Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

నడరి నామనంబు నతి దారు[1]ణక్రియ
నేర్చు చున్న యది మహీధరుండ!

⁠


వ.⁠

తొల్లి వేదాధ్యయనంబు సేయుచు బాలకేళీవినోదంబున నున్న కాలంబునఁ
బ్రమాణకోటియందు సుప్తుం డయిన భీమసేను నంటఁ గట్టి గంగమడువునం
ద్రోపించియు, విషంబుఁ బెట్టియు, విషసర్పంబులం [2]గఱపించియు, జననీసహితు
లైన యేవురను వారణావతంబున లక్కయిల్లు సొనిపి యందు దహనంబుఁ
బ్రయోగింపం బంచియు, ననేకంబు లైన యపకారంబులు సేసి, యిప్పుడు
దుర్యోధనుం డధర్మద్యూతంబున రాజ్యంబు నపహరించి, రాజలోకసమక్షంబు
నం దమ్ము నిరాకృతులంజేసినను బరాక్రమపరాఙ్ముఖులైన పాండవులు
నా పరిభవంబు లెట్లు దలఁగెద” రని బాష్పధారాస్నపితపయోధర యయి
పాణిపల్లవంబున నయనసమ్మార్జనంబు సేయుచున్న పాంచాలిం జూచి
వాసుదేవుం డి ట్లనియె.

⁠ 140


చ.⁠

“[3]తనుకుచు నున్న నీ హృదయతాపనిమిత్తమునన్ సురేంద్రనం
దను పటుబాణపాతహతిఁ దద్ధృతరాష్ట్రబలంబు మృత్యుసా
దనమున కేఁగుఁ జు; మ్మిదియ తథ్యము; నా వచనంబు దప్ప ది
వ్వననిధు లేడు నింకిన, దివంబును రాత్రియు సంచలించినన్.

⁠ 141


వ.⁠

అనిన నర్జునుండు ద్రౌపదిం జూచి యి ట్లనియె.

⁠ 142


ఉ.⁠

“ఈ పురుషోత్తముండు మన కిందఱకుం గుశలంబు సేయుచుం
బాపకలంకపంకములఁ [4]బాయఁగఁ జేయుటఁ జేసి దుర్మదో
ద్దీపితశత్రుసంహతి హతిం బరమార్థమ పొందు; నేల సం
తాపము నీకుఁ జేయఁగఁ ద్రిధామజయోన్నతి గల్గి యుండఁగన్?”

⁠ 143


వ.⁠

అనిన సక్రోధుం డయి ధృష్టద్యుమ్నుం డి ట్లనియె.

⁠ 144


క.⁠

“[5]వినయవిహీనుల దుర్యో
ధనదుశ్శాసనులఁ బవనతనయుఁడు, రాధా
తనయుని నరుఁ, డేఁ గుంభజు
ననిఁ జంపుదు మేల వగవ నంబుజనేత్రా.”

⁠ 145


వ.⁠

అని యందఱు ద్రుపదరాజపుత్త్రి నాశ్వాసించి రంత నచ్యుతుండు ధర్మరాజున
కి ట్లనియె.

⁠ 146


తే.⁠

“ద్వారవతినుండియే యుయుధానువలన
ధారుణీశ! యింతయు విని తత్క్షణంబ
యరుగుదెంచి యాపన్నుఁడ వైన నిన్నుఁ
జూచి దుఃఖోపహత[6]మనస్కుండ నైతి.

⁠ 147
  1. ↑ ణాకృతి
  2. ↑ బట్టి గఱపించియు లాక్షాగృహంబున నుండఁ బనిచి యెవ్వ రెఱుంగకుండ ఘోరానలంబుఁ దతి కొలుపం బనిచియు నట్టి దుర్యోధనుం డిప్పు డధర్మద్యూతంబున
  3. ↑ తనరుచు ... లేడుఁ గ్రుంకిన
  4. ↑ బాపుచు నుండుటఁ జేసి; బాచుచు నుండుటఁ జేసి ... శత్రులోకవితతిం బరిమార్తుము పొంద నేల సం, తాపము నీకు జేయఁగఁ ద్రిధామజయోన్నతి గల్గియుండఁగన్; శత్రుసంఘము హతిం బరమార్ధముఁ బొంద నేల ... వృథావిజయోన్నతి; విధాతృనియోగము
  5. ↑ వినుమా హీనుల దుశ్శా, సనదుర్యోధనులఁ ... నంబుజనేత్రీ; నంబుజవదనా
  6. ↑ చేతసుండ నైతి