Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

క్రము లై గ్రహంబు; లారో
గ్యము సౌఖ్యము సమధికముగఁ గలుగు నరులకున్.

⁠ 314


వ.⁠

ఇది కృతయుగప్రవర్తనంబు; త్రేతాద్వాపరయుగద్వితయంబునందును ధర్మంబ
వర్తిల్లు; నిట్టితెఱంగునం గాలగతు లనేకంబులు నాకుం బ్రత్యక్షసిద్ధంబు లయ్యె;
నీ వడిగిన యతీతానాగతంబు లయినవిశేషంబు లెఱింగించితి; నింక నొక్క
హితోపదేశంబు సేసెద నాకర్ణింపుము.

⁠ 315


క.⁠

ధరణీసురులకు నెప్పుడుఁ
గరమిష్టము సేయుమయ్య కౌరవవంశో
త్తర! విప్రులు సంతుష్టిం
బొరసినఁ జేకుఱు నశేషపుణ్యఫలంబుల్.

⁠ 316


సీ.⁠

సకలభూతములందు సదయాత్ముఁడవు గమ్ము;
                 పాలింపు ప్రజల నీ ప్రజలఁ బోలె;
వితతవృద్ధాచారవేది వై ధర్మంబు
                 సలుపుము; దురితవర్జనము సేయు;
మెఱుఁ[1]గమిఁ బాప మొక్కించుక దొడరినఁ
                 జయ్యన ప్రతీకారశాలి వగుము;
గర్వంబు విడువుము; గరము ప్రియంబును
                 నిజమునుగా వచోనియతి నడపు;

⁠


తే.⁠

కాలగతులెల్ల నెఱిఁగి యస్ఖలితబోధ
యుక్తుఁడవు గమ్ము; భరతవంశోద్భవుఁడవు
నీవు గావున నత్యంతనిర్మలుఁడవు
ప్రాజ్ఞుఁడవు నీకు వేఱ చెప్పంగ నేల?”

⁠ 317


వ.⁠

అనిన విని “మునీంద్రా! నీయానతిచ్చినవాక్యంబు లన్నియు నవహితుండ నై వింటి;
నింతకుమున్ను నాయోపినతెఱంగున లోభమాత్సర్యాదిదుర్గుణంబులు పరి
హరింతు; నింకను భవదుక్తం బైనధర్మశాసనంబును బ్రయత్నంబునం బాలిం
చెద” నని యతనికి యుధిష్టిరుండు ప్రణమిల్లి మఱియును బ్రాహ్మణప్రభావంబు
వినువాఁ డై యతనిం బ్రార్థించినఁ దద్విషయం బైనయితిహాసం బతనికి నమ్మహా
ముని యి ట్లని చెప్పె.

⁠ 318

మార్కండేయుండు ధర్మరాజునకు బ్రాహ్మణప్రభావంబు సెప్పుట

చ.⁠

“ఘనుఁడు పరిక్షితుం డనఁ బ్రకాశితుఁ డైనమహీవిభుండు భా
నునిభుఁడు భానువంశ్యుఁడు వినూతనకీర్తి యయోధ్య యేలువాఁ
డనుపముఁ డొక్కనాఁడు మృగ[2]యారతుఁ డై చరియించెఁ గానన
మ్మున నొకరుండ యిమ్ముల నపూర్వజవోగ్రహయాధిరూఢుఁ డై.

⁠ 319


వ.⁠

ఇవ్విధంబునం బెక్కుమృగంబుల వధియించుచుఁ గ్రుమ్మరువాఁ డొక్కయెడ.

⁠ 320


ఆ.⁠

[3]మదభరాభిరామమృదులయానం బొప్ప
నల్లఁ బొలయుచును లతాంతరములఁ
గరము లీలఁ గమ్మవిరులు గోయుచునున్న
పువ్వుఁబోఁడి నొక్కపొలఁతిఁ గనియె.

⁠ 321


క.⁠

కని యంతఁ గదిసి యాకా
మినియొప్పులఁ జూడ్కి దగుల మీఱినతమకం
బున ననిమిషలోచనుఁ డై
జననాథుఁడు మదనబాణసంహతిఁ దూలెన్.

⁠ 322


వ.⁠

అదియును నతిసుందరం బైనతదీయమూర్తివిభవంబునకు మెచ్చి సాభిప్రాయం
బుగా నవలోకించె; నంత నమ్మహీకాంతుఁ డక్కాంత కి ట్లనియె.

⁠ 323
  1. ↑ గని పాప
  2. ↑ యాతురుఁ డై చరియించచుండెఁ గా, ననమున నొక్కరుం డయి (బ్రభూతబలోగ్రహయాధి) తనర్చినవాఁడు హయాధి
  3. ↑ మదగజాభిరామ