Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.⁠

“ఎవ్వరిదాన వంబుజదళేక్షణ! యేకత మిట్టు లేల [1]నీ
వివ్వనభూమియందుఁ జరియించెదు?” నావుడుఁ “దండ్రిపంపునం
దివ్వనభూమియందుఁ జరియించెద సద్వరుఁ గోరి; కన్య నే;
నెవ్వరిదానఁ గావలయు? నేర్పడఁ జెప్పుము రాజనందనా!”

⁠ 324


వ.⁠

అనిన దానిప్రగల్భవచనంబులకు నధికవిలోలుం డై భూపాలుండు దనయభిలాషం
బెఱింగించిన నమ్మగువ “న న్నెన్నండును జలవిహారంబునకుఁ జొనుపకుండునది;
య ట్లయిన నిన్ను వరియించెద” ననిన వాఁడును దత్సమయంబున కొడంబడి దా
నిం దోడ్కొని పురంబునకుం జనుదెంచి యిష్టసుఖతత్పరుండయి యుండె;
నంత నొక్కశరత్సమయంబునందు.

⁠ 325


చ.⁠

అతులితపుష్పపల్లవఫలాన్వితభూరుహభూరివల్లరీ
వితతముఁ, జారుకైరవనవీనసరోరుహషండమండలా
యతసరసీమనోహరము నైన పురోపవనంబునన్ సము
న్నతవిభవుండు వాసభవనంబు లొనర్పఁగఁ బంచి యిమ్ములన్.

⁠ 326


క.⁠

దేవీసహితంబుగఁ బృ
థ్వీవరుఁ డవ్వనమునందు విహరించె ఘనాం
తావసరవాసరంబుల
భావితపద్మవనపవనపరిచితుఁ డగుచున్.

⁠ 327


వ.⁠

అంత నొక్కనాఁడు నితాంతఘర్మజలకణగలితశరీరుం డై ప్రియాసమేతంబుగా
వాసగృహంబు వెలువడి తత్సమీపంబున నతిమనోహరం బయిన కమలాకరంబు
గని దానితీరంబున నయ్యుగ్మలి నునిచి దాను గృతావగాహుం డై.

⁠ 328


క.⁠

“మేలై యున్నది జలము వి
శాలనయన! చెమట [2]వోవఁ జయ్యన దేహ
క్షాళన మొనరింపు” మనిన
నాలేమ దరస్మితాసనాంబుజ యగుచున్.

⁠ 329


ఆ.⁠

మడుఁగు సొచ్చి మునిఁగి మాయమై పోయిన
నద్భుతాత్ముఁ డగుచు నవనివిభుఁడు
మడుఁగు గలయ వెదకి మానినిఁ గానక
జలములెల్ల వెడలఁ జల్లెఁ గడఁగి.

⁠ 330


వ.⁠

ఇట్లు సల్లి యందు మండూకంబు లనేకంబు లున్నంజూచి “యివి మత్ర్పియాంగ
నను మ్రింగినవి గాకేమి”యని కలుషించి యనుచరులం బిలిచి “నాకుఁ బ్రియం
బు సేయవలసినవారు గలిగినం బుడమిం గలకప్పల [3]నెల్లం బొడ వడంచి
రం” యని పంచిన నలుదిక్కులకుం జని తదీయకింకరవర్గంబు.

⁠ 331


చ.⁠

కొలఁకుల, వాగులన్, నదులఁ, గ్రోవుల, బావుల, నిర్ఘరంబులం
గలయఁగ రోసి రోసి వడిఁ గప్పలఁ గుప్పలుగా వధించుచో
నలుగుల మందు భేకనివహంబు గనుంగొని భేకనాయకుం
డలఘుతపస్విరూపమున నా నృపుపాలికి వచ్చి యి ట్లనున్.

⁠ 332
  1. ↑ నేఁ, డివ్వనభూమి ... సద్వరుఁ గోరుకన్య
  2. ↑ యెడలఁ జయ్యన
  3. ↑ నెల్లం జంపునది యనిన వారును నట్ల సేయం గడంగిన భేకనాయకుం డప్పుడ తపస్విరూపంబున నానృపుపాలికి వచ్చి యి ట్లనియె. అని యొకప్రసిద్ధవ్రాఁతప్రతియం దున్నది.