Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

విదురుం డి ట్లనియె “నిం దుండి చని పాండవులు మూఁ డహోరాత్రంబులు
నిరంతరప్రయాణంబు సేసి కామ్యకవనంబుఁ జొచ్చువా రొక్కనాటి యర్ధరాత్రం
బున రాక్షసప్రచారవేళయందుఁ బరిభ్రమించుచు రాక్షసమాయ గావించు
చున్నవాని, నతినిశితదంష్ట్రాకరాళం బైన తన వదనగహ్వరంబుఁ దెఱచి గ్రుడ్లు
మెఱవ, బభ్రుకేశంబులు దూల, బాలార్కరశ్మియుతం బయిన బలాహకంబునుం
బోలె సకలప్రాణిభయజననంబుగా గర్జిల్లుచున్న వాని [1]నిజపాదఘట్టితమహీతల
ప్రచలనవేగవేతవల్లీపల్లవబాహుపరిరంభణసుఖంబుఁ బాదపంబుల కాపా
దించుచున్నవాని, నెదుర నొక్కరక్కసుం గని; రంత వాఁడును బ్రాహ్మణసం
ఘంబు ముందటఁ గృష్ణాజినావృతు లై వచ్చు పాండవుల దవ్వులం గని మార్గ
నిరోధియై మహాపర్వతంబును బోలె నున్న నదృష్టపూర్వప్రమాణం బైనవాని
దేహంబుఁ జూచి నిమీలితనయన యయి దుశ్శాసనకరాకృష్టవికీర్ణవేణీభరంబు
వెనువెంట నొలయం బాంచాలి పంచపర్వతంబులనడిమి నదియుంబోలెఁ బతుల
నడుమ భయవ్యాకులచిత్తయైన, నింద్రియంబులు విషయరతిం బరిగ్రహింబు
నట్టు లేవురు నక్కోమలిం బట్టకొని భయపడకుండ నాశ్వాసించుచున్నంత.

⁠


క.⁠

రక్షోఘ్నమంత్రముల నా
రాక్షసమాయా[2]పరిస్ఫురణఁ జెఱిచెఁ గ్రియా
దక్షుఁడు ధౌమ్యుఁడు పాండవు
లీక్షించుచు నుండఁగా నహీనప్రతిభన్.

⁠ 108


వ.⁠

అంత.

⁠ 109


క.⁠

ప్రతివిహితమాయు, నత్యా
యతభుజయుతుఁ, గోపఘూర్ణితారుణ[3]విస్ఫా
రితనేత్రు, నసురఁ జూచి భ
రతకులవర్ధనుఁడు ధర్మరా జి ట్లనియెన్.

⁠ 110


వ.⁠

“నీ వెవ్వరివాఁడ? వెవ్వండ? వివ్వనంబున నేల యున్నవాఁడ?” వనిన వాఁ డి ట్లనియె.

⁠ 111


క.⁠

“ఏను బకాసురు ననుజుఁడఁ;
గీనాశుఁడ; మానవులకుఁ గిమ్మీరుఁ డనం
గా నెగడుదు; నీ కామ్యక
కాననమున సర్వసత్త్వఖాదనబుద్ధిన్.

⁠ 112


క.⁠

పాయక యుండుదు; రాక్షస
మాయల సమరంబు సేసి మనుజుల విగతో
పాయులఁ జంపుచు భక్షణ
సేయుదు; నమరాదులకు నజేయుఁడఁ [4]బోరన్.

⁠ 113


వ.⁠

నాకు వెఱచి యెల్లవారును దూరంబున దీనిం బరిహరింతురు; మీ రెవ్వ?
రిందుల కేల వచ్చితిరి? మిమ్ము వధియించి యిపుడు భక్షించెద” ననిన వానికి
యుధిష్ఠిరుం డి ట్లనియె.

⁠ 114


ఆ.⁠

“ఏను ధర్మసుతుఁడ; నీతఁడు భీముండు;
వాఁడు విజయుఁ; డల్లవారు గవలు;
పాండవులము సమయపడి వనవాసంబు
సేయ వచ్చితిమి విశేష యుక్తి.”

⁠ 115


సీ.⁠

అనవుడు రాక్షసుం డట్టహాసంబుతో
                 “నెట్టెట్టు! భీముండె యీతఁ? డేమి
పుణ్యమో! వీని నెప్పుడు సంపఁగాంతునో
                 యని యున్నచోఁ, దాన యరుగుదెంచె;

⁠
  1. ↑ నిజపాదపాతఘట్టిత; నిజపాదఘట్టనమహీతలప్రచురవేల్లితవల్లీ...వ్యాకులతచిత్త
  2. ↑ బలస్ఫురణ
  3. ↑ విస్ఫూరితనేత్రు
  4. ↑ నెందున్