నట్టిఁడ; యాఱఁ డేమిటన్.

⁠ 210


ఉ.⁠

ధర్మజు కూర్మితమ్ముఁడును, దత్ప్రియశిష్యుఁడు నైనవాఁడు స
త్కర్ముఁడు వాఁడె చూడుము ప్రగాఢ[4]వికీర్ణజితేంద్రియుండు, దు
ష్కర్ములఁ గన్న సైఁపఁడు, నికామభయంకరవిక్రమక్రియా
నిర్మథితారి, ఫల్గునుఁడు, నిర్మలతేజుఁ, డజేయుఁ, డాజిలోన్.

⁠ 211


క.⁠

అవశగతిఁ గామరోషా
దివికారము లొందినను, మదిని ధర్మపథ
ప్రవిహతి గానీఁ డతఁ డా
దివిజేంద్రతనూజుఁ డద్వితీయుఁడు పేర్మిన్.

⁠ 212


చ.⁠

అయనయసంగ్రహుండు, [5]వినయధ్యవసాయి, భయార్తలోకసం
శ్రయుఁడు, గృతాస్త్రుఁ, డాహవవిశారదశౌర్యుఁడు, శిష్టబాంధవ
ప్రియుఁ, డసమానసుందరగంభీరశుభాకృతి, యల్ల పుణ్యుఁ డా
రయ నకులుండు పాండుసుతరత్నము, భాసురకీర్తి, యిమ్మహిన్.[6]

⁠ 213


ఉ.⁠

[7]వీరుఁడు చిత్రయోధి, దృఢవేధి, గృతాస్త్రుఁడు, భూరిబుద్ధివి
స్ఫారుఁడు, వాగ్విశారదుఁడు, పార్థులకూరిమితమ్ముఁ, డుజ్జ్వలా

⁠
  1. ↑ డత్యుల్ల; డుత్ఫుల్ల
  2. ↑ వచ్చి
  3. ↑ నుదిత...బెరయు భ్రూకుటి
  4. ↑ వితీర్ణ...డజేయుఁ డేరికిన్
  5. ↑ వినయధ్యవసాయి; వినయవ్యవసాయి
  6. ↑ 213-214వ పద్యములకు మధ్య. "క. ఈతని కీతఁడె సాటి మ, హీతలభూభృత్సమాజబృందములోనన్, శీతనగసేతుమధ్యో, ర్వీతలవిఖ్యాతయశుఁడు వీరుఁడు తలఁపన్." అని యొకప్రతియం దున్నది.
  7. ↑ ధీరుఁడు చిత్రయోధి దృఢదీప్తకృతా