Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

శీలుఁడు గాఁడు రెంటను బ్రసిద్ధపథంబున నప్రమత్తుఁ డై.

⁠ 106


క.⁠

విను నీవును నాపదలకు
మనమున నొక్కింత యోర్చి మహనీయముగా
నొనరింపుము తపము దపం
బునన కదా సకలసౌఖ్యములు సిద్ధించున్?

⁠ 107


క.⁠

క్షమయు, నహింసయు, సత్యము
సమతయు, నింద్రియజయంబు! శమముఁ, బరిత్యా
గమును దపోలక్షణములు;
గ్రమమున నిన్నియును నూర్ధ్వగతికారణముల్.

⁠ 108


తే.⁠

ఇందుఁ జేసిన [1]పుణ్యంబ యిందుఁ గుడుచు;
మీఁదిజన్మంబునకు నది మేలుఁ జేయుఁ;
గాన తనశక్తితోఁ గూడ దానధర్మ
చిరపరోపకారంబులు సేయవలయు.”

⁠ 109


వ.⁠

అనినం బాండవాగ్రజుండు “దానతపంబులలో దుష్కరం బెయ్యది? యెద్దాన
నధికఫలం బగు?” నని యడిగిన వేదవ్యాసుం డి ట్లనియె.

⁠ 110


సీ.⁠

“దానమూర్జితఫలదం; బర్థసాధ్య మై
                 పరగుటఁ గరము దుష్కరము నదియ;
నరులకు నధిప! ప్రాణంబుల కంటెను
                 రూపింప నర్థంబు [2]తీపు వినవె;
యుగ్రంబు లైన యాయుధముల మొనలపై
                 నుఱుకుట, యంభోధి దఱిసి చనుట,
కృషిపాశుపాల్యసంక్లేశంబు నొందుట,
                 యడవులఁ గొండల నిడుమపడుట

⁠


ఆ.⁠

నవసి యనుదినముఁ బరప్రేష్యులై
యునికి దలఁప నర్థమునకు చూవె;
యట్టి దుఃఖలబ్ద మైన యయ్యర్థంబు
విడుచు టెవ్విధమునఁ గడిఁది గాదె?

⁠ 111


శా.⁠

అన్యాయార్జిత మైనవిత్తమునఁ జేయం బూను దానంబు మూ
ర్ఖన్యాయం బది; దానఁ జేసి ఫలపాకం బేమియున్ లేదు; యు
క్తన్యాయార్జిత మించుకంత యయినం గాలంబు, దేశంబు స
మ్మాన్యం బైన తగఁ బాత్రయోగమున సౌమ్యంబై ఫలించుం దుదిన్.

⁠ 112


వ.⁠

తొల్లి ముద్గలుం డను మహాద్విజుండు సన్మార్గోపార్జితం బైన వ్రీహిద్రోణంబు స
త్పాత్రంబునఁ బ్రతిపాదించి కాదె పరమసిద్ధిం బొందె” ననిన విని ధర్మనంద
నుండు “మునీంద్రా! ముద్గలుండు వ్రీహిద్రోణం బెబ్భంగి నుపార్జించె? నెట్టిపాత్రం
బునఁ బ్రతిపాదించె? వినవలతుం జెప్పవే” యనిన నతం డి ట్లనియె.

⁠ 113

వ్యాసుఁడు ధర్మజునకు వ్రీహిద్రోణాఖ్యానంబు సెప్పుట

క.⁠

“అతిథిప్రియుఁడు విశిష్ట
వ్రతుఁడు, విమస్తరుఁడు, సత్యవచనుండు, విని
ర్జితవిషయేంద్రియుఁడు, సము
న్నతపుణ్యుఁడు, ముద్గలుఁడు సనాతనబుద్ధిన్.

⁠ 114


వ.⁠

పుత్త్రదారసహితంబుగాఁ గురుక్షేత్రంబున వసియించి, యుంఛవృత్తిపరాయ
ణుం డై పాడ్యమిం దొడంగి పదునాలుగుదివసంబు లొక్కొక్కగింజయ కాఁ
దూఁమెడువడ్లు సమకూర్చి, పర్వదినంబున బాకంబు సేయించి, దేవపితృపూజ
నంబు లొనరించి, యతిథుల కన్నంబు వెట్టి మిగిలినయన్నంబునఁ దానును బు
త్త్రకళత్రంబులును దేహయాత్ర నడుపుచు, నివ్విధంబునఁ బక్షోపవాసవ్రతం
బున వర్తిల్లుచున్నయెడ నొక్కపర్వదినంబునందు.

⁠ 115
  1. ↑ పుణ్యంబు లందుఁ
  2. ↑ తీపి ... కృషిపశుపాల్య