Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

ప్పవలదు; దాన నొండొకనెపంబు [1]ఘటింతు రెఱింగిరేని నీ
సవతులు; కృష్ణుబుద్ధి విరసం బగు నీదెసఁ దత్ప్రయుక్తిచేన్.

⁠ 318


చ.⁠

పతికి ననుంగు లైనతగుబంధుల మిత్త్రుల భోజనాదిస
త్కృతముల నాదరించుచు నకృత్రిమభక్తి [2]నియుక్తి సంతతో
త్థితమతి వై చరింపుము; తదీయహితేతరవృత్తు లైన వా
రతివ! భవత్సుహృజ్జనము లైనను గైకొనకుండు మెప్పుడున్.

⁠ 319


క.⁠

విను ప్రద్యుమ్నాదిభవ
త్తనయులయెడ నైన నేకతంబున నేకా
సనమున నుండుట దూష్యం
బని యెఱఁగుము; సతులచరిత లతిదుష్కరముల్.

⁠ 320


క.⁠

కులవతులును, సతులును, ని
ర్మలమతులును నయినయట్టిమగువలతోడం
జెలిమి యొనరించునది; దు
ర్విలసితవనితాభియుక్తి విడువుము తరుణీ.

⁠ 321


వ.⁠

ఇది నీకుఁ బరమసౌభాగ్యమూలం బయినయుపాయం” బనినం బ్రీతచిత్త యై
సత్యభామ యి ట్లనియె.

⁠ 322


సీ.⁠

“నీవు ధర్మజ్ఞవు; దేవసన్నిభులు నీ
                 భర్తలు మహనీయకీర్తిధనులు;
ధైర్యతేజోబలశౌర్యసంపన్నులు
                 గావున వీరికి నేవిధమున
ధారుణిరాజ్యంబు సేరెడుఁ దడయక;
                 మీ కెగ్గు సేసిన లోకనింద్య
చరితుండు, కౌరవధరణీశువనితలు
                 దిక్కు లే కలమటఁ బొక్కుచుండఁ

⁠


తే.⁠

గని ముదంబునఁ బొందెదు వనిత! నీవు;
సుతుల నన్యంతనిర్మలమతుల శౌర్య
యుతులఁ గాంచిన సద్గుణాన్వినితవు వగపు
వలదు చిత్తంబులో నీకు జలజనయన.

⁠ 323


వ.⁠

ప్రతివింధ్యాదు లయిననీపుత్త్రు లేవురు నిప్పుడు వచ్చి యదుపురంబున నున్న
వారు; వారికి నొక్కటం గొఱంత లేదు; రుక్మిణియు సుభద్రయుఁ దక్కినవార
లు నక్కుమారులయెడం దమకొడుకులకంటె గారవంబు సేయుదురు; వారి
దెస నిశ్చింతపు గ” మ్మనియె; నయ్యవసరంబునం గృష్ణుండు పాండవుల వీడ్కొని,
మార్కండేయాదివిప్రజనంబు నామంత్రణంబు సేసి, గమనోన్ముఖుం డగుటయు
సత్యభామ యాజ్ఞసేనిం గౌఁగిలించుకొని సగౌరవంబుగా వీడ్కొనియె; నంత
వాసుదేవుండును బ్రియాసహితంబుగా రథారూఢుం డై ద్వారవతీపురంబున
కరిగె; మార్కండేయుండును బాండవేయుల నాశ్వాసించి నిజాశ్రమంబునకుం
జనియె;” నని చెప్పిన వైశంపాయనునకు జనమేజయుం డి ట్లనియె.

⁠ 324


క.⁠

“వనముల ని ట్లనిశంబును
ఘనతరదుఃఖానుభవవికల్పితు లగుచున్
మనుజోత్తము లప్పార్థులు
జననుత! యట మీఁద నెట్లు [3]చరియించిరొకో.”

⁠ 325


వ.⁠

అనిన నమ్మునీశ్వరుం డి ట్లని చెప్పెఁ “గృష్ణుండు సనినయనంతరంబ పాండవులు
గామ్యాకవననివాసంబు పరిత్యజించి యనేకవనశైలనదనదీవిశేషంబు లాలోకించు
చు ద్వైతవనంబునకుం జని; రట్టియెడం గరిపురంబున నుండి యొక్కబ్రాహ్మ

⁠ 326
  1. ↑ గడింతు
  2. ↑ విశేషసం ... కుండు మేర్పడన్
  3. ↑ సలిపిరి చెపుమా