Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భీముఁడు యక్షరాక్షసులతో యుద్ధంబు సేయుట

వ.⁠

నాకు మిమ్మును మీకుబేరుం బ్రార్థించి కాని యిక్కొలనిపువ్వులు గొనంగా
దొకో” యని భీముండు రాక్షసుల నాదరింపక సౌగంధికావనంబు సొచ్చి కనక
కమలంబులుం గొని యుత్తమవీర్యవంతంబు లైనతత్సలిలంబు లుపయోగించి
యనంతబలసంపన్నుం డై యున్న నాతనిం జూచి రాక్షసు లలిగి యుద్యతా
యుధహస్తు లై తాఁకిన భీముండును భీకరాకారంబున.

⁠ 366


చ.⁠

తనగదఁ జేసి రాక్షసుల దారుణశస్త్రచయంబు నశ్రమం
బున నతివీరుఁ డై విరిచి, పోర నిశాచరులన్ బడల్పడన్
ఘనభుజదండచండహతిఁ గ్రాఁచిన [1]నుక్కఱి రక్కసుల్ కుబే
రున కెఱిఁగింపఁ బాఱిరి సరోషవృకోదరభీమకర్మముల్.

⁠ 367


వ.⁠

కుబేరుండును బాంచాలీప్రియకరం బైనపవనతనయుపరాక్రమారంభంబు విని
మెచ్చి దాని నుపేక్షించె, నట్లు భీమసేనుండు రాక్షససేన నోడించి సౌగంధికకమ
లంబులు గొని తత్తీరకుసుమితలతాపాదపవనంబున విహరించుచున్నంత నట.

⁠ 368


క.⁠

వడిఁ బడియెఁ బిడుగు లుడుగక;
వడఁకె మహీతలము; పాంసువర్షము గురిసెం
గడు నెఱ్ఱ నయ్యె దిశ లే
ర్పడకుండె నినుండు తిమిరపటలావృతుఁ డై.

⁠ 369


వ.⁠

ఇట్టి మహోత్పాతంబు లుపలక్షించి విస్మితుం డై ధర్మతనయుం “డివి భీమాహవ
పిశునంబు లై కానంబడియె, నేమఱకుండవలయు” నని నాలుగుదిక్కులుం
జూచి భీమసేనుం గానక తనసమీపంబున నున్నపాంచాలి కి ట్లనియె.

⁠ 370


క.⁠

“ప్రియసాహసుండు భీముఁడు
భయవిరహితుఁ డెందుఁ బోయె? బహురాక్షససం
శ్రయ మిగ్గిరి గంధర్వా
న్వయసేవ్యం; బేకచరుఁడు వాఁ డెయ్యెడలన్.

⁠ 371


ఆ.⁠

భూరిభుజుఁడు దానె పోయెనో, నీ వెట
యేని పుచ్చితో [2]నిజేచ్ఛ నతని”
నని యజాతశత్రుఁ డడిగినఁ బతికిఁ బాం
చాలి యిట్టు లనియె సంభ్రమమున.

⁠ 372


మధ్యాక్కర.⁠

“ధరణీశ! నీకు నాయిచ్చినపసిఁడితామరపువ్వు
గురువాయువశమున వచ్చినను దానిఁ గొని యిట్టిపువ్వు
లరుదు గాన కుఱంగటం గలిగెనేని యర్థిఁ దెమ్మనిన
నరిగె నీశానుదిక్కునకు నీతమ్ముఁ డతివేగమునను.”

⁠ 373


వ.⁠

అనిన “నట్లేని యందఱము వానిపోయినవలనం బోవుద” మని యెప్పటియట్ల
రాక్షసస్కంధారూఢుఁ డై గగనగతి నరిగి సౌగంధికతీరంబున.

⁠ 374


చ.⁠

అతులబలాఢ్యు, [3]నుద్యతగదాయుధహస్తుఁ, బటుప్రతాపవ
ర్ధితయశుఁ, బాండునందనుఁ దదీయమహోగ్రగదావిఘాతదా
రితపృథుయక్షరాక్షసశరీరచయంబులుఁ జూచి విస్మయ
స్మితముఖు లైరి బ్రాహ్మణసమేతులు ధర్మసుతాదు లచ్చటన్.

⁠ 375
  1. ↑ నొక్కట రాక్షసుల్
  2. ↑ నిజేశుఁ బూని
  3. ↑ నుద్యతగధాయతబాహుఁ ... గదానిఘాత