Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.⁠

నిద్ర నున్న ధర్మనిర్మలు, హనుమంతుఁ
జూచి పాండురాజసుతుఁడు వాని
నిద్రఁ జెఱుపఁ గడఁగి [1]నిజరూప మేర్పడ
సింహనాద మొప్పఁ జేసె డాసి.

⁠ 319


వ.⁠

హనుమంతుఁడును [2]మెల్లమెల్లన మేల్కని జృంభసంభృతజలార్ద్రసంచలవిలో
చనుం డగుచు ననాదరంబున నాతనిం జూచి యి ట్లనియె.

⁠ 320


తే.⁠

“అతిజరారోగభరమున నలసి [3]యొలసి
యొదిఁగి సుఖనిద్రమై నిట్టు లున్నవానిఁ
గడుమదంబున నేమియుఁ గరుణ లేక
యేల బోధించితయ్య! నీ వెఱిఁగి యెఱిఁగి?

⁠ 321


వ.⁠

తిర్యగ్జాతులు ధర్ము వెఱుంగవు గాక; సర్వభూతదయాస్వరూపం బైన ధర్ము వెఱిం
గెడువారు మనుష్యులు కారె? యిట్టి మనుష్యజన్మంబు వడసి వృద్ధోపసేవ సేయవు
గా కేమి? ధర్ము వెఱుంగక నిర్దయుండ వై మాబోఁటిపేదమృగంబులకు భయం
బుగ గర్జిలితి; వీ వెవ్వండవు? మనుష్యగోచరంబు గాని యివ్వనంబున కేల వచ్చితి?
సిద్ధగతి లేనివారి కిట వోవ నశక్యం; బమృతకల్పంబు లైనయీఫలమూలంబు
లుపయోగించి క్రమ్మఱుము; నీయందు బద్ధస్నేహుండఁ గాన బుద్ధి సెప్పితి; నా
పలుకులు చేకొను” మనిన భీము డి ట్లనియె.

⁠ 322


తే.⁠

“క్షత్త్రియప్రవరుండ విఖ్యాతబలుండఁ
బాండుతనయుండ గొంతిగర్భంబునందు
వాయువరమునఁ బుట్టినవాఁడ నన్ను
భీముఁ డండ్రు భూజనులు కపిప్రభుండ!

⁠ 323


వ.⁠

ఏ నిక్కడఁ గార్యార్థినై పోయెద; నాకుం దెరు వి; మ్మీనినాఁడు దొల్లి శతయో
జనవిస్తారం బయినసముద్రంబు లంఘించి లంకకుం బోయినహనుమంతు నట్ల
నిన్ను, నీపర్వతంబు లంఘించి పోదు” ననిన హనుమంతుఁ “డతం డేమికారణంబున
సముద్రలంఘనంబుఁ జేసె? నెఱుంగుదేనిం జెప్పు” మనిన వానికి భీముం డి
ట్లనియె.

⁠ 324


క.⁠

“[4]అలఘుయశుం డిక్ష్వాకుని
కుల[5]తిలకుఁడు రాఘవుండు గురు[6]వచన మిలన్
నిలిపి వనవాసియై తన
లలనం గోల్పడియె నట్టె లంకేశ్వరుచేన్.

⁠ 325


క.⁠

సీతాన్వేషణపరులై
నీతిఁ గపి ప్రవరు లరిగి నిరతంబుగ సం
పాతి యనుపక్షిచేత మ
హీతనయ సువార్త లెల్ల నెఱిఁగి కడంకన్.

⁠ 326


క.⁠

వారలు వారిధి గడవఁగ
నేరక తారున్నయెడ ననిలసత్త్వమునన్
వారిధి లంఘించె మహా
వీరుఁడు హనుమంతుఁ డనఁగఁ విందుఁ గపీంద్రా!

⁠ 327


వ.⁠

ఏను హనుమంతునంతియబలపరాక్రమంబులు గలవాఁడ; నాపౌరుషంబుఁ జూ
పుదునే?” యనిన నవ్యక్తహాసముఖుం డగుచు “నన్నా! యేను ముదిసినవాఁడ; లేవ
నోపం; బోయెదవేని నాతోఁకం బాయం ద్రోచి పొ” మ్మనిన మెచ్చక తనవామ
కరంబున నెత్తం బోయి వశంబు గాక.

⁠ 328


ఉ.⁠

ఏపున రెండుచేతులను నిమ్ముగఁ బట్టి యమర్చి యెత్తగా
నోపక [7]మోఁకరిల్లఁబడి యుద్గతఘర్మజలార్ద్రదేహుఁ డై,

⁠
  1. ↑ నిజసత్త్వ
  2. ↑ మెత్తమెత్తన
  3. ↑ యున్న, వాని నీతోడఁబుట్టినవాని
  4. ↑ అలఘుం డిక్ష్వాకు మహా
  5. ↑ వీరుఁడు ... వచనంబుం, జలిపి
  6. ↑ వచనంబునన్, సలుప
  7. ↑ మ్రొగ్గతిల్లఁ; మోఁకతిల్లఁ