Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

గురుండు భద్రవటంబు సేర నరిగి యచ్చటఁ గుమారుం జూచి యి ట్లనియె.

⁠ 264


తే.⁠

“సప్తమం బైనమారుతస్కంధమునకుఁ
బతివి గమ్ముకుమార! దేవతల కెపుడుఁ
గార్య మొదవినఁ జేకొని [1]కడఁకఁ దీర్పు
మనిశమును మత్పదధ్యానఘనుఁడ వగుము.

⁠ 265

కుమారస్వామి మహిషాసురుం జంపుట

క.⁠

చనుము శుభంబుల నొందుము
తనూజ!” యని కౌఁగిలించి తద్దయుఁ బ్రేమం
బున నతని వీడుకొలుపఁగ
ననఘ! మహోత్పాతములు రయంబునఁ బొడమెన్.

⁠ 266


ఆ.⁠

దెసలు మండె, ధరణి దిర్దిరఁ దిరిగె, న
భ్రంబు మ్రోసె వడఁకెఁ, బర్వతములు;
జగము ఘోరతిమిరసంవృత మయ్యె; ని
ర్జరుల[2]మనము లెల్ల సంభ్రమించె.

⁠ 267


వ.⁠

తదనంతరంబ.

⁠ 268


మ.⁠

ఘనశాస్త్రమహోజ్జ్వలంబు, చతురంగవ్యాప్తభూమండలం
బు, నితాంతోద్ధతఘోరఘోషబధిరీభూతాఖిలాశాముఖం,
బనిరోధోద్గతవేగ, ముగ్రదనుజేంద్రానీక మేతెంచె నీ
సున నీశానముఖామరప్రతతిపై శుంభద్భుజారంభ మై.

⁠ 269


వ.⁠

ఇట్లు మహిషాసురసంరక్షితం బయినదానవసైన్యంబు పఱతెంచి, చుట్టుముట్టి,
యసంఖ్యసాయకంబులు, గదాఖడ్గముసలపరిఘశతఘ్నీప్రముఖానేకప్రహరణం
బులు ప్రయోగించి నిమిషమాత్రంబున ననిమిషసైన్యంబున బ్రచురమాతం
గతురంగరథికపదాతిప్రకరంబులం బరిమార్చినం, గార్చిచ్చు పొదివినం జెదిరిపఱ
చు మృగంబులుంబోలె నమరులు సమరవిముఖు లై తొలంగంబాఱినం జూచి, న
ముచిసూదనుండు సింహనాదంబు సేయుచు నెలుంగెత్తి సురగణంబుల కి ట్లనియె.

⁠ 270


చ.⁠

“వలవదు సంభ్రమంబు; గరువంబుగ నియ్యెడ నెల్లవారు నే
ర్పలవడ వాహనంబులు మహాస్త్రములున్ సమకట్టి క్రమ్మఱుం;
డలవునఁ దున్మివైవుఁడు దురాత్ముల దైత్యుల నేను గల్గగాఁ
దలరఁగ నేల మీకు? ధృతి దాల్పుఁడు నిల్వుఁడు గెల్వుఁ [3]డుక్కునన్.”

⁠ 271


ఆ.⁠

అనినఁ బోక నిల్చి [4]యాహవోత్సాహు లై
సకలవాహనాస్త్రశస్త్రచయము
లలవరించి పేర్చి యార్చి తాఁకిరి వసు
రుద్రసాధ్యముఖమరుత్ప్రవరులు.

⁠ 272


మ.⁠

అమరానీకవ్సృజ్యమానబహుశస్త్రాస్త్రా[5]హతిన్ భిన్న దే
హములై ఘోరమదేభముల్ బహులరక్తాంగంబు లై తూలెఁ దీ
వ్రమహావాతనిపాతజాతరభసవ్యాధూతసంధ్యారుణా
భ్రములో నా నవశంబు లై యొఱలుచుం బ్రత్యర్థిసైన్యంబులన్.

⁠ 273


మ.⁠

పురుహూతాగ్రసరప్రభూతబలసంభూతాస్త్రనిర్ధూత మై
తిరిగెన్ [6]బెంపరి దైత్యవాహినుల నుద్వృత్తాశ్వికశ్రేణి, వి

⁠
  1. ↑ కడిమి నెఱపు
  2. ↑ మనసు లెల్ల సంచలించె
  3. ↑ డుద్ధతిన్
  4. ↑ యాహితోత్సాహు ... మరుద్గణములు; వరూథివరులు
  5. ↑ హతిచ్ఛిన్న ... రక్తాక్తంబు ... వ్యాధూత
  6. ↑ బమ్మరి; జేడ్పడి