Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

తన[1]చేష్ట దఱిఁగి ప్రాకృత
జనుక్రియ ని ట్లున్నవాఁడు సామాన్యముగన్.

⁠ 117


వ.⁠

ఇది యేమి యాశ్చర్యంబొక్కొ” యనుచు ననిలజుం జూచి దుఃఖితుం డై ధర్మ
జుం డయ్యజగరంబున కి ట్లనియె “నయ్యా! నీవు సర్పరూపంబుఁ దాల్చినదై
త్యుండవో! దేవతవో! యేను యుధిష్ఠిరుండ; ని న్నడిగెద; నిమ్మహాభుజు నాయనుజు
నామిషార్థివై [2]పట్టితేని నీకు బుభుక్షానివృత్తి యగునట్లుగాఁ జాలినంతమృగ
మాంసంబుఁ బెట్టెద; వీని విడువు” మనిన ధర్మజునకు నయ్యజగరం బి ట్లనియె.

⁠ 118


సీ.⁠

“వినవయ్య! నహుషుఁడన్ జనపతి నేను;
                 మీ పూర్వజులకు నట పూర్వజుండ;
[3]ననఘ! సుత్రామున కెనయగువాఁడ; నై
                 శ్వర్యగర్వంబున నార్యవృత్తి
విడిచి, వివేకంబు సెడి, సహస్రోత్తమ
                 బ్రాహ్మణకృతమైన బ్రహ్మరథము
నెక్కి బ్రాహ్మణులకు నక్కజం బగు నవ
                 మానంబు సేసినదాన నాకుఁ

⁠


ఆ.⁠

గలశభవుఁ డగస్త్యుఁ డలిగి యత్యుగ్రాహి
వగు మటంచు శాప మప్పు డిచ్చె
మునివరేణ్యుశాపమునఁ జేసి యిప్పాట
నవయుచున్నవాఁడ నాఁటఁగోలె.

⁠ 119


వ.⁠

విధి విలసితంబు పేర్మి నీ కే మని చెప్పుదు?

⁠ 120


చ.⁠

చదివితి నెల్లవేదములు, [4]సద్విధిఁ జేసితి నూఱుయజ్ఞముల్
విదితముగా సురేంద్రపదవీస్థితిఁ బొందితి, దుర్మదంబునం
దుదిఁ బెనుఁబామ నై యధికదుఃఖిఁతు డైతి; సుఖంబు దుఃఖమున్
వదలక చేయుచోట బలవద్విధి కేమి భరంబు సెప్పుమా?

⁠ 121


వ.⁠

అయ్యగస్త్యుచేత నిట్లు శాపగ్రస్తుండనై శక్రాసనంబువలనం బాసి యిట వచ్చు
చునుండి “మునీంద్రా! నాకుఁ బూర్వస్మృతి సెడకుండను బలవంతంబు లైనసత్త్వం
బులు నన్ను ముట్టుచో [5]బలహీనంబులు గాను, శాపవిమోక్షంబున కుపాయంబును
బ్రసాదింపు” మని కృతాంజలి నై యున్ననాకుం గరుణించి మునివరుండు నావేఁ
డిన వరంబు లిచ్చి వెండియు ని ట్లనియె.

⁠ 122


క.⁠

“క్రమమున [6]నీయడిగినప్ర
శ్నములకుఁ బ్రత్యుత్తరములు సన్మతి నత్యు
త్తముఁ డెవ్వఁ డిచ్చు, నతనిక
తమునను శాపాంత మగు బుధస్తుత! నీకున్.

⁠ 123


వ.⁠

అది దీర్ఘకాలంబునకుం గాని కా” దనియె; నేనును దద్వచనం బిచ్చ నమ్మి పెద్ద
కాలం బియ్యడవి నున్నవాఁడ; నేఁడు నీతమ్ముఁడు దుష్టకాలప్రాప్తుం డై నాకు
భక్ష్యం బయ్యె; నోపుదేని నాప్రశ్నములకుఁ బ్రత్యుత్తరంబు లిచ్చి వీని విడిపించు
కొ” మ్మనిన ధర్మజుం డి ట్లనియె.

⁠ 124


క.⁠

“నీయడిగినయర్ధాభి
ప్రాయములకు నుత్తరంబు పరువడిఁ జెప్పెన్
ధీయుత! బ్రాహ్మణులకుఁ గా
కాయతమతు లయ్యు నొరుల [7]కలవియె చెప్పన్?

⁠ 125
  1. ↑ లావు
  2. ↑ పట్టుకొంటివేని
  3. ↑ జననుత 9భూనుత) సోమున కెనయగు ... సేసిది గానఁ గనలి, కలశభవుఁ డగస్త్యుఁ డలఘుఁ డత్యుగ్రాహి ... శాప మప్పు డిచ్చె
  4. ↑ సత్క్రియ (సన్మతి) ...కేమి భయంబు
  5. ↑ బలహీనంబులై భక్ష్యంబులుంగాను
  6. ↑ నీవేసినప్ర, శ్నములకు
  7. ↑ కవి విషయములే