Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

రింపక యాశ్వినుల సోమపీథులం జేసె” ననిన “నది యె” ట్లని యడిగిన ధర్మజునకు
సౌకన్యాఖ్యానంబు సవిస్తరంబుగా రోమశుం డిట్లనియె.

⁠ 173

రోమశుఁడు ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సెప్పుట

క.⁠

“ఇక్కొలనిసమీపంబునఁ
బెక్కగువేలేండ్లు తపము భృగుసుతుఁడు గరం
బక్కజముగ నొనరించెను
[1]వెక్కసనియమమున నిరతవీరాసనుఁ డై.

⁠ 174


క.⁠

అమ్మునిదేహము వల్మీ
కమ్మునఁ గప్పంగఁబడి, [2]నఘనవల్లీగు
ల్మమ్ములు పైఁ బ్రాఁకిన నన
యమ్మును నేర్పడక యుండె నవ్వనభూమిన్.

⁠ 175


వ.⁠

అంతం బెద్దగాలంబునకు శర్యాతి యనురాజు దనచతుస్సహస్రదేవీనివహంబు
తోడఁ దత్సరోవరంబున విహరింప నరిగిన, నాతనికూఁతురు సుకన్య యనునది
యిష్టసఖులతోఁ గ్రుమ్మరుచున్న నవ్వల్మీకంబునందు.

⁠ 176


క.⁠

విద్యుల్లతాంగి భార్గవు
నుద్యన్నయనములు మెఱచుచున్నను విలస
త్ఖద్యోతద్యుతులొకొ! యని
సద్యస్సంజాతబుద్ధిసంభ్రమ యగుచున్.

⁠ 177


వ.⁠

అప్పు డప్పుట్ట గ్రొప్పించిన నలిగి నిమీలితనయనుం డై చ్యవనుండు శర్యా
తిసైన్యంబుల కెల్ల మూత్రపురీషనిరోధంబుఁ జేసిన, నది దనసైన్యాపరాధం
బున నయ్యెఁ గా వగచి వాఁ డెల్లవారి నడిగి తత్కారణం బెఱుంగనేరక చిం
తాపరుం డై యున్నఁ దండ్రికడకు వచ్చి సుకన్య యి ట్లనియె.

⁠ 178


తే.⁠

“మిన్నమిడుఁగుఱు [3]లట్టులై మెఱసి రెండు
మెఱుగు లొకపుట్టలో నున్న నెఱుఁగ కేను
బుట్ట గ్రొప్పించి యా రెంటి పొలుపుఁ గాన
కుడిగి వచ్చితి విస్మయపడి మనమున.

⁠ 179


వ.⁠

ఈసైన్యనిరోధంబున కిది నిమిత్తం బగునో” యనిన శర్యాతి యప్పు డాపుట్ట
యొద్దకు వచ్చి యందుఁ దపఃక్లేశంబున కృశత్వగస్థీభూతశరీరు నతివృద్ధు భార్గ
వుం గని నమస్కరించి యి ట్లనియె.

⁠ 180


క.⁠

“అమితంబగు మీతపము మ
హిమ యెఱుఁగక యిట్లు చేసె నిది; దీని సహిం
పుము దయ; మత్సైన్యనిరో
ధము వాపుమ, యెఱుకగలరె తరుణులు ధరణిన్?”

⁠ 181


వ.⁠

అనిన భార్గవుండు కరుణించి యతిశయరూపయౌవనగర్విత యైన యాకన్యకం
బరిగ్రహించి కాని సహింపననిన శర్యాతి తనకూఁతు నమ్మునివరున కిచ్చి నిజ
సైన్యనిరోధంబుఁ బాచికొని చనిన.

⁠ 182


ఆ.⁠

పతికిఁ బరమభక్తిఁ బరిచర్య సేయుచు
నొనరఁగా సుకన్య యుండునంత
నాలతాంగికడకు నాశ్విను లేతెంచి,
తమ్మెఱుంగఁ జెప్పి దాని కనిరి.

⁠ 183


వ.⁠

“అవ్వా! నీ వెవ్వని కూఁతుర? వెవ్వని భార్య?” వని యడిగిన “నేను శర్యాతికూఁతుర;

⁠ 184
  1. ↑ వెక్కగ యమనియమనిరతి; వెక్కసమగు నియమనిరతి; వెక్కకు యమనియమనిరతి
  2. ↑ నికట
  3. ↑ లై రెండు మెఱచుచున్న ... పొడవుఁ గాన