Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లయగ్రాహి.⁠

వారిరుహమిత్త్రు, నమరోరగమునిద్యుచర
                 చారణగణప్రణుతచారుగుణు, [1]లోకా
ధారు, నఖిలశ్రుతిశరీరు, హరిశంకరస
                 రోరుహభవప్రతిము, దారుణతమిస్రా
వారణమరీచిపరిపూరితదిగంతరుని,
                 భూరికరుణానిరతు, సూరుఁ, ద్రిజగద్ర
క్షారతు, సహస్రకరుఁ గోరి భజియింపుము మ
                 నోరథఫలంబు లగు భూరమణ నీకున్.”

⁠ 40


వ.⁠

అని ధౌమ్యుండు విశుద్ధాత్ముం డైనధర్మరాజునకు సూర్యుం డర్యముండు భగుం
డను నివి మొదలుగాఁగల నామంబుల యష్టోత్తరశతంబు నభీష్టసిద్ధిప్రదం బయిన
దాని విస్పష్టార్థవర్ణోచ్చారణంబును విధియుక్తంబునుగా నుపదేశించి “దీనిం దొల్లి
యింద్రువలన నారదుండు వడసె; [2]నారదువలన వసువను రాజు వడసె; నాతనివలన
నేను బడసితి; నేను నీ కిచ్చితి; నిది దేవనిర్మితంబు; దీన నాదిత్యు నతిభక్తి నారా
ధింపు” మనిన.

⁠ 41

ధర్మరాజు సూర్యు నారాధించి వరంబు గొనుట

సీ.⁠

హితుఁ డైన తనపురో[3]హితు నుపదేశంబు
                 పేర్మితోఁ జేసికొని, ధర్మసుతుఁడు
నెమ్మిఁ బుష్పోపహారమ్ముల నాదిత్యుఁ
                 బూజించి, భాగీరథీజలంబు
లందుండి విషయంబులం దింద్రియంబుల
                 నమలవ్రతానుభావమున నొడిచి,
వాయుభోజనుఁడు బ్రాణాయామపరుఁడునై
                 సూర్యాదినామముల్ సూర్యుఁ గొలిచి

⁠


ఆ⁠

జపము సేయుచున్నఁ దపనుఁ డాతనికిఁ బ్ర
త్యక్ష మయి త్రిలోకచక్షుఁ డమర
వరుఁడు దురితహరుఁడు తరణి త్రయీమూర్తి
వనజమిత్రుఁ డిట్టు లనియెఁ గరుణ.

⁠ 42


వ.⁠

“నీ తపమునకు మెచ్చితి; నీ పండ్రెండేండ్లును వన్యఫలమూలశాకంబులు నీమహా
నసంబున ద్రుపదరాజపుత్త్రిచేత సాధితంబులై యక్షయంబు లైన చతుర్విధాహా
రంబు లగు” నని యొక్క తామ్రస్థాలి యిచ్చి వరం బిచ్చి వనజహితుం డంతర్హితుం డైన.

⁠ 43


చ.⁠

అడరఁగ ధర్మనందనుఁ డహర్పతిచేత వరంబు [4]పేర్మితోఁ
బడసి మహీసురోత్తముల భవ్యులఁ బల్వుర నిర్వహించె న
ప్పుడు ద్రుపదాధిరాజసుత పొల్పుగ వండినశాకమూలముల్
గడురుచి నిష్టభోజనసుఖంబులఁ దృప్తులఁ జేయుచుండఁగన్.

⁠ 44


వ.⁠

ఇ ట్లనేకసహస్రమహీసురవరుల ననుదినంబును నభిమతభోజనంబులం దనిపి
విఘసామృతభోజనంబులం దృప్తులైన [5]తనపతుల భుక్తశేషంబు ద్రుపదపుత్త్రిక
యుపయోగించుచుండం గొన్నిదినంబు లంద యుండి పాండవులు బ్రాహ్మణుల
చేతం గృతస్వస్త్యయనులై బ్రహ్మర్షి సంఘంబులతోఁ గామ్యకవనంబున కరిగి;
రంత నిట ధృతరాష్ట్రుండు విదురుం బిలిపించి “నీవు భార్గవు కంటె బుద్ధిమంతుఁడవు;

⁠
  1. ↑ భూతా, ధారు .. తమిస్రాదారణ; తమిస్రావారణు; తమిస్రాదారణు ... నఘారి నఘకారుణికు ... భూరిభుజ నీకున్
  2. ↑ నారదువలన నేను వడసితి
  3. ↑ హితువచనంబులు ... అర్థిఁ బుష్పోపహారమ్ముల ... ననవరతావధానమున నుడిచి; ననవరతానుభావమున నొడిచి ... సూర్యాదినామముల్ సూర్యుగుఱిచి
  4. ↑ నెమ్మితోఁ ... జెల్వుగ నిర్వహించె
  5. ↑ తనపతుల భుక్త