శ్రీమదాంధ్రమహాభారతము
ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
| |
యువతీప్రియ! నృపనా
రాయణబిరుదాంకభీమ! రమణీయగుణ
శ్రీయుత నిర్మలధర్మప
రాయణ రవితేజ రాజరాజనరేంద్రా.
| 1
|
ధర్మజునకు మార్కండేయుఁడు పుత్త్రున కుండఁ దగుగుణంబులం దెల్పుట
| వ. |
అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు బహుభంగుల మార్కం
డేయుండు వివరింపం బుణ్యకథావిశేషంబులు విని సంతుష్టహృదయుం డై కౌం
తేయపూర్వజుండు మఱియు నమ్మునీంద్రున కి ట్లనియె.
| 2
|
| సీ. |
“సమధికదర్పదుర్జయములై [1]నిగిడెడు
నింద్రియంబులఁ గుదియించి తెచ్చి,
మనసుపొందున నిడి; మన సహంకారంబు
పజ్జకుఁ బాపి, సద్భక్తియుక్తి
నెరయంగ ననిశంబు నిజభర్తృశుశ్రూష
యందు సమాహిత యైన వనిత
యఖిలలోకోత్కృష్ట యని యెప్డు నూహింతుఁ;
నరయఁ బతివ్రత లైన వారి
|
|
| తే. |
చరిత మత్యంతధర్మసూక్ష్మంబుఁ, గరము
[2]దుష్కరము గాదె తలఁప నిర్ధూతదురిత!
యట్లు గావున విన వేడ్క యయ్యెఁ జెప్ప
వయ్య పుణ్యసతీప్రభావంబు నాకు.
| 3
|
| వ. |
మఱియుఁ దల్లిదండ్రు లిరువురయందును బుత్త్రనిమిత్తం బైనయాయాసం బెవ్వ
రి కెక్కుడు? వారలయెడం బుత్త్రుం డెట్టివాఁడు గావలయు? హీనయోనిజాతుం
డైన పురుషుం డేమితెఱంగునడవడిం బరమధార్మికులలోకంబులు వడయు? నివి
యన్నియు వివరింప నీవ యర్హుండ” వనిన నమ్మహాముని యమ్మహీపతి కి ట్లనియె.
| 4
|
| సీ. |
“జతనంబు మిగుల మాసములు దొమ్మిది యుద
రంబునం గరము భరంబుతోడ
భరియించి, పదపడి ప్రాణసంశయదశ
నొంది, పుత్త్రునిఁ గాంచు [3]నొనరఁ దల్లి
తపములు యజ్ఞముల్ దానముల్ వ్రతములు
దేవతాసజ్జనసేవనములుఁ
గావించుఁ బుత్త్రునిఁ గామించి జనకుఁ డి
ట్లిరువురపాటును సరియె తలఁపఁ;
|
|
- ↑ నెగడెడు
- ↑ దుష్కరంబును గాదె నిర్ధూత ... జెప్ప, వలయుఁ బుణ్య.
- ↑ నెందుఁ దల్లి; నొరసి తల్లి