Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

ద్రిపాదం బై ధర్మువు వర్తిల్లు; నందు జనులు నిత్యసత్య[1]వ్రతశీలురై యజ్ఞతపో
దానాదిక్రియల వర్తింతు; రందు రక్తవర్ణుం డయి విష్ణుభట్టారకుండు ప్రజా[2]రక్ష
ణంబుఁ జేయు.

⁠ 337


తే.⁠

ద్వాపరంబున రెండుపాదములఁ జేసి
నడచు ధర్మువు; వేదముల్ నాల్గుదెఱఁగు
లై ప్రవర్తిల్లు; వేదశాస్త్రార్థచోది
తంబు లై [3]ధర్మకామముల్ ధరణిఁ బరగు.

⁠ 338


తే.⁠

సత్యశమహీను లగుదురు జనులు; గామ
కాములై చేయుదురు బహుక్రతువు లోలి;
నందుఁ ద్రైలోక్యవందితుం డచ్యుతుండు
కృష్టవర్ణుఁ డై జగము రక్షించు మఱియు.

⁠ 339


క.⁠

కలియుగమునందు ధర్మము
బల మఱి వర్తిల్లు నేకపాదంబున నం
దలఘుఁడు కృష్ణుఁడు జగతీ
వలయము రక్షించుఁ బీతవర్ణుం డగుచున్.

⁠ 340


వ.⁠

అందుల జనులు తమోగుణయుక్తులై, కామక్రోధాధిదోషవశంబునం దర్ము వెఱుం
గక యధర్మవర్తు లగుదు రందుఁ జేసినతపోదానాదికర్మంబులు స్వల్పంబుల
య్యును బహఫలంబు లగు” నని యుగవర్తనప్రకారంబులఁ జెప్పి “నీకిష్టావాప్తి
యయ్యెడు నరుగు” మనిన భీముం డి ట్లనియె.

⁠ 341

హనుమంతుఁడు భీమునకుఁ దనపూర్వరూపంబుఁ జూపుట

క.⁠

“నీనాఁటితనువుఁ జూచియ
కాని యవశ్యంబు పోవఁ; గావునఁ గపినా
థా! నాకుఁ జూపు” మనవుడు
వానికిఁ దనరూపుఁ జూపె వానరుఁ డంతన్.

⁠ 342


చ.⁠

అతులితమై, ద్వితీయకనకాద్రి యొకో యిది నా, నిజాంగ [4]మూ
ర్జితముగఁ బెంచి, పుచ్ఛమునఁ జేసి దిగంతము లందుచున్న యు
న్నతుఁ, గపినాథుఁ జూచి కురునందనుఁ డప్డు నిమీలితాక్షుఁ డై
మతి నతివిస్మితుం డగుచు మారుతి కి ట్లనియెన్ భయంబునన్.

⁠ 343


క.⁠

“అతిభీషణ మిది యత్య
ద్భుత; మోహో! చాలు భూనభోమధ్యవ్యా
పిత మయ్యె; భవద్ధేహా
యతత్వ ముపసంహరింపు” మనవుడుఁ గపియున్.

⁠ 344


క.⁠

తనయెప్పటిరూపముఁ జే
కొని, “దీనికి నినుమడుం గగుం బ్రతిబలముం
గనినప్పుడు నారూపం
బనుపముగ” ననిన హనుమ కనిలజుఁ డనియెన్.

⁠ 345


ఉ.⁠

“ఉన్నతిఁ బూని నీవు బలియుం డగురావణు నశ్రమంబునం
బన్నుగఁ జంపనోపు పటుబాహుబలాఢ్యుఁడ [5]విట్టియూర్జితున్
నిన్ను సహాయుఁగాఁ బడసి నిర్మలనీతిపరుండు రాఘవుం
డన్నరభాజనాన్వయుల నాజి వధించుట యేమి చోద్యమే?”

⁠ 346


వ.⁠

అనిన వాని కతిప్రీతిమంతుం డై హనుమంతుం డి ట్లనియె “నయ్యా! నీవు సౌగంధిక
సరోవరంబునకుం బోయెద వే నందు సాహసంబు సేయ వలవ; దది యక్షరా
క్షసరక్షితంబై, దేవతోపభోగయోగ్యంబై యుండు; దేవతలు బలిహోమనమ

⁠
  1. ↑ ప్రవర్తులై
  2. ↑ భరణంబుఁ
  3. ↑ సర్వకర్మముల్; సర్వకామముల్
  4. ↑ ము, చ్ఛ్రితముగఁ ... వియత్తల మందుచున్న
  5. ↑ విట్టియుద్ధతున్ (యున్నతున్) ... నిర్మలకీర్తియుతుండు ... భోజనాన్వయము