Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

అనిన నవ్విప్రుండు “సత్త్వరజస్తమోగుణంబుల తెఱం గెఱింగింపు” మనిన నెఱు కి ట్లనియె.

⁠ 95

ధర్మవ్యాధుఁడు కౌశికునకు సత్త్వరజస్తమోగుణంబుల తెఱం గెఱింగించుట

క.⁠

“అతినిందితము తమోగుణ
మతి[1]బోధమయంబు; సత్త్వమనయంబుఁ బ్రగా
శత నొప్పు; నుభయగుణమి
శ్రతఁ బరగు రజోగుణంబు సన్నుతచరితా!

⁠ 96


మ.⁠

[2]అసుఖాకారత, నిద్ర, దైన్యము, విమోహం, బక్షమత్వంబుఁ దా
మసభావంబులు; రాగలోభజడతామానంబు లూహింప రా
జసవృత్తంబులు, ధైర్యశాంతికరుణాసంతోషవిద్యాదు లిం
పెసఁగన్ సాత్త్వికచేష్టితంబులు నిజం బి ట్లాత్మఁ గన్మింతయున్.

⁠ 97


చ.⁠

అనఘుఁడు సాత్త్వికుం డగు మహాత్ముఁడు బోధనిరూఢి సర్వముం
గనుఁగొని, లోకవృత్తములు గావని రోసి, సమస్తసంగభం
గనిరతుఁడై తొఱంగు మమకారవికార; మహంక్రియాచ్యుతిం
బనుపడి సంయకప్రకటభావన నుత్తమశాంతి గైకొనున్.

⁠ 98


వ.⁠

సత్త్వగుణనిబద్ధుం డగునేని శూద్రుం డైనను జన్మాంతరంబున వైశ్యత్వంబు
నొంది, క్రమంబున రాజభూసురభావంబులు భజించి, భవవిముక్తుం డగు”నని
చెప్పిన నమ్మహీదేవుం డమ్మహానుభావు నభినందించి.

⁠ 99


తే.⁠

“దేహమున ధాతుసంశ్రయదీప్తుఁ డగుచు
వహ్ని యెట్లుండు? శారీరవాయువులకు
నెలవు [3]లెయ్యవి? యవి నాకు నిశ్చయముగఁ
జెప్పు” మనుటయు నిట్లని చెప్పె నతఁడు.

⁠ 100


సీ.⁠

“మూర్ధదేశమునకు వర్ధితంబై పర్వు
                 నాత్మాగ్ని, నాభి దదాశ్రయంబు;
శిరమునఁ బావకాంతరమునఁ జరియించుఁ
                 బ్రాణుండు, భూతాత్మ భావుఁ డతఁడు;
వరుసఁ బ్రాణాపాను లిరువును నయ్యగ్ని
                 వెలిఁగింతు రనపేతవృత్తు లగుచు;
గుద వస్తితలము లాస్పదములుగా వహ్ని
                 పరిగతుం డగుచు నపానుఁ డుండు,

⁠


తే.⁠

గడఁగి విణ్మూత్రనిర్గమకారి యతఁడు;
కర్మబలయత్నకారియై కంఠ[4]తలము
నందు దా నుండు వర్తించు; నఖిలదేహ
సంధులందును వ్యానుండు సంచరించు.

⁠ 101


క.⁠

విను ప్రాణాపానులు న
య్యనలుఁడు బ్రాపుగ సమానుఁ డన్నరసవిపా
చనుఁ డగుచు నాభిదేశం
బున నుండును సకలధాతుపోషకవృత్తిన్.

⁠ 102


క.⁠

ఇది పరమయోగదర్శన
విదితం; బిప్పాటఁ బవనవిదులైన మునుల్
వదలక [5]యభ్యాసవిధిన్
ముదమున ధరియింతు రాత్మ మూర్ధతలమునన్.

⁠ 103


వ.⁠

ప్రాణాపానసమాహితుం డై సకలదేహంబులందును జరియించుచున్న పావకుండు
జీవాత్ముండు గా నెఱుంగు; మతండు జలంబుల నున్నకమలపత్త్రంబునుం బోలె
దేహంబునం దుండియు నిర్లేపస్వరూపదీపితుం డయి వెలుంగుచుండు; నిట్టి
జీవాత్ముండ కదా పరమాత్ముండు.

⁠ 104
  1. ↑ మోహమయంబు
  2. ↑ అసురాకారత ... గ న్మిన్నియున్
  3. ↑ లెయ్యవెయ్యవి
  4. ↑ బిలము
  5. ↑ వ్యాఖ్యానవిధిన్