Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.⁠

“ద్వైతవనంబున ధర్మజు డొకనాఁడు
                 నిద్రింపఁగాఁ, దద్వనేచరంబు
లగునట్టి మృగజాతు లన్నియుఁ గలలోన
                 వచ్చి కన్నుల నశ్రువారి దొరుఁగఁ
ద మ్మెఱింగించి యాతనితోడ నిట్లను
                 “ధర్మాత్మ! మీరు నిత్యంబుఁ గడఁగి
చంపంగఁ జంపంగ సమసి యల్పావశి
                 ష్టము లయ్యె నిప్పు డస్మత్కులంబు;

⁠


తే.⁠

లేము బీజమాత్రమ దక్కి యిట్లు వనరు
చున్నవారము; మీ రింక నొండుగడకు
నరిగి మముఁ గావరే కరుణార్ద్రబుద్ధి”
ననిన నట్ల కా కని వాని కభయ మిచ్చి.

⁠ 98


క.⁠

జనపతి మేల్కొని యంతయు
ననుజుల కెఱిఁగించి యిట్టు లను “నబ్దముపై
నెనిమిదినెల లుండితి మి
వ్వనమునఁ; దగు నింక నొండువలనికిఁ బోవన్.

⁠ 99


వ.⁠

ఇప్పుడు కామ్యకవనంబు బహుమృగాకీర్ణం బై, సరసఫలభరితభూరుహప్రకరం బై,
విమలకమలాకరాభిరామం బై యున్నయది యని వింటిమి; గావునం గ్రమ్మఱ
నందులకుం జని తృణబిందునాశ్రమంబున వసియించుట లెస్స” యనినం దమ్ములు
“దేవా! నీ వెట్లు నిశ్చయించితి మాకు నదియ యిష్టం” బని పలికిరి; తదనంతరంబ.

⁠ 100


క.⁠

అనుజన్ములుఁ, బాంచాలియు
ననుచరవర్గంబు బ్రాహ్మణావలియును దోఁ
జనుదేరఁగ సమ్మదమున
ఘనతేజుఁడు సనియెఁ గామ్యకవనంబునకున్.

⁠ 101


వ.⁠

ఇ ట్లరిగి యందుఁ గృతనివాసులై యవ్వీరులు శాకఫలమూలంబులం జేసి దేహ
యాత్రలు నడుపుచు, నొండొరుల యనజడి సూచి యత్యంతదుఃఖపరవశు లగు
చు జూదంబునాఁడు దమపడినపాట్లు దలంచి కలంగుచుఁ, గ్రోధశోకంబులు దమ
లోన నుపశమించికొనుచు వర్తిల్లం బదునొక్కం డగు నేఁడు సనిన నందఱుం
గాలంబు గడగాంచినవారై వెడవెడ వికసిల్లినచిత్తంబులతో నుచితవృత్తంబుల
నుండు నంత.

⁠ 102


శా.⁠

ప్రీతుం డై చనుదెంచె నాశ్రితజనాభీష్టక్రియాశీలుఁ, డు
ద్గీతామ్నాయుఁడు, నిర్విధూతదురితక్లేశుండు, యోగా[1]మృత
స్ఫీతస్వాంతుఁ, డనంతసంతతసమావిర్భాతకారుణ్యధా
రాతోయన్నపనైకశీలుఁ డగు పారాశర్యుఁ డచ్చోటికిన్.

⁠ 103


క.⁠

మునిపతి [2]దోదవ్వులఁ గని,
జనపతి దమ్ములును దాను సంప్రీతి నెదు
ర్కొని యర్ఘ్యాదివిశేషా
ర్చనలం బరితుష్టుఁ జేసె సంభృతభక్తిన్.

⁠ 104


వ.⁠

కృష్ణద్వైపాయనుండును ననవరతవనవాసాయాస[3]కృశదేహుల, నధికదుఃఖా
యమానహృదయులం దనమనుమలం జూచి వగచి ధర్మపుత్త్రున కి ట్లనియె.

⁠ 105


ఉ.⁠

“కాలవిపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు; నె
క్కాలము నేరికిన్ ధ్రువము గాదు సుఖంబును దుఃఖమున్; మహీ
పాల! బుధుండు దద్వివిధభంగు లెఱింగి ప్రమోదఖేదసం

⁠
  1. ↑ మృతా, న్వీత ... సంతతశమావిర్భూత ... నైకశీతలుఁడు పారాశర్యుఁ
  2. ↑ దవ్వులఁ గని య, జ్జనపతి దమ్ములును; య, జ్జనపతి ధౌమ్యులును దాను
  3. ↑ కృశీకృతదేహుల