Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణుఁడు సత్యభామతోడఁ బాండవులయొద్దకు వచ్చుట

సీ.⁠

[1]సైన్యసుగ్రీవాదిజవనాశ్వయుక్తమై
                 యాబద్ధనూత్నరత్నాంశుపటల
భాసితంబై, చారుపతగపతాకావి
                 భూషితగగన మై పొలుపు మిగులు
దివ్యరథంబున దేవకీసుతుఁడు ప్రి
                 యంబున సత్యభామాన్వితముగఁ
దరళసౌదామినీదామసముజ్జ్వల
                 ధారాధరోత్సంగతలమునందు

⁠


ఆ.⁠

శశియుఁ దాను వెలుఁగు శతమన్యుఁడునుబోలె
నరుగుదెంచె ఘనరథాంగనేమి
విపులఘోషతాండవితబర్హిశబ్దశ
బ్దాయమానవనవిభాగుఁ డగుచు.

⁠ 152


వ.⁠

ఇట్లు వచ్చి వాసుదేవుండు రథావతరణంబు సేసి ధర్మనందనున కభివందనం బాచ
రించి, భీమార్జుననకులసహదేవులం గౌఁగిలించుకొని, ద్రౌపది గారవించి, ధౌమ్యాది
మహీవరులచేత నభినందితుం డయ్యె; నంతఁ గౌంతేయాగ్రజుండు [2]గదాగ్రజున
కు నర్ఘ్యాదిసత్కారంబులు నిర్వర్తించి, తమ్ములుం దానును విప్రజనంబులు నత
నిం బరివేష్టించి యుండె; నప్పుడు కృష్ణుండు ధనంజయుం దనచేరువ నునిచికొని
చిరకాలదర్శనోల్లాసితంబు లైనయాలోకనంబుల నతనియాకారం బత్యాద
రంబున నభినందించుచు ధర్మరాజున కి ట్లనియె.

⁠ 153


సీ.⁠

“భాగ్యంబుగాదె యీ పార్థుండు హరుఁ డాది
                 యైన నిర్జరసమూహంబు వలన
నెలమిఁ గృతాస్త్రు డై యేతెంచు టరయంగ;
                 ధన్యుండ వై తీవు ధర్మతనయ!
నీ ధర్మనిష్ఠయు నీ తపంబును జూవె
                 యింతకుఁ గారణం బిద్ధచరిత!
రాజ్యంబుకంటెను రాజేంద్ర! ధర్మంబె
                 యిష్టమై యుండు నీ కెల్లనాఁడు;

⁠


తే.⁠

వేదవేదాంగవిదుఁడవు, వివిధయజ్ఞ
కర్త వైతి, ధనుర్వేదకర్మఠుఁడవు;
ధరణి యెల్ల నేలెడి రాజధర్మ మమర
సులభ మయ్యె నీ కిహపరశోభనములు.

⁠ 154


చ.⁠

దమమును, సత్యయుక్తియును, ధైర్యనిరూఢియు, నిత్యతృప్తియున్,
శమమును నీకు నైజములు; సన్మతి నర్థవశంబుఁ, గామలో
భములును బొంద; వ ట్లగుటఁ బార్థివకుంజర! ధర్మరాజ నా
మమునఁ ద్రిలోకపూజ్యమహిమం బొగ డొందెద [3]వెల్లకాలమున్.

⁠ 155


వ.⁠

అని వెండియు.

⁠ 156


శా.⁠

ద్యూతవ్యాజమునన్ సభాంగణములో దుర్యోధనుం డట్లు దు
ర్నీతిం [4]గూరి యొనర్చినట్టి యఘముల్ నిష్కంపధైర్యోన్నతిన్
జేతఃస్ఫారుఁడ వైన నీ కొకనికిం జెల్లెన్ సహింపంగ; వి
ఖ్యాతక్షాంతులు లేరె ధార్మికులు! నిక్కం బిట్టి రే యెవ్వరున్?

⁠ 157


ఉ.⁠

ఉల్లము [5]సత్త్వసంశ్రయము నొందినవాఁడవు! నీవు విక్రమం

⁠
  1. ↑ శైబ్య ... పొలుపు మీఱు ... శతమఖుండును బోలె
  2. ↑ గరుడధ్వజునకు ... దర్శనోల్లసితంబు
  3. ↑ వివ్విధంబునన్
  4. ↑ గ్రూరుఁ డొనర్చినట్టి ... ధైర్యోన్నను, చ్చేతస్సారుఁడ
  5. ↑ సత్యసంయమము నూనినవాఁడవు