Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.⁠

[1]అల్ల కాంచనరథముపై నలరువాఁడు
ఘనుఁడు క్షేమంకరుండు త్రిగర్తవిభుఁడు
మఱియు నినుఁ జూచుచున్నాఁడు మగువ! వాఁడె
దీప్తభుజుఁ డైన కాళింగదేశవిభుఁడు.

⁠ 153


తే.⁠

[2]ఉవిద పద్మాకరముపొంత నుండి నిన్ను
మెచ్చి కనుఁగొనుచున్న యున్మీలితాక్షుఁ
డుర్వి నిక్ష్వాకువంశోద్భవుండు సూవె
సుబలభూపతిపుత్త్రుండు సుభగుఁ డతఁడు.

⁠ 154


వ.⁠

అరుణాశ్వయుక్తంబు లయినరథంబులయందు రత్మమయభూషణు లయి సమిద్ధ
వహ్నులుంబోలె వెలుంగుచున్న యాసౌవీరకుమారులు పన్నిద్దఱుం దన్నుం జేరి
కొలువ, ననేకసహస్రకరితురంగరథపదాతిపరివృతుం డై మహాగజంబుపై శోభిల్లు
చున్న యవ్వీరుండు సింధుసౌవీరనాథుం డైనజయద్రథుం; డమ్మనుజేశ్వరుం
డిప్పుడు నీతెఱం గెఱుంగఁ దివిరి నన్ను నిట పుత్తెంచె” ననినఁ బాండవపత్ని
మృదుసంభ్రమంబునం గదంబశాఖ విడిచి యుత్తరీయంబు సంగతంబు గావిం
చుకొని కోటికాస్యున కి ట్లనియె.

⁠ 155


తే.⁠

“అన్న! యిచ్చట నే నొంటి [3]నున్నదాన
నీ విచటి కేఁగుదెంచుట నియతి యగునె?
సుతవతిని ధర్మవతి నన్ను నితరకాంతఁ
గాఁ దలఁచి పెక్కులు వల్కఁ గాదు నీకు.

⁠ 156


వ.⁠

నీవు శిబివంశోద్భవుం డైనసురథుపుత్త్రుండ వగు టే నెఱుంగుదు; నస్మత్ప్రకారం
బు సెప్పెద విను; మేను బాంచాలపతి యైనద్రుపదుకూఁతురఁ; గృష్ణ యనుదా
నం; బాండునందను లగుయుధిష్ఠిరభీమార్జుననకులసహదేవులకు ధర్మపత్ని;
నవ్వీరు లిప్పుడు నన్ను నివ్వనంబున నునిచి.

⁠ 157


తే.⁠

ధర్మజుఁడు దూర్పు, భీముఁడు దక్షిణంబు,
నర్జునుఁడు పడమర, గవ లర్థి నుత్త
రంబుగా వేఁటవోయిరి; రాజముఖ్యు
లనఘు లింతకు వత్తురు వినుతబలులు.

⁠ 158


వ.⁠

మీ రమ్మహాత్ములకు మాననీయులరు గావున నార్యజనమిత్త్రు లగునక్కురుకుల
పవిత్రులు సేయుసత్కారంబులు గైకొని పోవుదురు గాని యొక్కింతతడ వియ్యా
శ్రమసమీపంబున నిలువుం” డని పలికి యల్లన యవ్వరవర్ణిని భయంబునం
బర్ణగృహంబు సొచ్చినం గోటికాస్యుండును గ్రమ్మఱ చని, జయద్రథునితోడ
నబ్భామిని పాంచాలకన్యక యనియును, బాండవపత్ని యనియునుం జెప్పిన,
నద్దురాత్ముండు మదన[4]కంపితహృదయుం డగుచు నమ్మగువ నపహరింపం దివిరి,
కతిపయజనసమేతంబుగా నరిగి, సింహాగారంబు సొచ్చు వృకంబునుం బోలెఁ
బాండవనివాసంబు సొత్తెంచి పాంచాలిం గని దాని కి ట్లనియె.

⁠ 159


క.⁠

“వామాక్షి! నీకుఁ గుశలమె?
నీమన సెవ్వారియందు నిత్యప్రేమం
బై మెఱయు నట్టిసొబగులు
నీమగ లేవురుకు నిపుడు నెమ్మదియె? మదిన్?”

⁠ 160


వ.⁠

అనిన వానికి నమ్మానవతి యి ట్లనియె.

⁠ 161
  1. ↑ ఉల్లకాంచన ... నున్నవాఁడు ... దీప్తభుజుఁడు (దృప్తవిభుఁడు) గళింగధాత్రీపరుండు; పృథునిభుండు పుళిందధాత్రీవిభుండు
  2. ↑ ఉల్లపద్మా ... డుత్పలాక్షి యిక్ష్వాకువంశోద్భవుండు, సుబల
  3. ↑ యున్నదాన, నీకు నిచ్చోటి కరుదేర నీతి యగునె
  4. ↑ బాణకదంబకంపిత