Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

పారఁగఁ బెండ్లి యాడుటకు నై నిజవైభవ ముల్లసిల్ల వి
స్ఫారచతుర్విధోరుబలసంగతుఁ డై చనుచుండి యాశ్రమ
ద్వారమునందుఁ గాంచె ద్రుపదక్షితిపాలతనూజ నచ్చటన్.

⁠ 144


ఉ.⁠

నీలపయోదమండలము నిశ్చలలీల వెలుంగఁజేయుచుం
గ్రాలెడు వాలుఁగ్రొమ్మెఱుఁగుకైవడిఁ దద్వనభూమి [1]నెంతయున్
లాలితదేహకాంతిపటలంబునఁ జేసి వెలుంగఁజేయు న
బ్బాల వినీలకుంతలవిభాసినిఁ జూచి సవిస్మయాత్ముఁ డై.

⁠ 145


తే.⁠

మగువఁ దగిలినచూడ్కుల మగుడఁ దిగువ
నేర్పు సాలక, [2]యతఁడు కందర్పదర్ప
గోచరాత్ముఁ డై నిజసఖుఁ గోటికాస్యుఁ
డను నృపాత్మజుఁ జూచి యి ట్లనియె బ్రీతి.

⁠ 146


ఉ.⁠

“ఇన్నలినాక్షి యెవ్వతియొ? యివ్విపినంబున నేకతంబ యి
ట్లున్న నిమిత్త మేమియొ? సురోత్తమకన్యయొ, యక్షకాంతయో,
పన్నగభామయో! మనుజభామిని గామి నిజంబ; యిట్టి చె
ల్వున్నదియే మహీతలము నుగ్మలు లెవ్వరియందు నారయన్?

⁠ 147


ఉ.⁠

లీల [3]యెలర్పఁగా నబల లేఁజిగురాకునుబోలె నొప్పు కెం
గేలు కదంబశాఖతుదిఁ గీల్కొనఁ జేసి వసంతవిభ్రమో
న్మీలితబాలవల్లిక్రియ మే లగుచూడ్కుల మించి పావక
జ్వాలయ పోలెఁ జిత్తము నిజం బెరియింపఁ దొడంగెఁ జూచితే.

⁠ 148


ఉ.⁠

ఈకమలాక్షి నాకు హృదయేశ్వరి యైనఁ ద్రిలోకరాజ్యముం
జేకుఱ నేలినట్లు విలసిల్లనె; దర్పకవీరు బంటుఁ గాఁ
[4]గైకొని సర్వభోగములుఁ గాంతు; నొడంబడఁ బల్కి దీనికిన్
నాకును బొం దొనర్చి కరుణం జరితార్థునిఁ జేయవే ననున్.”

⁠ 149


వ.⁠

అని పనిచినం గోటికాస్యుండు గ్రక్కునం బాంచాలిపాలికిం జని ప్రణయసు
భగంబుగా నమ్మగువ కి ట్లనియె.

⁠ 150


సీ.⁠

“మృగనేత్ర! దారుణమృగసమాకుల మైన
                 యివ్వనాంతరమున నేకతంబ
యిట్లు నీయున్కికి నెయ్యది మూల? మి
                 వ్వనదేవతవొ! సురేశ్వరునితోడ
నలిగి ధరిత్రికి నరుగుదెంచిన శచీ
                 [5]లలనవో! హరియురస్థ్సలి దొరంగి
కేలిఁ గ్రుమ్మరు పద్మగేహవో! భవదీయ
                 జనకత్వమున సముజ్జ్వలితుఁ డైన

⁠


తే.⁠

పుణ్యుఁ డేవంశమునవాఁడు? పొలఁతి! నీదు
జీవితేశ్వరుఁ డగు సుఖజీవితాత్ముఁ
డెవ్వఁ? డబల! నీనామమై యింపు మిగులు
శబ్ద మెయ్యది? నాకు నిజంబు సెపుమ.

⁠ 151


క.⁠

కరిరాజగమన! మాతెఱఁ
గరయఁ దలఁచితేని వినవె యధికబలుఁడ నే
సురథుఁ డనురాజుపుత్త్రుఁడ
నరిమథనుఁడఁ గోటికాస్యుఁ డనఁ జనువాఁడన్.

⁠ 152
  1. ↑ నంతయున్
  2. ↑ యపుడు
  3. ↑ యొనర్పఁగా
  4. ↑ గైకొన నే వయస్య వెసఁ గాంత
  5. ↑ దేవివో హరియురస్స్థితి