నారాయణుఁడు మార్కండేయునకుఁ దనప్రభావంబు సెప్పుట
| క. |
అని యేను వేఁడికొనుటయు
ఘనతరకరుణారసానుకలితహృదయుఁ డై
తనదివ్యమహిమ యి ట్లని
వనజాక్షుఁడు నెప్పె గారవంబున నాకున్.
| 264
|
| ఆ. |
“అనఘ! దేవతలును మునులును నాదైన
మహిమఁ దెలియలేరు మహితబుద్ధి;
నతులవుణ్యమతివి పితృభక్తుఁడవుగాన
యెలమి [1]దెలియఁ జెప్పెవలసె నీకు.
| 265
|
| క. |
నారము [2]లండ్రు జలము లిం
పారఁగ నారములు నాకు నయనం బగుటన్
నారాయణుఁ డనుపేర న
పారనిగమఫణితులందుఁ బరఁగుదుఁ బేర్మిన్.
| 266
|
| తే. |
అట్టినారాయణాఖ్యుండ నైన నేను
శాశ్వతుండ నై ప్రభుఁడ నై సకలజగము
నోలిఁ బుట్టింతుఁ, బాలింతు, నుచితవేళ
సంహరింతుఁ జిదానందశాలి నగుచు.
| 267
|
| మత్తకోకిలము. |
అంబుజాసనుఁ, డింద్రుఁ, డీశ్వరుఁ, డంతకుండు, ధనేశ్వరుం
డంబుధీశుఁడు లోనుగా సుర లస్మదాకృతు; లుర్వి పా
దంబు, లగ్నిముఖంబు, సూర్యసుధాకరుల్ నయనంబు, లీ
యంబరంబు [3]శిరంబుగా నిటు లద్భుతాకృతి నుండుదున్.
| 268
|
| చ. |
అతులితదక్షిణాన్వితమహాధ్వరసంఘము లే నొనర్చితిం;
జతురమనీషితాప్రచురసౌఖ్యులు భూసురముఖ్యు, లంచిత
వ్రతులు మహీపతుల్, సుగుణవశ్యులు వైశ్యులు భక్తి నన్ను సం
తతమును గొల్తు రీక్షితి నుదాత్తమహా[4]క్రతుకర్మశీలురై.
| 269
|
| చ. |
విలయపయోధిమగ్న మగువిశ్వమహీవలయంబుఁ దొల్లి యే
నలఘువరాహవిగ్రహుఁడ నై వెస నెత్తితి శేషమూర్తి నై
లలితఫణాసహస్రకము లావునఁ దాల్తు నశేషధాత్రియున్
జలనిధినిమ్నగానగలసన్నగరీవనమండలంబుతోన్.
| 270
|
| క. |
బాడబదహనుఁడ నై [5]వెస
నేడుసముద్రముల జలము లేఁ గ్రోలుదు; నీ
రేడుజగంబులు విలయముఁ
గూడునెడం దజ్జలములు గొనకొని విడుతున్.
| 271
|
| చ. |
వదనభుజోరుపాదముల వర్ణచతుష్టయమున్ యుగాదియం
దొదవ సృజింతు; ఋగ్యజుషసూక్తులు సామము నయ్యధర్వమున్
విదితముగా మదీయముఖవీథుల నుద్భవ మొందు; నన్నియుం
దుదిఁ బరివర్తనక్రమవిధూతము లై ననుఁ జేరుఁ గ్రమ్మఱన్.
| 272
|
| క. |
అనహంకృతు, లక్రోధను
లనసూయులు, సంగరహితు, లధ్యాత్మవిదుల్,
ఘనసత్త్వాత్మకులు, మహా
మునులు ననుం గొల్తు రెపుడు మోక్షాపేక్షన్.
| 273
|
| తే. |
అఖిలనక్షత్రతారాగ్రహములు, గగన
పవనదిశలును, మత్స్యరూపములు వినవె;
సకలరత్నాకరంబులు శయ్య గాఁగ
నిత్యసుఖలీలమై శయనింతు నేను.
| 274
|
- ↑ నీకుఁ జెప్పవలసె దెలియ
- ↑ లందురు జలముల, నారయ
- ↑ శరీర మే నిటు
- ↑ వ్రతకర్మ; క్రతుధర్మ
- ↑ వడి ... విలయముఁ, గూడెడునెడఁ దజ్జలంబు