Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.⁠

“గురుశుశ్రూష యొనర్చుచుఁ
బరమక్లేశమునఁ జేసి పడసిన విద్యల్
స్ఫురియించుఁగాక; గురుముఖ
విరహితముగఁ బడసినవియు వెలయునె యెందున్?

⁠ 282


వ.⁠

నీవు గురుముఖంబునం బడయక యొండువిధంబునం బడయుటం జేసి నీయధ్యయ
నశ్రుతంబులు నిర్వీర్యంబు లయ్యె; గురుశుశ్రూషాసంతోషకరుం డై రైభ్యుండు
బ్రహ్మజ్ఞానం బుపార్జించెం; గావున నాతం డిట్టిశక్తి వడసె” నని దేవతలు దివంబున
కరిగి; రిది యవక్రీతునివాసం; బిందు వసియించినవారు దురితవిముక్తు లగుదు; రిది
కాలశైలం; బిది సప్తవిధం బైనగంగ; యిది మనుష్యుల కగోచరం, బిందయుండి
సమాధిశౌచపిరయత్నపరులై చూడుం; డిది మందరనగం; బిందు నానాప్రహర
ణపాణులై యష్టాశీతిసహస్రగంధర్వులు కిన్నరకింపురుషసుపర్వులు సురేంద్రుం
గొలిచి బోయెద; రిందుల కాఱునూఱుయోజనంబులు గలదు కైలాసపర్వతం;
బిందుఁ గుబేరుం డుండు” నని రోమశుండు సెప్పినం బాండవులు కృతసమాధిశీ
లురై వానినెల్లం జూచి; రంత నంతకసుతుండు భీమున కి ట్లనియె.

⁠ 283


సీ.⁠

“దుర్గమం బైన యీదుర్గమార్గంబున
                 నడవంగ నేర; మున్నతరథముల
నింద్రసేనాదుల, నీధౌమ్యవిప్రుల,
                 ద్రుపదతనూజను దోడికొనుచు
సహదేవుఁడును నీవుఁ జట్టనఁ గ్రమ్మఱుఁ;
                 డేనును, నకులుండును నేఁగి రోమ
శాదేశమునఁ జేసి యఖిలతీర్థంబులు
                 నాడి వచ్చెదము; మాయరుగుదెంచు

⁠


ఆ.⁠

నంత కెంతయును బ్రయత్నంబుతోఁ గృష్ణ
గాచియుండుఁ” డనిన ఘనుఁడు భీముఁ
డనియె “నిట్టి రాక్షసాకీర్ణవనములో
నిన్నుఁ బాయనగునె నిమిష మేని?

⁠ 284


చ.⁠

అనఘచరిత్రు, నర్జును, మహాభుజు నొక్కనిఁ బాసి వంతఁ బొం
దినయెడ, నిట్టిచోట సహదేవుఁడు, నేనును, గృష్ణయున్ జగ
జ్జననుత! నిన్నుఁ బాసిన నసహ్యతరం బగు తీవ్రతాపవే
దన యగు నీకు మాకు, నుచితంబె పరస్పరభేద మెన్నఁడున్?

⁠ 285


క.⁠

కడు డస్సి నడవనోపని
యెడ నీకమలాయతాక్షి, నీకవలను నే
దడయక [1]నఱకట నిడికొని
కడఁకం గొనివత్తు విషమగహనాంతములన్.

⁠ 286


వ.⁠

ఈరథంబులతోఁ బోవ నిమ్ముగాదేని వీని నింద్రసేనాదుల నెందేని బెట్టి పోద”
మనిన రోమశుం డి ట్లనియె.

⁠ 287


క.⁠

“అతులతపోవీర్యబలో
న్నతిఁ బోదము గంధమాదవంబునకు; సమా
గతు నందుఁ గాంతు మర్జును,
నతివీరు, నుదారు, [2]సురగణార్చితుఁ, బార్థున్.”

⁠ 288


వ.⁠

అనిన నందఱు సంతసిల్లి యరుగువారు ముందర ననేకపహయరథసనాథం బై,
యపారకిరాతబలసంకులం బైనదానిఁ, బుళిందాధిపతి యైనసుబాహుపురంబుఁ
గని యందు వానిచేతం బూజితులై తమరథసూతహయనివహంబుల నింద్ర

⁠
  1. ↑ నయింతు నా యఱ, కడ నిడుకొని పఱతు నెట్టి; యఱకడ నిడికొని, కడకం గొనివత్తు మిమ్ము
  2. ↑ నురుగుణాన్వితుఁ