| |
భార్గవుం డయిన చ్యవనునిభార్య” నని చెప్పిన విని వారలు నగి “యక్కటా! యిట్టి
రూపవిభవంబులు వడసి కామభోగబాహ్యుఁ డయిన వృద్ధు భార్గవుని వరియిం
చి నీజవ్వనం జెల్ల వృథ చేసి; తింక నైనను నీ వయోరూపంబులకుం దగిన వరు
వరియింపు; మేము వానిఁ దెచ్చెద” మనిన నప్పలుకులు సహింపక సుకన్య యా
శ్వినుల కి ట్లనియె.
| 184
|
| ఆ. |
“చ్యవనునందు నాకు సంతతప్రీతియై
యుండ నిట్లుపలుకు టుచిత మగునె?”
యని నిజేశ్వరునకు నప్పుడ వారల
[1]పలుకు లెఱుఁగఁ జెప్పెఁ బంకజాక్షి.
| 185
|
| వ. |
చ్యవనుండు దానిపతివ్రతాత్వంబునకు సంతసిల్లి వారల పలుకుల కొడంబడు
మని పంచిన, నది పతిచేత ననుజ్ఞాత యై చని, “నాకు నవయౌవనవరుం గావిం
పుం” డనిన నాశ్విను లప్పు డక్కొలను సొచ్చిరి; భార్గవుండును వారితోడ సరఃప్ర
వేశంబు సేసె; ని ట్లమ్మువ్వురు నవయౌను లయి సుకన్యకడకు వచ్చి నిలిచి “మా
యందు నీ వలచువానిని వరియింపు” మనిన నది తనపతియైన భార్గవుని వరియిం
చె నంత నయ్యాశ్వినుల కతిప్రీతుండయి చ్యవనుం డి ట్లనియె.
| 186
|
చ్యవనుఁ డాశ్వినుల సోమపీథులఁ జేయుట
| తే. |
ఏను మీకారణంబున నిపుడు లబ్ధ
యౌవనుండ నై ధన్యుండ నైతి; మిమ్ము
సోమపీథులఁ జేసెద సురలరాజు
సూచుచుండఁగ శర్యాతిసుక్రతువున.”
| 187
|
| వ. |
అని చెప్పిన నాశ్వినులు సంతసిల్లి యరిగి, రిట శర్యాతి భార్గవు జరాభారపరి
త్యాగంబు విని విస్మితుం డై యల్లునిం గూఁతుం జూడవచ్చిన నాతని సత్కృ
తుం జేసి, భార్గవుం డి ట్లనియె.
| 188
|
| క. |
“విదితముగ నిన్నుఁ జేయిం
చెదఁ గ్రతువు ధరాధినాథ! చేయుముఁ నీ క
భ్యుదయం బగు; సంభారస
ముదయము సమకట్టు” మనిన మునివచనమునన్.
| 189
|
| క. |
అనఘుఁడు శర్యాతి మఖం
బొనరించె విధిప్రయోగయుతముగ; నం దా
శ్వినులకు సోమం బీఁ బో
యిన భృగుపుత్త్రునకు నలిగి యింద్రుం డనియెన్.
| 190
|
| క. |
“వీరిద్దఱు సోమార్హులు
గా రమరులవెజ్జు; లిది యకర్తవ్యము; బృం
దారకులు గానివారికి
వారింపక సోమ మిచ్చువారుం గలరే?”
| 191
|
| వ. |
అనిన నింద్రవచనం బాదరింపక చ్యవనుం డాశ్వినుల సోమపీథులం జేసిన దా
ని సహింపక యింద్రుం డలిగి.
| 192
|
| క. |
జృంభించి వజ్ర మెత్తిన
జంభాంతకు వజ్రయుత[2]భుజాస్తంభము సం
స్తంభించి, యతనిఁ బటుసం
రంభంబునఁ జంపఁ గడఁగి రౌద్రాకృతితోన్.
| 193
|
| క. |
చ్యవనుఁడు వేల్చిన నం దు
[3]ద్భవ మయ్యె నపారఘోరబలయుతుఁడు మహా
జవుఁడు, మదుం డనురాక్షసుఁ
డవనిచరద్యుచరభీకరాకారుం డై.
| 194
|
- ↑ పలుకులెల్లఁ
- ↑ భుజస్తంభమ్మున్
- ↑ ద్భవించెఁ గృత్యకుఁ డపారబలయుతుఁడు; ద్భవుఁ డయ్యె నపారభూరిబలయుతుఁడు; ద్భవించెఁ గృత్య యనివార్యబలయుతుఁడు