Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.⁠

చేతనరహితక్షేత్రముఁ
జేతనముం బొరయఁజేయు జీవాత్మదశో
పేతుఁడు పరమాత్ముఁడు, వి
ఖ్యాతుఁడు త్రైలోక్యసంప్రకల్పనుఁ డనఘా!

⁠ 105


క.⁠

భూతములయందు వెలిఁగెడు
భూతాత్ముని నెఱుఁగుదురు ప్రబుద్ధులు నిత్య
జ్యోతిర్మయు, నవ్యయు న
ద్వైతంబగు బుద్ధిసూక్ష్మధర్మమువలనన్.”

⁠ 106


వ.⁠

అని మఱియుఁ గౌశికునకు ధర్మవ్యాధుండు బ్రహ్మవిద్యాప్రభావంబు తెఱంగు
సంప్రయోగరహస్యంబు దెలియ ని ట్లనియె.

⁠ 107


సీ.⁠

“తెలివి నొందినబుద్ధి గల[1]మహాత్ముండు శు
                 భాశుభకర్మములందుఁ జొరఁడు;
క్రమమున సౌఖ్యదుఃఖము లాదిగా నశే
                 షద్వంద్వముల యందు సమత నుండు;
విను మట్టి పుణ్యున కొనరింపవలయు కా
                 ర్యం బెఱింగించెద; ననుదినంబు
నియతాశియును, జితేంద్రియుఁడునై పూర్వరా
                 త్రమ్మున, నపరరాత్రమ్మునందు

⁠


తే.⁠

యోగధారణనిరతుఁ డై యుండవలయు;
నపుడు బోధదీపంబున నాత్ము నాత్మ
యందుఁ గనుచు నివాతదీపానుకారి
యై వెలుంగుచు, నమృతమయత్వ మొందు.

⁠ 108


క.⁠

కామంబును గ్రోధంబును
నేమఱక జయింప వలయు నెల్లవిధములన్
ధీమహిత! యదియ సతత
క్షేమంకర మైన[2]పథము కృతబుద్ధులకున్.

⁠ 109


క.⁠

నిత్యముఁ గర్మియుఁ, గర్మఫ
లత్యాగియు నగుట లెస్స, లౌల్యవియోగం
బత్యుత్తమయోగము, ద
త్ప్రత్యయలక్ష్యుండు సూవె బ్రాహ్మణుఁడు మహిన్.

⁠ 110


చ.⁠

అరయఁగ జీవితంబు గడు [3]నస్థిర; మింత యెఱింగి యాత్మ నె
వ్వరిదెసఁ గీడు రోయక ధ్రువం బగు మైత్త్రి భజించి, సత్కృపా
నిరతుఁడు, నిష్పరిగ్రహుఁడు, నిత్యతపస్వియు, నిత్యతృప్తుఁడుం,
బరమశమాన్వితుండు నగు బ్రాహ్మణుఁ డొందు సనాతనస్థితిన్.

⁠ 111


వ.⁠

నీ వడిగినయఖిలధర్మంబులు సంక్షేపరూపంబున నెఱింగించితి; నింక నెయ్యది
వినవల” తనినం గౌశికుండు “మహాత్మా! వినవలయునవి యెల్లను విశదంబుగా
వింటిం; బ్రబుద్ధుండ నైతి; నీవు సర్వజ్ఞుండ వగుట దెల్లం బయ్యె” ననిన ధర్మ
వ్యాధుం డతని కి ట్లనియె.

⁠ 112

ధర్మవ్యాధుఁడు కౌశికునిఁ దనజననీజనకులయొద్దకుఁ దోడ్కొనిపోవుట

క.⁠

“ఏ నిమ్మెయి నుత్తమవి
జ్ఞానోన్నతి వడయుటకు నిజం [4]బగుమూలం
బైనది గల దొక ధర్మము;
భూనుత! యది నీకు దృష్టముగ నెఱిఁగింతున్.

⁠ 113


వ.⁠

అభ్యంతరగృహంబునకు ర” మ్మని యతనిం దోడ్కొని చని మనోహరంబై చతు
శ్శాలంబై వివిధసౌరభసంవాసితం బైనహర్మ్యంబునందు మహితాసనాసీను
లైనవారిం, దనజననీజనకుల, నభిమతాహారపరితోషితులఁ, బరమాంబరాభరణ
గంధమాల్యాలంకృతమూర్తుల నతనికిం జూపి, తానును దత్పాదప్రణామంబు
సేసి, వారలఁ గుశలం బడిగిన నయ్యిరువురుం బుత్త్రున కి ట్లనిరి.

⁠ 114
  1. ↑ మహామతి శుభాశుభకర్మములయందుఁ జొరఁడు వినుము
  2. ↑ విధము
  3. ↑ నధ్రువ మింత ... బరమశమాస్పదుండు
  4. ↑ బుగ మూలం ... గల దొకకర్మము